న్యూఢిల్లీ: ఉద్యోగం పోయిన నెల తర్వాత పీఎఫ్ మొత్తంలో 75 శాతం వరకూ వెనక్కి తీసుకునే వెసులుబాటును రిటైర్మెంట్ నిధి, ఈపీఎఫ్‌ఓ(ఎంప్లాయిస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్) కల్పిస్తోంది. మిగిలిన మొత్తాన్ని ఈపీఎఫ్‌ఓ వద్దే అట్టిపెట్టుకోవచ్చని కార్మిక శాఖ మంత్రి సంతోశ్ కుమార్ గంగ్వార్ పేర్కొన్నారు. ఉద్యోగం పోయిన 2 నెలల తర్వాత మిగిలిన 25 శాతాన్ని తీసుకోవచ్చని, ఫైనల్ సెటిల్మెంట్ కూడా చేసుకోవచ్చని వివరించారు.
ఈ మేరకు ఎంప్లాయీ ప్రావిడెండ్ ఫండ్ స్కీమ్, 1952లో మార్పులు, చేర్పులు చేయాలని నిర్ణయించామని ఈపీఎఫ్‌ఓ, ట్రస్టీల కేంద్ర బోర్డ్‌కు చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్న సంతోష్ వివరించారు. ప్రస్తుతానికి... ఉద్యోగం పోయిన రెండు నెలల తర్వాతనే ఈపీఎఫ్‌ఓ సభ్యుడు తన పీఎఫ్‌ను విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఫైనల్ సెటిల్మెంట్ కూడా అప్పుడే చేసుకోవచ్చు.
మరోవైపు ఐదు ఫండ్ మేనేజర్ల కాలపరిమితిని ఈ ఏడాది డిసెంబర్ 31 వరకూ పొడిగించామని గంగ్వార్ తెలిపారు. పోర్ట్‌ఫోలియో మేనేజర్ల ఎంపికకు కన్సల్టెంట్ నియామక ప్రతిపాదన కూడా ఆమోదం పొందిందన్నారు. ఈ ఏడాది మే కల్లా ఈటీఎఫ్ పెట్టుబడులు రూ.47,431 కోట్లకు చేరాయని, త్వరలోనే ఈ పెట్టుబడులు రూ.లక్ష కోట్లకు చేరతాయని చెప్పారు. ఈ ఏడాది మేతో ముగిసిన సంవత్సరానికి 16% రాబడి వచ్చిందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment