
ముంబై: కస్టమర్ల గుర్తింపు ధృవీకరణ కోసం (కేవైసీ) ఆధార్‌ను వినియోగించరాదంటూ సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ విధానాలకు అనుమతినివ్వాలంటూ రిజర్వ్ బ్యాంక్‌ను పేమెంట్స్ సంస్థలు విజ్ఞప్తి చేశాయి. ఫేస్ రికగ్నిషన్ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించేందుకు అనుమతించాలని కోరాయి. కస్టమర్లు తమ ధృవీకరణ పత్రాన్ని అప్‌లోడ్ చేసి, ఆ తర్వాత కెమెరా ముందు మరోసారి దాన్ని నిర్ధారించేలా ఒక ప్రతిపాదనను ఆర్‌బీఐకి సమర్పించినట్లు పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) చైర్మన్ నవీన్ సూర్య తెలిపారు.
ఈ విధానంలో కస్టమర్ అప్‌లోడ్ చేసిన పత్రాన్ని ఆల్గోరిథం ఆధారంగా సిస్టమ్ ధృవీకరించుకుంటుందని, ఆ తర్వాత కెమెరా ముందు కూర్చున్న వ్యక్తిని ఆ డాక్యుమెంట్‌లోని ఫొటోతో సరిపోల్చి చూసుకుని నిర్ధారణ చేస్తుందని ఆయన తెలిపారు. ఆర్‌బీఐ ఇంకా తమ ప్రతిపాదనకు అంగీకరించలేదని, ఇందుకు సుమారు ఆరు నెలలు పట్టొచ్చని సూర్య పేర్కొన్నారు.