న్యూఢిల్లీ : ఐదు కోట్ల మంది ప్రావిడెంట్ ఫండ్ సబ్‌స్క్రైబర్లకు ఈపీఎఫ్‌ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. షేర్లలో పెట్టుబడులుగా పెట్టే పీఎఫ్ మొత్తాన్ని, మార్కెట్ ధరలో సబ్‌స్క్రైబర్లు రిడీమ్ చేసుకునే ప్రతిపాదనను ఆమోదించింది. గురువారం భేటీ అయిన రిటైర్‌మెంట్ ఫండ్ బాడీ సెంట్రల్ బోర్డు ట్రస్టీలు, ఈక్విటీ లింక్ అయ్యే పెట్టుబడులకు కొత్త అకౌంటింగ్ పాలసీని తీసుకొచ్చారు. ఈ పాలసీ కింద 15 శాతం పీఎఫ్ మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్ లాగా ఈక్విటీల రూపంలో సబ్‌స్క్రైబర్లకు ఇవ్వనున్నారు. ఎప్పుడైతే సబ్‌స్క్రైబర్ ఫండ్ నుంచి బయటికి వచ్చేస్తారో ఆ సమయంలో ఈ మొత్తాన్ని రిడీమ్ చేసుకోవచ్చని సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీల తర్వాత జరిపిన 219వ సమావేశం అనంతరం కార్మిక మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ తెలిపారు. ఎక్స్చేంజ్ ట్రేడెట్ ఫండ్ల ద్వారా ఈక్విటీ రూపంలో 15 శాతం వరకు పీఎఫ్ మొత్తాన్ని పెట్టుబడులుగా పెట్టే సౌకర్యాన్ని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అనుమతి కల్పిస్తుందని పేర్కొన్నారు.
గురువారం జరిపిన భేటీలో సెంట్రల్ బోర్డు ట్రస్టీలకు కార్మిక మంత్రి చైర్మన్ లాగా ఉండగా.. ట్రేడ్ యూనియన్లు, ఎంప్లాయర్ అసోసియేషన్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు ప్రతినిధులుగా ఉన్నారు. ఇక వచ్చే ఏడాది నుంచి పీఎఫ్ సబ్‌స్క్రైబర్లకు రెండు అకౌంట్లు ఉండనున్నాయి. ఒక అకౌంట్ ద్వారా 85 శాతం మొత్తాన్ని డెట్‌లో ఇన్వెస్ట్ చేయనున్నారు. దీనికి ఈపీఎఫ్‌ఓ వడ్డీ చెల్లించనుంది. మిగతా 15 శాతాన్ని ఈక్విటీలో పెట్టుబడులుగా పెట్టనున్నారు. ఈక్విటీ భాగంలో రిటర్నులు మార్కెట్ ధరపై ఆధారపడి ఉంటాయి. 85 శాతం మొత్తాన్ని వడ్డీతో చెల్లిస్తే, మిగతా 15 శాతాన్ని సేకరించిన యూనిట్ల సంఖ్యను మార్కెట్ ధరతో గుణిస్తారు. మంచి రిటర్నులు కావాలనుకుంటే, మూడేళ్ల వరకు ఈ ఈక్విటీ పెట్టుబడుల మొత్తాన్ని విత్‌డ్రా చేయకుండా సబ్‌స్క్రైబర్ వాయిదా వేసే ఆప్షన్ కలిగి ఉండవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment