
సాక్షి,ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. ముఖ్యంగా జియో బూస్ట్‌తో లాభాల్లోనూ, ఆదాయంలోనూ గణనీయమైన వృద్ధిని సాధించి ఎనలిస్టులు అంచనాలను బ్రేక్ చేసింది. సెప్టెంబర్ 30తో ముగిసిన క్వార్టర్ 2లో 9,516 కోట్ల రూపాయల నికర లాభాలను సాధించింది. వార్షిక ప్రాతిపదికన నికరలాభాల్లో 17శాతం వృద్ధిని నమోదు చేసింది. మొత్తం ఆదాయం రూ.1.43 లక్షల కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ .9,516కోట్లు. ఎబిటా మార్జిన్లు రూ. 3573కోట్లుగా ఉంది. ఆర్‌ఐఎల్ చరిత్రలో భారీ లాభాలను సాధించిన త్రైమాసికం ఇదేనని ఎనలిస్టులు చెబుతున్నారు.
స్టాక్ ఎక్స్ఛేంజీల తాజా సమాచారం ప్రకారం, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ భారతదేశంలోని అన్ని లిస్టెడ్ కంపెనీలలో అత్యంత విలువైన సంస్థల్లో ఒకటిగా ఉంది. నేటి ముగింపు సమయానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ .7.28 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను సాధించింది. మరోవైపు కేబుల్ టీవీ, హై స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను పెద్దయెత్తున విస్తరించే క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశీయంగా అతి పెద్ద కేబుల్ ఆపరేటర్ హాథ్‌వే కేబుల్ అండ్ డేటాకామ్, డెన్ నెట్‌వర్క్స్ సంస్థలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలను ప్రకటించింది.