
కార్డు లేకున్నా క్రెడిట్‌పై ఫోన్లు
స్మార్ట్‌ఫోన్ల వెల్లువ, నెలవారీ వాయిదా పద్ధతులు(ఈఎంఐ), ఆధునిక రిటైల్ ఔట్‌లెట్లు.. వెరసి మొబైల్ ఫోన్ల మార్కెట్ కొత్త పుంతలు తొక్కుతోంది.
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్‌ఫోన్ల వెల్లువ, నెలవారీ వాయిదా పద్ధతులు(ఈఎంఐ), ఆధునిక రిటైల్ ఔట్‌లెట్లు.. వెరసి మొబైల్ ఫోన్ల మార్కెట్ కొత్త పుంతలు తొక్కుతోంది. గతంలో ఏడాదిన్నర, రెండేళ్లకు ఫోన్ మార్చేవారు. ఇప్పుడు 9 నెలలకే కొత్త మోడల్ కావాలంటున్నారని రిటైల్ చైన్ సంస్థ యూనివర్‌సెల్ టెలికమ్యూనికేషన్స్ అంటోంది. పాతదానితో పోలిస్తే కొత్త ఫోన్‌కు 50 నుంచి 100 శాతం అదనంగా వ్యయం చేస్తున్నారని సంస్థ ఫౌండర్ డి.సతీష్ బాబు తెలిపారు. ఇందుకు సరాసరి విక్రయ ధర(ఏఎస్‌పీ) పెరుగుతున్న తీరు నిదర్శనమని అన్నారు. తమ ఔట్‌లెట్లలో ఏఎస్‌పీ ఏటా 25-30 శాతం వృద్ధితో, ప్రస్తుతం రూ.6,500కు చేరిందని చెప్పారు. కస్టమర్లలో 20 శాతంపైగా మహిళలు ఉంటున్నారని తెలిపారు. గురువారం హైదరాబాద్ వచ్చిన ఆయన సాక్షి బిజినెస్ బ్యూరోతో ప్రత్యేకంగా మాట్లాడారు.
క్రెడిట్ కార్డు లేకపోయినా..
క్రెడిట్ కార్డు లేని కస్టమర్లకు ఈఎంఐ ద్వారా కూడా మొబైల్ ఫోన్లను అందిస్తామని సతీష్ బాబు తెలిపారు. ఇతర ఔట్‌లెట్లలో కొనుగోలు చేసిన ఫోన్లకు కూడా బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు. మొబైల్ ఫోన్ల పట్ల కస్టమర్లకు పూర్తి స్థాయి అనుభూతి కల్పించేందుకు యూనివర్‌సెల్ సింక్ పేరుతో ఔట్‌లెట్లను తెరుస్తున్నట్టు చెప్పారు. ఫోన్లలో ఏవైనా సమస్యలు తలెత్తితే కస్టమర్ ఇంటికి తమ సాంకేతిక సిబ్బంది వెళ్లి రిపేర్ చేస్తారని వివరించారు. జీరో మార్జిన్‌కే ఫోన్లను విక్రయిస్తున్నట్టు వెల్లడించారు. ఫోన్లను అమ్మినందుకుగాను కంపెనీల నుంచి ఆదాయం అందుకుంటున్నట్టు తెలిపారు.
ఫ్రాంచైజీ విధానంలో స్టోర్లు: దక్షిణాది రాష్ట్రాలు, మహారాష్ట్రతో కలిపి యూనివర్‌సెల్‌కు 450 ఔట్‌లెట్లు ఉన్నాయి. విస్తరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని చిన్న పట్టణాల్లో ఫ్రాంచైజీ విధానంలో 200 స్టోర్లను ఏడాదిలో ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే ఆన్‌లైన్‌లో మొబైల్స్‌ను విక్రయిస్తున్న ఈ సంస్థ అమెజాన్, స్నాప్‌డీల్‌తోపాటు ఇతర ఆన్‌లైన్ సంస్థలతో చేతులు కలుపుతోంది. వివిధ కంపెనీలకు చెందిన 5 రకాల సెల్‌ఫోన్లు కేవలం యూనివర్‌సెల్‌లో మాత్రమే లభిస్తాయి. కంపెనీ నెలకు 2 లక్షల ఫోన్లను విక్రయిస్తోంది. ఇందులో స్మార్ట్‌ఫోన్ల వాటా 60 శాతం.