పీఎఫ్ ఖాతాల్లోకే ఈటీఎఫ్ యూనిట్లు...!
ఈపీఎఫ్‌ఓ యోచన
న్యూఢిల్లీ: ఎక్సే్ఛంజ్ ట్రేడింగ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌లు)లో ప్రావిడెంట్ ఫండ్ సంస్థ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) చేసే పెట్టుబడుల ద్వారా వచ్చే యూనిట్లను నేరుగా ప్రావిడెంట్ ఖాతాల్లో జమచేయాలని ఈపీఎఫ్‌ఓ యోచిస్తోంది. దాంతో ఈపీఎఫ్‌ఓ చందాదారులు అడ్వాన్సుల్ని తీసుకునే సమయంలో ఈ యూనిట్లను రీడీమ్ చేసుకునే వెసులుబాటు వుంటుందని ఈపీఎఫ్‌ఓ భావిస్తోంది. ఈటీఎఫ్ యూనిట్లను ఖాతాల్లో జమచేసే అంశమై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) అభిప్రాయాల్ని ఈపీఎఫ్‌ఓ కోరింది.
కాగ్ త్వరలోనే అభిప్రాయాల్ని వెల్లడిస్తుందని తాము భావిస్తున్నట్లు సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ వీపీ జాయ్ చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేటప్పటికి ఈటీఎఫ్‌ల్లో ఈపీఎఫ్‌ఓ పెట్టుబడులు రూ. 45,000 కోట్లకు చేరతాయని అంచనా. కాగ్ అభిప్రాయాలు అందిన తర్వాత ఈ ప్రతిపాదన కార్మిక మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని ఈపీఎఫ్‌ఓ ట్రస్టీల బోర్డు ముందుకు వెళుతుంది. ట్రస్టీల బోర్డు సమావేశం వచ్చే నెలలో జరగవచ్చు. ఈపీఎఫ్‌ఓ పెట్టుబడి చేసే నిధుల్లో 5 శాతం ఈటీఎఫ్‌ల్లో 2015 ఆగస్టు నుంచి ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ మొత్తాన్ని 15 శాతానికి పెంచారు.