రాబడుల విషయంలో ఈక్విటీలను మించి అధిక రాబడులనిచ్చే సాధనాలు దాదాపుగా లేవనే చెప్పాలి. దీర్ఘకాలిక మూలధన లాభాలు రూ.లక్ష దాటితే 10 శాతం పన్ను ప్రవేశపెట్డం వల్ల రాబడులు పెద్దగా ప్రభావితం కావని, ఈక్విటీలు భవిష్యత్తులోనూ మెరుగైన రాబడులనే ఇస్తాయన్నది విశ్లేషకుల అంచనా. ఈ నేపథ్యంలో... స్టాక్ మార్కెట్లు గరిష్ట స్థాయిలో ఉన్నా కూడా రిస్క్ పెద్దగా లేకుండానే తగిన రాబడులు కావాలనుకునే వారు ఎల్ అండ్ టీ ప్రుడెన్స్ ఫండ్‌ను పరిశీలించొచ్చు.
ఎల్‌అండ్‌టీ ప్రుడెన్స్ ఫండ్ ఈక్విటీ ఆధారిత బ్యాలన్స్‌డ్ ఫండ్. పథకం పరిధిలోని మొత్తం నిధుల్లో 65 శాతం వరకు ఈక్విటీల్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. మిగిలిన 35 శాతం మేరకు డెట్ మార్కెట్లో పెట్టుబడి పెడతారు. మార్కెట్లు పెరిగి ఉన్నప్పటికీ మరింత ర్యాలీ చేస్తే ఆ అవకాశం కోల్పోకుండా ఈక్విటీ పెట్టుబడులు ఉపయోగపడతాయి. అదే సమయంలో కరెక్షన్‌కు లోనైతే రిస్క్ తక్కువగా ఉండేందుకు డెట్ ఎక్స్‌పోజర్ సాయపడుతుంది. కనుక ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో ఈ ఫండ్ ఒక మంచి ఆప్షన్.
పెట్టుబడుల విధానం, పనితీరు
మార్కెట్ల ర్యాలీ ఎంత పద్ధతి ప్రకారం ఉన్నాగానీ ఈ ఫండ్ ఈక్విటీ పెట్టుబడులను పరిమితికి మించి పెంచదు. ఏ సమయంలో చూసినా ఈక్విటీ ఎక్స్‌పోజర్ 65–75 శాతం మధ్యలోనే ఉంటుంది. మార్కెట్లు బుల్ ర్యాలీ సమయంలో ఎక్స్‌పోజర్‌ను గరిష్టంగా 75 శాతం వరకు పెంచుతుంది. ఆటుపోట్లు ఎక్కువైతే పెట్టుబడుల్ని 65 శాతానికి పరిమితం చేస్తుంది. ఈక్విటీల్లోనూ రిస్క్ తక్కువ ఉండే విభాగంపైనే ఎక్కువ దృష్టి పెడుతుంది.
ఆటుపోట్లు ఎక్కువగా ఉండే మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో (మార్కెట్ క్యాప్ రూ.10,000 కోట్లకు తక్కువగా ఉన్నవి) పెట్టుబడుల్ని 30 శాతం మించకుండా చూస్తుంది. అలాగే డెట్ వైపు కూడా ఏఏఏ, ఏఏ రేటింగ్ ఉన్న బాండ్లలోనే ఇన్వెస్ట్ చేస్తుంది. బాండ్లలోనూ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఎక్స్‌పోజర్ పెంచుకోవడం, తగ్గించుకోవడం చేస్తుంటుంది.
ఈక్విటీ విభాగంలో 2013లో సాఫ్ట్‌వేర్, కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్ రంగాలు, 2014 ర్యాలీలో బ్యాంకింగ్, 2016లో కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్ స్టాక్స్‌లో పెట్టుబడుల ద్వారా గణనీయమైన రాబడులనే అందించింది. ఏడాది, మూడేళ్లు, ఐదేళ్ల కాలాన్ని పరిశీలించి చూస్తే ఎల్ అండ్ టీ ప్రుడెన్స్ ఫండ్ ఇదే విభాగంలోని ఇతర ఫండ్ పథకాల కంటే సగటున 3–4 శాతం మెరుగైన రాబడులనే అందించింది. ఏడాది కాలంలో 24.3 శాతం, మూడేళ్లలో 12.4 శాతం, ఐదేళ్లలో సగటున 18.6 శాతం వార్షిక రాబడులను ఇచ్చింది. టాటా బ్యాలన్స్‌డ్ ఫండ్, ఫ్రాంక్లిన్ బ్యాలన్స్‌డ్, డీఎస్‌పీబీఆర్ బ్యాలన్స్‌డ్ ఫండ్ పథకాల కంటే ఎల్ అండ్ టీ ప్రుడెన్స్ రాబడుల్లో ముందుంది.
పోర్ట్‌ఫోలియో
ఈక్విటీలో 70 నుంచి 80 స్టాక్స్ వరకు పెట్టుబడుల కోసం ఎంచుకుంటుంది. ప్రస్తుతం డెట్ విభాగంలో 26.6 శాతం పెట్టుబడులున్నాయి. లార్జ్‌క్యాప్ స్టాక్స్‌తో పోలిస్తే బుల్ ర్యాలీ కారణంగా మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ ధరలు అనూహ్యంగా పెరిగిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో పెట్టుబడులను 10 శాతం లోపునకు తగ్గించుకుంది. గడిచిన ఏడాది కాలంలో బ్యాంకింగ్, ఫైనాన్స్, కన్‌స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ రంగాలకు ప్రాధాన్యం ఇచ్చింది. డెట్ వైపు గత ఏడాది కాలంలో సార్వభౌమ బాండ్ల స్థానాన్ని కార్పొరేట్ బాండ్లతో భర్తీ చేసింది.
ఫండ్ పెట్టుబడులు ఎలా..?
విభాగం నిధులు (శాతం)
డెట్ 26.6
బ్యాంకులు 13.7
ఫైనాన్స్ 9.3
కన్‌స్ట్రక్షన్ ప్రాజెక్టులు 5.3
ఫార్మా 5.1
ఆటో 4.9
ఇతర విభాగాలు 35.1
Comments
Please login to add a commentAdd a comment