ETF units
-
ఈపీఎఫ్వోపై తగ్గనున్న వడ్డీ రేటు!
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధిపై వడ్డీ రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. 2016–17 ఆర్థిక సంవత్సరానికి 8.65 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేయగా, 2017–18కి సంబంధించి వడ్డీ రేటును ఖరారు చేయాల్సి ఉంది. ‘‘ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) భవిష్యనిధి డిపాజిట్లపై 2017–18 సంవత్సరానికి రాబడుల రేటును తగ్గించొచ్చు. బాండ్లపై తక్కువ రాబడులకుతోడు, ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) యూనిట్లను చందాదారుల ఖాతాల్లో జమ చేయనుండటమే ఇందుకు కారణం’’ అని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. పైగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆదాయ అంచనాలను ఇంకా రూపొందించాల్సి ఉందన్నారు. ఈక్విటీల్లో పెట్టుబడుల విలువను గణించే విధానానికి ఈపీఎఫ్‌వో ఇప్పటికే ఆమోదం కూడా తెలిపిన విషయం తెలిసిందే. ఈ విధానాన్ని ఐఐఎం బెంగళూరుతో కలసి రూపొందించడం జరిగింది. దీని ప్రకారం సబ్స్క్రయిబర్ల ఖాతాల్లో ఈటీఎఫ్ యూనిట్లను జమ చేస్తారు. దీంతో ప్రతీ ఈపీఎఫ్ఓ సభ్యుడు తన ఖాతాలో నగదు బ్యాలన్స్ ఎంతుంది, ఎన్ని ఈటీఎఫ్ యూనిట్లు ఉన్నదీ తెలుసుకోగలరు. ఈటీఎఫ్‌లపై వచ్చే డివిడెండ్‌ను సైతం వారి ఖాతాల్లోనే జమ చేస్తారు. ఈక్విటీ ఆధారిత పెట్టుబడులపై వాస్తవ రాబడి రేటు ఉపసంహరణ సమయంలోనే తెలుస్తుంది. -
ఈపీఎఫ్‌ఎఓ సబ్స్క్రైబర్లకు మరో గుడ్‌న్యూస్
న్యూఢిల్లీ : ఐదు కోట్ల మంది ప్రావిడెంట్ ఫండ్ సబ్స్క్రైబర్లకు ఈపీఎఫ్ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. షేర్లలో పెట్టుబడులుగా పెట్టే పీఎఫ్ మొత్తాన్ని, మార్కెట్ ధరలో సబ్స్క్రైబర్లు రిడీమ్ చేసుకునే ప్రతిపాదనను ఆమోదించింది. గురువారం భేటీ అయిన రిటైర్మెంట్ ఫండ్ బాడీ సెంట్రల్ బోర్డు ట్రస్టీలు, ఈక్విటీ లింక్ అయ్యే పెట్టుబడులకు కొత్త అకౌంటింగ్ పాలసీని తీసుకొచ్చారు. ఈ పాలసీ కింద 15 శాతం పీఎఫ్ మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్ లాగా ఈక్విటీల రూపంలో సబ్స్క్రైబర్లకు ఇవ్వనున్నారు. ఎప్పుడైతే సబ్‌స్క్రైబర్ ఫండ్ నుంచి బయటికి వచ్చేస్తారో ఆ సమయంలో ఈ మొత్తాన్ని రిడీమ్ చేసుకోవచ్చని సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీల తర్వాత జరిపిన 219వ సమావేశం అనంతరం కార్మిక మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ తెలిపారు. ఎక్స్చేంజ్ ట్రేడెట్ ఫండ్ల ద్వారా ఈక్విటీ రూపంలో 15 శాతం వరకు పీఎఫ్ మొత్తాన్ని పెట్టుబడులుగా పెట్టే సౌకర్యాన్ని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అనుమతి కల్పిస్తుందని పేర్కొన్నారు. గురువారం జరిపిన భేటీలో సెంట్రల్ బోర్డు ట్రస్టీలకు కార్మిక మంత్రి చైర్మన్ లాగా ఉండగా.. ట్రేడ్ యూనియన్లు, ఎంప్లాయర్ అసోసియేషన్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు ప్రతినిధులుగా ఉన్నారు. ఇక వచ్చే ఏడాది నుంచి పీఎఫ్ సబ్స్క్రైబర్లకు రెండు అకౌంట్లు ఉండనున్నాయి. ఒక అకౌంట్ ద్వారా 85 శాతం మొత్తాన్ని డెట్‌లో ఇన్వెస్ట్ చేయనున్నారు. దీనికి ఈపీఎఫ్ఓ వడ్డీ చెల్లించనుంది. మిగతా 15 శాతాన్ని ఈక్విటీలో పెట్టుబడులుగా పెట్టనున్నారు. ఈక్విటీ భాగంలో రిటర్నులు మార్కెట్ ధరపై ఆధారపడి ఉంటాయి. 85 శాతం మొత్తాన్ని వడ్డీతో చెల్లిస్తే, మిగతా 15 శాతాన్ని సేకరించిన యూనిట్ల సంఖ్యను మార్కెట్ ధరతో గుణిస్తారు. మంచి రిటర్నులు కావాలనుకుంటే, మూడేళ్ల వరకు ఈ ఈక్విటీ పెట్టుబడుల మొత్తాన్ని విత్‌డ్రా చేయకుండా సబ్‌స్క్రైబర్ వాయిదా వేసే ఆప్షన్ కలిగి ఉండవచ్చు. -
పీఎఫ్ ఖాతాల్లోకే ఈటీఎఫ్ యూనిట్లు...!
ఈపీఎఫ్ఓ యోచన న్యూఢిల్లీ: ఎక్సే్ఛంజ్ ట్రేడింగ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌లు)లో ప్రావిడెంట్ ఫండ్ సంస్థ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) చేసే పెట్టుబడుల ద్వారా వచ్చే యూనిట్లను నేరుగా ప్రావిడెంట్ ఖాతాల్లో జమచేయాలని ఈపీఎఫ్ఓ యోచిస్తోంది. దాంతో ఈపీఎఫ్ఓ చందాదారులు అడ్వాన్సుల్ని తీసుకునే సమయంలో ఈ యూనిట్లను రీడీమ్ చేసుకునే వెసులుబాటు వుంటుందని ఈపీఎఫ్ఓ భావిస్తోంది. ఈటీఎఫ్ యూనిట్లను ఖాతాల్లో జమచేసే అంశమై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) అభిప్రాయాల్ని ఈపీఎఫ్ఓ కోరింది. కాగ్ త్వరలోనే అభిప్రాయాల్ని వెల్లడిస్తుందని తాము భావిస్తున్నట్లు సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ వీపీ జాయ్ చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేటప్పటికి ఈటీఎఫ్‌ల్లో ఈపీఎఫ్ఓ పెట్టుబడులు రూ. 45,000 కోట్లకు చేరతాయని అంచనా. కాగ్ అభిప్రాయాలు అందిన తర్వాత ఈ ప్రతిపాదన కార్మిక మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని ఈపీఎఫ్ఓ ట్రస్టీల బోర్డు ముందుకు వెళుతుంది. ట్రస్టీల బోర్డు సమావేశం వచ్చే నెలలో జరగవచ్చు. ఈపీఎఫ్ఓ పెట్టుబడి చేసే నిధుల్లో 5 శాతం ఈటీఎఫ్‌ల్లో 2015 ఆగస్టు నుంచి ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ మొత్తాన్ని 15 శాతానికి పెంచారు.