రెండో వారమూ ‘ఫెడ్’ ఎఫెక్ట్!
వారంలో 13 డాలర్లు తగ్గిన పసిడి
న్యూయార్క్/ముంబై: అమెరికా ఫెడ్ ఫండ్ రేటు (ప్రస్తుతం 1–1.25 శాతం) బుధవారం పావు శాతం పెరిగిన నేపథ్యంలో పసిడి నెమ్మదించింది. రేటు పెరుగుతుందన్న అంచనాలతో జూన్ 9తో ముగిసిన వారంలోనే... ఐదువారాల పరుగును ఆపి బంగారం 10 డాలర్లు తగ్గింది. ఈ అంచనాలను నిజం చేస్తూ... 14వ తేదీన ఫెడ్ తీసుకున్న రేటు పెంపు నిర్ణయంతో 16వ తేదీతో ముగిసిన వారంలో మరో 13 డాలర్లు తగ్గింది. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్ఛంజ్‌లో ఔన్స్ (31.1 గ్రా)కు 1,256 డాలర్లకు చేరింది. అంటే పక్షం రోజుల్లో పసిడి దాదాపు 23 డాలర్లు తగ్గింది. పక్షం రోజుల క్రితం ముగిసిన మూడు వారాల కాలంలో పసిడి 60 డాలర్లు పెరిగింది.
డాలర్ బలహీనపడుతుందన్న అంచనాలు ఇందుకు కారణంకాగా, రేటు పెంపు డాలర్ ఇండెక్స్‌కు సానుకూలమన్న తక్షణ అంచనాలు పసిడిలో ఇన్వెస్లర్ల లాభాల స్వీకరణకు కారణమైంది. వారం మధ్యలో బుధవారం– పసిడి 1,283 డాలర్ల వద్దకు చేరినా... ఆ స్థాయిలో నిలబడలేకపోయింది. వెనువెంటనే ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణతో గ్రాఫ్ కిందకు పడిపోయింది. ఇక డాలర్ ఇండెక్స్ మాత్రం వారం వారీగా స్వల్పంగా తగ్గి 97.24 నుంచి 97.16కు చేరింది.
అయితే అమెరికా ఆర్థిక, రాజకీయ పరిణామాలు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు అలాగే అమెరికా అధ్యక్షుడి డాలర్ ‘బలహీన’ లక్ష్యం విధానాలు పసిడి పెరుగుదలకు భవిష్యత్తులో దోహదపడతాయన్న అంచనాలూ ఉన్నాయి. పసిడికి 1,240 డాలర్ల వద్ద పటిష్ట మద్దతు ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. పసిడి తగ్గుదల కొనుగోళ్లకు అవకాశమన్నది పలువురి విశ్లేషణ. 103.88 గరిష్ట స్థాయిని చూసిన డాలర్ ఇండెక్స్ ప్రస్తుతం 97 స్థాయికి పడిపోయింది.
భారత్‌లోనూ డౌన్ ట్రెండ్..
అంతర్జాతీయంగా పసిడి భారీగా పడిన ప్రభావం దేశంలో కనబడింది. మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్ లో బంగారం ధర 10 గ్రాములకు జూన్ 16వ తేదీతో ముగిసిన వారంలో స్వల్పంగా రూ.329 తగ్గి రూ.28,690కు దిగింది. అంతక్రితం మూడు వారాల్లో ధర ఇక్కడ దాదాపు రూ. 1,000 పెరిగింది. ఇక దేశీయంగా ప్రధాన ముంబై స్పాట్ మార్కెట్లో వారం వారీగా పసిడి ధర 99.9 స్వచ్ఛత 10 గ్రాములకు రూ.275 తగ్గి రూ.28,820కి చేరింది. మరోవైపు వెండి కేజీ ధర వారం వారీగా భారీగా రూ.1,125 తగ్గి రూ.38,960కి చేరింది.