
సురేష్ కొత్త టీవీ కొందామనుకున్నాడు. దగ్గర్లోని షాపులతో పాటు... ఆన్‌లైన్లోనూ వెదికాడు. ముందైతే ఓ 35వేల బడ్జెట్‌తో 42 అంగుళాల టీవీ కొందామనుకున్నాడు. కానీ సెర్చ్ చేస్తున్న క్రమంలో తాజాగా ఎంటీ ఇచ్చిన ఓ చైనా కంపెనీ రూ.40వేలకే 55 అంగుళాల టీవీ విక్రయిస్తున్నట్లు తెలిసింది. వాకబు చేసిన మీదట... నాణ్యత కూడా బాగానే ఉందని తెలియటంతో దానికే ఓటేశాడు. కొనుక్కున్నాడు.
సాక్షి, బిజినెస్ విభాగం: ఆర్జన శక్తి పెరుగుతుండటంతో జనం కాస్తంత ఎక్కువ ఖర్చు పెట్టినా ప్రీమియం ఉత్పత్తులనే కొనుగోలు చేయడానికి మొగ్గు చూపిస్తున్నారు. దీనికితోడు మార్కెట్లో పోటీ కారణంగా ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాలు రకరకాల ఫీచర్లతో కాస్తంత తక్కువ ధరలకే దొరుకుతున్నాయి కూడా. ఓ సాధారణ ఫ్రిజ్‌కు బదులు రెండు మూడు కంపార్టుమెంట్లు ఉండే అధిక సామర్థ్యం కలిగిన స్మార్ట్ టెక్నాలజీ రిఫ్రిజిరేటర్లు, ఓ సాధారణ టీవీకి బదులు 4కే అల్ట్రా టెక్నాలజీతో కూడిన ఫుల్ హెచ్‌డీ స్మార్ట్ టీవీ, దుస్తుల్ని ఉతకడంతోపాటు వాటిని నిమిషాల్లో ఆరబెట్టే ఫీచర్లతో కూడిన ఫ్రంట్‌లోడ్ వాషింగ్ మెషీన్లు, సాధారణ ఏసీలకు బదులు ఖరీదైనా గానీ విద్యుత్ ఆదా చేసే ఇన్వర్టర్ ఏసీలు... ఇవీ కస్టమర్ల ఎంపికలుగా మారుతున్నాయి. పరిశ్రమ మొత్తం వృద్ధితో పోలిస్తే ప్రీమియం ఉత్పత్తుల అమ్మకాల వృద్ధి రేటు గణనీయంగా ఉండటం మారుతున్న ధోరణికి అద్దం పడుతోందని చెప్పొచ్చు.
సాంకేతికత, డిజైన్‌కు మొగ్గు
ప్రపంచ స్థాయి టెక్నాలజీలు అందివస్తుండడం, జీవన విధానంలో మార్పులతో వినియోగదారుల అభిరుచిలో మార్పు వచ్చింది. కన్జ్యూమర్ డ్యూరబుల్స్‌ను కేవలం వినియోగ ఉత్పత్తులుగానే చూడడం లేదని శాంసంగ్ ఇండియా కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ విభాగం వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ భూటానీ చెప్పారు. మెరుగైన వినియోగం కోసం మంచి సాంకేతికతతో కూడిన ఉత్పత్తులను ఎంచుకోవడంపై అవగాహన కలిగి ఉంటున్నారని ఆయన తెలియజేశారు. ప్రీమియం ఉత్పత్తులు చూడ్డానికి అందంగా కనిపించడంతోపాటు దుమ్ము పట్టని ఫ్యాన్లు, విద్యుత్ ఆదా చేసే ఏసీలు తరహా ఉన్నత శ్రేణి ఫీచర్లను కలిగి ఉండడం వాటి అమ్మకాలను పెంచుతోంది. ఏసీలు, మైక్రోవేవ్ ఓవెన్లు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు ఇలా అన్ని రకాల ఉత్పత్తుల్లోనూ ప్రీమియం (ఖరీదైన/ఉన్నతశ్రేణి) ట్రెండ్ కనిపిస్తోంది. ‘‘బాష్ ప్రీమియం వాషింగ్ మెషీన్ల విక్రయాల్లో వృద్ధి ఇతర ఉత్పత్తులతో పోలిస్తే రెట్టింపు స్థాయిలో ఉంది. డిమాండ్ పెరుగుతుండడంతో ఉత్పత్తులను ప్రమోషన్లు, సులభ రుణ వాయిదాల్లో అందించే దిశగా మాకు ప్రోత్సాహాన్నిస్తోంది’’ అని బీఎస్‌హెచ్ హౌస్‌హోల్డ్ అప్లయెన్సెస్ ఎండీ, సీఈవో గుంజన్ శ్రీవాస్తవ తెలిపారు. ‘‘గడిచిన ఆర్థిక సంవత్సరంలో కన్జ్యూమర్ డ్యురబుల్స్ పరిశ్రమలో సగటు వృద్ధి ఏడు శాతంగా ఉంది. అదే ప్రీమియం ఉత్పత్తుల విభాగంలో మాత్రం 20 శాతం చొప్పున వృద్ధి నమోదైంది. ఏసీల్లో 15 శాతం వృద్ధి ఉంటే, ఇన్వర్టర్ ఏసీల విక్రయాల్లో 25 శాతం పెరుగుదల ఉంది. వినియోగదారులు తమ సౌకర్యం కోసం మంచి డిజైన్, మెరుగైన టెక్నాలజీతో కూడిన ఉత్పత్తులను కోరుకుంటున్నారు. ఇందుకోసం అధికంగా చెల్లించేందుకూ వారు వెనుకాడడం లేదు’’ అని గోద్రేజ్ అప్లయెన్సెస్ ఈవీపీ కమల్ నంది తెలిపారు.
చిన్న పట్టణాల్లోనూ ఇదే ధోరణి
ఈ విధమైన ధోరణి కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాలేదు. ఖరీదైన ఉత్పత్తులకు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ డిమాండ్ పెరుగుతోందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తాము క్యుఎల్‌ఈడీ సిరీస్‌ను ఆవిష్కరించినప్పుడు 40 శాతం బుకింగ్‌లు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచే జరిగినట్టు శాంసంగ్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ భూటీని పేర్కొన్నారు. ఇంటర్నెట్ అందుబాటు పెరగడంతో చిన్న పట్టణాల్లోని కస్టమర్లు సైతం ఉత్పత్తులకు సంబంధించి సమాచారం తెలుసుకుంటున్నారని కమల్ నంది తెలిపారు. ప్రీమియం ఉత్పత్తుల మార్కెట్‌లో తాము మెరుగైన స్థితిలో ఉన్నామని భూటాని చెప్పారు. టీవీలు, రిఫ్రిజిరేటర్లు, మైక్రోవేవ్ ఓవెన్ విభాగాల్లో తామే లీడర్‌గా ఉన్నట్టు చెప్పారు.
దిగుమతులే అధికం...
ప్రీమియం ఉత్పత్తుల్లో చాలా వరకు దిగుమతి అవుతున్నవే. కంపెనీలు వాటిపై భారీగా దిగుమతి సుంకాలు చెల్లించి దిగుమతి చేసుకుంటున్నాయి. రిఫ్రిజిరేటర్లపై 28 శాతం జీఎస్టీతోపాటు 10 శాతం దిగుమతి సుంకం కూడా అమల్లో ఉంది. హై ఎండ్ ప్రీమియం రిఫ్రిజిరేటర్ల దిగుమతులను ఇక ముందూ కొనసాగిస్తామని, తమ విక్రయాలు ఇక్కడ భారీగా లేకపోయినప్పటికీ అవి పెరుగుతున్నట్టు జాన్సన్ కంట్రోల్స్ హిటాచి ఎయిర్ కండీషనింగ్ చైర్మన్, ఎండీ గుర్మీత్‌సింగ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment