ఎన్నికల రాష్ట్రాల్లోనూ వ్యవసాయ రుణమాఫీ ఎఫెక్ట్
ముంబై: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు రైతు రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించడంతో అన్నదాతలు బ్యాంకులకు లోన్ల చెల్లింపును జాప్యం చేస్తున్నారు. ఈ చెల్లింపుల జాప్యం త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకూ వ్యాపిస్తోందని ఎస్‌బీఐ పేర్కొంది. ‘జూన్ క్వార్టర్లో కొత్తగా ఎన్‌పీఏగా మారిన రూ.9,932 కోట్ల రుణాల్లో రూ.1,959 కోట్లు(సుమారు 20%) వ్యవసాయ రంగానివే.
ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల వాటాయే రూ.600 కోట్లు. రుణ చెల్లింపుల్లో ప్రజలకు క్రమశిక్షణ ఉండాలని మా నమ్మకం. ఈ రెండు రాష్ట్రాలకూ అధిక సామర్థ్యం ఉందని కూడా మా విశ్వాసం. బ్యాంకు రుణ సేవలను అందుకోలేకపోతే ఈ రెండు రాష్ట్రాలూ తమ సామర్థ్యాన్ని అందుకోజాలవు’ అని ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య వ్యాఖ్యానించారు.
చెల్లింపుల జాప్యం సమస్య వ్యవసాయ రుణాలకే పరిమితం కాలేదు. ఇల్లు, బంగారం వంటి వాటికోసం రైతులు తీసుకున్న రుణాలు కూడా మొండిబకాయిలుగా మారుతున్నాయని ఆమె అన్నారు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే రూ.150 కోట్ల హౌసింగ్, గోల్డ్ లోన్లను చెల్లించలేదని చెప్పారు. రుణాలు చెల్లించకపోవడం అనే సమస్య ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకూ విస్తరించడం ఆర్థిక వ్యవస్థకే ఆందోళన కలిగించే అంశమని అన్నారు.