స్థిరాస్తికి ఈక్విటీ జోష్! | equity funds in real estate | Sakshi
Sakshi News home page

స్థిరాస్తికి ఈక్విటీ జోష్!

Published Fri, Mar 18 2016 10:40 PM | Last Updated on Sun, Sep 3 2017 8:04 PM

స్థిరాస్తికి ఈక్విటీ జోష్!

స్థిరాస్తికి ఈక్విటీ జోష్!

ఈ ఏడాది 3 నెలల్లో 420.45 మిలియన్ డాలర్ల పెట్టుబడులు
వంద శాతం ఎఫ్‌డీఐ, రీట్స్, రేరా బిల్లులతో మరింత జోష్
వీసీ సర్కిల్ నివేదికలో వెల్లడి..    
హైదరాబాద్ ప్రాజెక్ట్‌ల్లోనూ ఈక్విటీ నిధులు

గతంలో స్థిరాస్తి రంగమంటే.. సరైన అమ్మకాల్లేక.. విదేశీ పెట్టుబడులూ రాక..  రుణాల మంజూరులో కనికరించని బ్యాంకులతో.. అరకొర నిధులతో కునారిల్లే రంగం!

 కానీ, ఇప్పుడో.. ప్రైవేట్ ఈక్విటీలు, డెబిట్ వెంచర్లకు తోడుగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ), రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ (రీట్స్) వంటి సరికొత్త పెట్టుబడులతో భారీగా నిధుల ప్రవాహం పారే అతిపెద్ద రంగం!!

 .. ఇది అక్షరాల నిజం. ఎందుకంటే ఈ ఏడాది (జనవరి-మార్చి) తొలి మూడు నెలల్లోనే భారత స్థిరాస్తి రంగంలోకి 420.45 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి మరి. అయితే గతేడాదితో పోలిస్తే ఇది తక్కువే. ఎందుకంటే ఇదే మూడు నెలల్లో గతేడాది 520 మిలియన్ డాలర్లు నిధులొచ్చాయని వీసీ సర్కిల్ నివేదిక చెబుతుంది. 2011 నుంచి 2016 మార్చి నాటికి మొత్తం 42 ఒప్పందాల ద్వారా 3,635.24 మిలియన్ డాలర్ల నిధులొచ్చాయని వివరించింది.

 మరిన్ని వివరాలివిగో..
ఇప్పటివరకు దేశ స్థిరాస్తి రంగంలో ప్రైవేట్ ఈక్విటీలు, ఎఫ్‌డీఐ పెట్టుబడులు పెట్టాలంటే అడ్డగోలు నిబంధనలు మోకాలడ్డేవి. వాణిజ్య సముదాయాల్లో అయితే మరీను. కానీ, తాజాగా కేంద్రం స్థిరాస్తి రంగంలోకి వంద శాతం ఎఫ్‌డీఐలకు పచ్చజెండా ఊపడంతో పాటూ రీట్స్ రూపంలో మరో పెట్టుబడి పథకాన్ని తీసుకొచ్చింది. ఆయా పెట్టుబడుల్లో పారదర్శకత, అడ్డగోలు మోసాలకు కళ్లెం వేసేందుకు స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి బిల్లుకూ ఆమోదముద్ర వేసింది. దీంతో స్థిరాస్తి రంగంలో పెట్టుబడుల్లో పారదర్శకతతో పాటు జవాబుదారీతనమూ పెరుగుతుందని నిపుణులంటున్నారు. దీంతో ఇన్నాళ్లు పెట్టుబడులకు దూరంగా ఉన్న విదేశీ ఇన్వెస్టర్లు, అంతర్జాతీయ పెట్టుబడిదారులు వాణిజ్య, నివాస సముదాయాలు రెండింట్లోనూ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే అవకాశముందని చెబుతున్నారు.

విదేశీ సంస్థలు పెట్టుబడులు పెట్టాయంటే.. ఆయా సంస్థలకు అంతర్జాతీయ ఖ్యాతి లభించినట్లే. భవన నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాల్ని పాటించే బిల్డర్లకే, మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న వారికే ఈ అవకాశమొస్తుందని నిపుణులంటున్నారు. యూఎస్, యూకే తదితర అభివృద్ధి మార్కెట్లలో గిట్టుబాటయ్యే వడ్డీ తక్కువే. ఈ కారణంగానే ప్రైవేటు ఈక్విటీ ఇన్వెస్టర్ల తమ పెట్టుబడులను మన దేశ స్థిరాస్తి రంగం వైపు మళ్లిస్తున్నారనేది వారి అభిప్రాయం. అయితే స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి బిల్లు (రేరా) ప్రకారం.. 70 శాతం అమ్మకాలు నిర్మాణ వ్యయానికి, మిగిలిన 30 శాతం ఈక్విటీ లేదా రుణాలను భూసేకరణ కోసం లేదా ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు వినియోగించుకునే వీలుంటుంది. అయితే ఆయా పెట్టుబడులకు గాను సుమారు 25 శాతం ధరను నిర్ణయిస్తారు ఈక్విటీ ఇన్వెస్టర్లు.

 నిధులు సమీకరించిన సంస్థల్లో కొన్ని..
కొటక్ మహేంద్రా గ్రూప్‌కు చెందిన కొటక్ రియల్టీ ఫండ్ నివాస సముదాయాల విభాగంలో ఇటీవల 250 మిలియన్ డాలర్ల (సుమారు రూ.1,600 కోట్లు) నిధులను సమీకరించింది. ఈ పెట్టుబడులను అందుబాటు గృహాల నిర్మాణం కోసం వినియోగిస్తామని కొటక్ రియల్టీ ఫండ్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ వికాస్ చీమకుర్తి చెప్పారు.

♦  ఆస్క్ ఇండియా రియల్ ఎస్టేట్ స్పెషల్ ఆపర్చునీటీస్ ఫండ్ మొత్తం 200 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. ఇందులో ఈ ఏడాదికి గాను 146 మిలియన్ డాలర్లను ఇప్పటికే పొందింది కూడా. ఈ పెట్టుబడులతో ముంబై, పుణె, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ వంటి ఆరు నగరాల్లో నివాస సముదాయాల ప్రాజెక్ట్‌ను ప్రారంభించేందుకు వినియోగిస్తామని ప్రకటించింది.

♦  హైనెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్‌ఎన్‌ఐ), బీమా సంస్థల నుంచి మైల్‌స్టోన్ క్యాపిటల్ మొత్తం 500 కోట్ల పెట్టుబడులను సమీకరించింది. ఈ ఏడాది జనవరిలో ఇప్పటికే రూ.150 కోట్లు సమీకరించింది. మిగిలిన మొత్తాన్ని మరో ఆరు నెలల్లో సమీకరిస్తామని ప్రకటించింది.

భాగ్యనగరం తక్కువేం కాదు!
ప్రైవేట్ ఈక్విటీ ఫండ్లను సమీకరించడంలో హైదరాబాద్ నిర్మాణ సంస్థలూ తక్కువేం కాదు. భాగ్యనగరం ప్రత్యేకతలు, ఇక్కడి స్థిరాస్తి ధరల గురించి తెలిసిన జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, ఇన్వెస్టర్లు స్థానిక డెవలపర్లు చేపట్టే ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నారు. ప్రధానంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్, నార్సింగి, మణికొండ, మాదాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, తెల్లాపూర్ వంటి ప్రాంతాల్లో చేపట్టే ప్రాజెక్ట్‌లపై దృష్టిసారిస్తున్నారు.

నగరానికి చెందిన మంజీరా కన్‌స్ట్రక్షన్స్, జనప్రియ ఇంజినీర్స్ సిండికేట్, అపర్ణా, సాకేత్ గ్రూప్ తదితర సంస్థలు ఇప్పటికే విదేశీ సంస్థల పెట్టుబడులను ఆకర్షించిన జాబితాలో ఉన్నాయి. ఇందులో కొన్ని ప్రాజెక్ట్‌లు పూర్తికాగా, మరికొన్ని చివరి దశలో ఉన్నాయి. తాజాగా పిరామిల్ ఫండ్ సంస్థ ఆదిత్యా కన్‌స్ట్రక్షన్ కంపెనీకి చెందిన ఓ హైరేజ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌లో పెట్టుబడులు పెట్టింది. ఇంకా పలు సంస్థలు, నగరానికి చెందిన స్థానిక డెవలపర్లతో కలిసి గేటెడ్ కమ్యూనిటీలు, ఆఫీసు సముదాయాల్లో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం.

మంజీరా గ్రూప్‌లో లండన్‌కు చెందిన ట్రినిటీ క్యాపిటల్ పెట్టుబడుల్ని పెట్టింది. దీంతో కేపీహెచ్‌బీ కాలనీలో మూడు ప్రాజెక్టుల్ని చేసిందీ సంస్థ. మోర్గాన్ స్టాన్లీతో కలసి అపర్ణా గ్రూప్ నల్లగండ్లలో అపర్ణా సరోవర్ ప్రాజెక్టును చేపట్టింది.

అమెస్టర్ డ్యామ్‌కు చెందిన యాత్రా క్యాపిటల్.. సాకేత్ ఇంజినీర్స్‌లో ఏడు మిలియన్ యూరోలను పెట్టుబడిగా పెట్టింది. ఇది సుమారు రూ. 40 కోట్లతో సమానం.

రాజమండ్రిలో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ 50 ఎకరాల్లో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌లో ప్రైవేట్ ఈక్విటీ  రూపంలో రూ. 25 కోట్ల రూపాయలను పెట్టుబడులుగా  సమీకరించింది.

 స్థిరాస్తులకు సంబంధించి మీ సందేహాలు మాకు రాయండి. 
realty@sakshi.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement