ఇన్‌ఫ్రా దిగాలు!
♦ ఏప్రిల్‌లో ఉత్పాదకత 2.5% క్షీణత
♦ బొగ్గు, క్రూడ్, సిమెంట్ పేలవం!
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో దాదాపు 38 శాతం వాటా కలిగిన ఎనిమిది పరిశ్రమల ఇన్‌ఫ్రా గ్రూప్ ఉత్పత్తి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నెల– ఏప్రిల్‌లో పేలవ పనితనాన్ని ప్రదర్శించింది. 2016 ఏప్రిల్‌తో పోల్చిచూస్తే, 2017 ఏప్రిల్‌లో అసలు వృద్ధిలేకపోగా ఉత్పత్తి 2.5 శాతం క్షీణించింది (మైనస్). బొగ్గు, క్రూడ్ ఆయిల్, సిమెంట్ రంగాల పేలవ పనితీరు దీనికి కారణం. ఇంకా ఈ గ్రూప్‌లో నేచురల్ గ్యాస్, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, స్టీల్, విద్యుత్ రంగాలు ఉన్నాయి. ఈ గ్రూప్ 2016 ఏప్రిల్ వృద్ధి రేటు 8.7 శాతం.
ఎనిమిది రంగాలూ వేర్వేరుగా...
⇔ బొగ్గు: –1.8% క్షీణత.. –3.8 శాతానికి చేరింది.
⇔ క్రూడ్ ఆయిల్: క్షీణతలోనే ఉన్నా ఇది –2.2 శాతం నుంచి –0.6 శాతానికి తగ్గింది.
⇔ సిమెంట్: 4.3 శాతం వృద్ధి రేటు నుంచి –3.7 శాతం క్షీణతకు పడిపోయింది.
⇔ నేచురల్ గ్యాస్: –6.9 శాతం క్షీణత నుంచి 2 శాతం వృద్ధికి మళ్లింది.
⇔ రిఫైనరీ: 19.1% వృద్ధి 0.2%కి పడింది.
⇔ ఎరువులు: –3% క్షీణత నుంచి 6.2%కి ఎగసింది.
⇔ స్టీల్: వృద్ధి 4.5% నుంచి 9.3 శాతానికి చేరింది.
⇔ విద్యుత్: ఉత్పాదకత వృద్ధి 14.5 శాతం నుంచి 4.7 శాతానికి పడిపోయింది.