ఈక్విటీలు దీర్ఘకాలంలో మంచి రాబడులను ఇచ్చే సాధనం. కానీ, పెట్టుబడికి, రాబడులకు ఎప్పుడూ రిస్క్ ఎంతో కొంత ఉంటుంది. కనుక పెట్టుబడులన్నీ తీసుకెళ్లి ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయకుండా, భిన్న సాధనాల మధ్య వైవిధ్యం ఉండేలా చూసుకోవాలంటూ సూచనలిస్తుంటారు ఆర్థిక సలహాదారులు. పోర్ట్‌ఫోలియో రిస్క్‌ను తగ్గించి స్థిరమైన రాబడులను ఇచ్చే సాధనాలు ఎన్నో ఉన్నాయి. వీటిని పరిశీలించినప్పుడు పెట్టుబడుల మధ్య వైవిధ్యం, సమతుల్యత కోసం రికరింగ్ డిపాజిట్(ఆర్‌డీ) మంచి ఆప్షన్. బ్యాంకులు అందిస్తున్న రికరింగ్ డిపాజిట్ సాధనాలను ఇన్వెస్టర్లు తమ మధ్య కాలం నుంచి దీర్ఘకాలిక అవసరాల కోసం తప్పకుండా పరిగణనలోకి తీసుకోవచ్చు.
ప్రయోజనాలు...
ఫిక్స్‌డ్ డిపాజిట్ లాభాలు ఆర్‌డీలోనూ ఉంటాయి. కాకపోతే దీనికి అదనంగా పెట్టుబడులకు క్రమశిక్షణ అన్నది ఆర్‌డీతో సాధ్యం. నిర్ణీత కాలానికి, ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాల్సి ఉంటుంది కనుక... అనవసర దుబారా కంటే పెట్టుబడికి ప్రాధాన్యం గుర్తుకొస్తు్తంది. కనీసం రూ.100 నుంచి కూడా ఆర్‌డీ చేసుకునేందుకు బ్యాంకులు అవకాశం ఇస్తున్నాయి. సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా, బంధన్‌బ్యాంకులు వంటివి తక్కువ మొత్తానికే వీలు కల్పిస్తుంటే, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వంటి పెద్ద బ్యాంకులు రూ.1,000 నుంచి ఆర్‌డీ చేసుకునేందుకు అనుమతిస్తున్నాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్ అంటే ఒకేసారి ఒకే మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసుకోవాలి. అదే ఆర్‌డీ అయితే ప్రతీ నెలా ఇంత చొప్పున నిర్ణీత కాలం వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.
వడ్డీ రేట్లు...
రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు ఆర్‌డీ టర్మ్ (కాల వ్యవధి)ను బట్టి వేర్వేరుగా ఉంటాయి. అది కూడా బ్యాంకులను బట్టి మారిపోతుంటాయి. అయితే, ఫిక్స్‌డ్ డిపాజిట్లకు దగ్గరగానే ఈ రేట్లు ఉండడాన్ని గమనించొచ్చు. ప్రైవేటు రంగ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ప్రభుత్వరంగ బ్యాంకులతో పోలిస్తే అధిక రేటు ఆఫర్ చేస్తోంది. 27–36 నెలల కోసం ఆర్‌డీ చేసేట్టు అయితే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఆఫర్ చేస్తున్న రేటు 7.4%. 60 ఏళ్లు దాటిన వారికి అరశాతం వడ్డీ రేటు అదనంగా ఇస్తోంది. బంధన్ బ్యాంకు అయితే 7.65% వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. సీనియర్ సిటిజన్లకు 0.75% ఎక్కువ ఇస్తోంది. ఇక బ్యాంకులతోపాటు డిపాజిట్లు సేకరించే ఎన్‌బీఎఫ్‌సీలు కూడా ఆర్‌డీ పథకాలను అందిస్తున్నాయి. వీటిల్లో వడ్డీ రేట్లు బ్యాంకుల్లో కంటే ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే ఎన్‌బీఎఫ్‌సీల్లో ఆర్‌డీ చేసే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే బ్యాంకుల్లో చేసే రూ.లక్ష వరకు డిపాజిట్లకు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ బీమా ఉంటుంది. అదే ఎన్‌బీఎఫ్‌సీల్లో చేసే డిపాజిట్లకు బీమా వర్తించదు. తమ అవసరాలకు అనుగుణంగా ఆర్‌డీ టర్మ్‌ను ఎంచుకోవచ్చు. చాలా బ్యాంకులు ఆరు నెలల నుంచి పదేళ్ల కాల వ్యవధి వరకు టర్మ్‌లతో కూడిన ఆర్‌డీలను అనుమతిస్తున్నాయి. కాకపోతే ఒక్కసారి టర్మ్ ఎంచుకున్న తర్వాత అందులో మార్పులకు అవకాశం ఉండదు.
అత్యవసరాల్లో అక్కరకు
ఆర్‌డీలో మరో వెసులుబాటు ఉంది. అత్యవసర నిధి సమకూర్చుకోని వారు, అత్యవసర సందర్భాల్లో నిధులకు ఆర్‌డీ అక్కరకు వస్తుంది. ఆర్‌డీలో ఉన్న బ్యాలెన్స్‌పై రాయితీ రేటుతో రుణం తీసుకోవచ్చు. కొన్ని బ్యాంకులు నిర్ణీత వాయిదాల తర్వాత ఓవర్‌డ్రాఫ్ట్ కల్పిస్తున్నాయి. బంధన్ బ్యాంకు 6 నెలల తర్వాత ఓవర్‌డ్రాఫ్ట్‌ను ఆఫర్ చేస్తోంది. నిర్ణీత వ్యవధికి ముందే ఆర్‌డీని క్లోజ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. చాలా బ్యాంకులు ఇందుకు అనుమతిస్తున్నాయి. కాకపోతే అప్పటి వరకు గడించిన వడ్డీ నుంచి కొంత ఉపసంహరించుకుంటాయి. ఇది సాధారణంగా 1–2% ఉండొచ్చు. కొన్ని బ్యాంకులు దీనికి బదులు ఆర్‌డీ చేసినప్పుడు ఉన్న రేట్ల ప్రకారం... ఎంత కాలానికి ఆర్‌డీ ఉంచారో చూసి ఆ మేరకు రేటును అమలు చేస్తున్నాయి. ఈ వడ్డీని గడువు తీరాకే చెల్లిస్తున్నాయి. ఇక మూలం వద్ద పన్ను కోత(టీడీఎస్)ను ఆర్‌డీలకు బ్యాంకులు అమలు చేస్తున్నాయి. 2018–19 ఏడాది వరకు ఒక ఏడాదిలో వడ్డీ ఆదాయం రూ.10,000 దాటితే టీడీఎస్ అమలవుతుంది. తర్వాత నుంచి ఈ పరిమితి రూ.40,000కు పెరగనుంది. మొత్తం ఆదాయం ఆదాయపన్ను శ్లాబ్ కంటే తక్కువే ఉంటే ఫామ్ 15జీ (సీనియర్ సిటిజన్లు ఫామ్ 15హెచ్) సమర్పించడం ద్వారా టీడీఎస్ లేకుండా చూసుకోవచ్చు.
ఇన్వెస్ట్‌మెంట్ విధానం
మీరు ఇప్పటికే బ్యాంకు కస్టమర్ అయితే, నెట్‌బ్యాంకింగ్ ద్వారా ఆర్‌డీని ఆన్‌లైన్‌లో ప్రారంభించుకోవచ్చు. అలాగే, బ్యాంకు శాఖకు వెళ్లి కూడా ఆర్‌డీని మొదలుపెట్టొచ్చు. దరఖాస్తుతోపాటు అవసరమైన డాక్యుమెంట్లను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. నిజానికి ఆర్‌డీ అన్నది క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేసుకునేందుకు అందుబాటులో ఉన్న సాధనాల్లో మంచి ఉపకరణం. కాకపోతే రెగ్యులర్‌గా వడ్డీ చెల్లించే ఆప్షన్ ఇందు లో ఉండదు. అలాగే, క్యుములేటివ్ ఇంటరెస్ట్, అసలు కలిపి గడువు తీరిన తర్వాతే చెల్లించడం జరుగుతుంది. రెగ్యులర్‌ఆర్‌డీకి అదనంగా ఇన్వెస్ట్ చేసే వెసులుబాటు ఉంటే ఫ్లెక్సీ ఆర్‌డీ లేదా మరో ఆర్‌డీ ఖాతా ప్రారంభించకుంటే సరిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment