బామ్మ మాటా బంగారు బాట | No, the way to grandmother | Sakshi
Sakshi News home page

బామ్మ మాటా బంగారు బాట

Published Fri, Jun 13 2014 10:49 PM | Last Updated on Sat, Sep 2 2017 8:45 AM

బామ్మ మాటా బంగారు బాట

బామ్మ మాటా బంగారు బాట

డబ్బు సంపాదించడమనేది కష్టం కావొచ్చు.. కాకపోవచ్చు. కానీ ఎప్పటికప్పుడు పెరిగిపోతున్న ఖర్చులు, మారిపోతున్న జీవన విధానాల కారణంగా సంపాదించిన డబ్బును, సంపదను జాగ్రత్తగా కాపాడుకోవడం మాత్రం కష్టమే. ఇందుకోసం రకరకాల ప్లానింగ్‌లు వేస్తాం .. వాళ్లనీ, వీళ్లనీ సలహాలు అడుగుతుంటాం. వాళ్లూ, వీళ్లూ చెప్పినవి అమలు చేయడానికి ప్రయత్నించి, వర్కవుట్ కాక.. చేతులెత్తేసి..ఇహ ఇంతే అని సరిపెట్టేసుకుంటాం. అయితే, ఈ క్రమంలో వాళ్లూ.. వీళ్లూ కాకుండా .. మన బామ్మలు, తాతయ్యలు చెప్పిన, పాటించిన భేషైన ఆర్థిక సూత్రాలను మాత్రం మనం లెక్క చేయం. వాళ్లు చెప్పేదేముంది.. అంతా పాతచింతకాయ పచ్చడి లెక్కలు, పెరటి వైద్యం పనికి రాదంటూ కొట్టి పారేస్తుంటాం. కొన్ని విషయాల వరకూ ఇదీ ఓకే అనుకున్నా, ముఖ్యమైన ఆర్థిక అంశాల్లో బామ్మలు, తాతయ్యలు పాటించిన సూత్రాలు అప్పుడూ.. ఇప్పుడూ.. ఎప్పుడూ ఎవర్‌గ్రీనే. వాళ్లకి పని చేస్తాయి.. వీళ్లకు పనిచేయవంటూ లేకుండా.. అందరికీ వర్కవుట్ అయ్యేవే. అలాంటి వాటిల్లో కొన్నింటి సమాహారమే ఈ కథనం.
 
ఆదాయాన్ని బట్టే బడ్జెట్...

ఇది చెప్పడం సులువే కానీ పాటించడమే చాలా కష్టంగా ఉంటుంది. అయితే, కొంత ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే ఇది సాధ్యమే. మనకి ఎంత ఆదాయం వస్తోంది, ఎంత ఖర్చు చేస్తున్నాము.. ఇందులో అచ్చమైన అవసరాలేంటి.. పక్కన పెట్టినా చల్తా హై లాంటి లైఫ్ స్టయిల్ ఖర్చులేమిటి లాంటివి లెక్క వేసుకుని, ఒక బడ్జెట్ తయారు చేసుకుని, దానికి కట్టుబడి ఉండగలిగితే చాలు. ఒకవేళ అదనంగా ఆదాయం వచ్చినా, దాన్ని బడ్జెట్‌లో కలపకుండా భవిష్యత్ అవసరాల కోసం పక్కన పెట్టేయడం అలవర్చుకోవడం మంచిది. ఇంటి ఖర్చులకు పది రూపాయలే ఉన్నా .. బామ్మలు తమ కాలంలో గంపెడు సంసారాలను గుట్టు చప్పుడు కాకుండా నెట్టుకురాగలిగారంటే కొండొకచో ఇలాంటి ప్లానింగ్ వల్లే.
 
ఫుల్లుగా వాడకం..

ఇది కొంటే అది ఫ్రీ అని.. అది కొంటే మరొకటి ఫ్రీ అని.. అరవై రూపాయలది అర్ధ రూపాయికొస్తోందని..  అవసరమైనవి, అనవసరమైనవి అడ్డదిడ్డంగా కొనిపారేస్తుంటాం. వాటిని కనీసం ఒక్కసారైనా వాడకుండానే మళ్లీ కొత్తవి కొనడానికి బైల్దేరుతుంటాం. దీనివల్ల అనవసరమైనవి ఇల్లంతా పేరుకుపోవడం, పర్సుకు చిల్లుపడటం తప్ప ప్రయోజనం లేదు. అదే బామ్మగారైతే మాత్రం కొన్నదాన్ని పూర్తిగా గిట్టుబాటు చేసేంత వరకూ మరొకటి కొనడానికి ఒప్పుకోదు. ఫలితంగా దుబారాను తగ్గిస్తుంది. పేస్టులు.. షాంపూలు మొదలుకుని మొబైల్ ఫోన్ల దాకా సేమ్ టు సేమ్. రోజుకో స్మార్ట్‌ఫోన్ వస్తోంది కదాని కొనేయనక్కర్లేదు. మన అవసరానికి అనుగుణంగా కొనుక్కున్నదాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించేసిన తర్వాతే కొత్త వాటివైపు చూడటం ఉత్తమం.
 
రీసైక్లింగ్..

పర్యావరణాన్ని కాపాడేయాలనే తాపత్రయంతో రీసైకిల్డ్ బ్యాగులు, కవర్లు వంటివి కాస్త ఖర్చు ఎక్కువైనా అప్పుడప్పుడు కొనే స్తుంటాం. నలుగురికీ గొప్పగా చెప్పుకుంటాం.  అదే సూత్రాన్ని మన ఇంట్లో పాటించాలంటే మాత్రం నామోషీ అడ్డం వస్తుంటుంది. నిజానికి బామ్మలు ఇంట్లో పాత చీరల్లాంటివాటితో బొంతలు వగైరాలు తయారు చేసినా.. చద్దన్నాన్ని పొద్దున్న రిపేరు చేసి వడ్డించినా.. ఏదీ వృథా చేయకూడదనే ఉద్దేశంతోనే. లైఫ్‌స్టయిల్ మారిపోయిన ప్రస్తుత తరుణంలో మనమూ అచ్చం ఇలాంటివే చేయాలని లేదు కానీ పాతబడిపోయిన వాటన్నింటినీ బైటపారేయనక్కర్లేదు. కాస్త క్రియేటివిటీని జోడించి కొత్త రూపునిస్తే సరి. దీని వల్ల సదరు వస్తువును కొనాల్సిన అవసరం లేకుండగా.. క్రియేటివ్‌గా ఏదో ఒకటి చేశామన్న సంతృప్తి కూడా దక్కుతుంది.
 
ఇంటి ఫుడ్డు.. ఫ్రీ టైము..

రెస్టారెంట్లలో తినడం అన్నది అప్పుడప్పుడైతే ఓకే గానీ తరచూ హోటల్ ఫుడ్డు మీదే ఆధారపడటం వల్ల ఇటు శరీరానికే కాదు అటు పర్సు ఆరోగ్యానికీ మంచిది కాదు. ఎంత ఉరుకులు పరుగుల లైఫ్‌లో ఉన్నా.. కొంత సమయం ఇంటి భోజనానికే కేటాయించగలిగితే ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఆదాకి ఆదా కూడా. ఇక, ఇంటిపట్టునే ఉండాల్సి రావడం ఒక పనిష్మెంట్‌గా కాకుండా.. ఆ సమయాన్ని ఫ్రెండ్స్‌తో ఆడటంలోనో, కొత్తవి ఏవైనా నేర్చుకోవడంలోనో.. ఆదాయాన్ని పెంచగలిగే అవకాశాల గురించి తెల్సుకోవడానికో వెచ్చిస్తే నిర్మాణాత్మకంగా ఉంటుంది. రిఫ్రెషింగ్‌గా కూడా ఉంటుంది. పైగా ఈ రిఫ్రెష్‌మెంట్‌కి అదనంగా ఖర్చేమీ ఉండదు.
 
ఏదైతేనేం.. దుబారా చేయకుండా, పొదుపుగా పద్ధతిగా ఉండటమంటే చీప్‌గా ఉండటమని కాదు అర్థం. ఎక్కడ తగ్గాలి.. ఎక్కడ నెగ్గాలన్నది తెలిసుండటం. ఖర్చుల విషయంలో స్మార్ట్‌గా వ్యవహరించడం.. భవిష్యత్ కోసం జాగ్రత్తపడటం. బామ్మ కాస్త చాదస్తంగా చెప్పినా... కాస్త హంగూ ఆర్భాటాలు.. పదాడంబరాలతో ప్లానర్లు చెప్పినా.. వినదగు ఫార్ములాలు దాదాపు ఇవే.
 
అవసరమైన వాటిపైనే ఖర్చు..

బడ్జెట్‌లో చెప్పుకున్న దాంట్లో ఈ ఖర్చులే కీలకం. సంపద ఎంతైనా ఉండొచ్చు. ఉంది కదా అని.. కానీ దుబారా ఖర్చులు చేసినా, అయాచితంగా ఇచ్చేసినా కొండంత ఖజానా కూడా కరిగిపోతుంది. అలాగని అవసరమైన దగ్గర మరీ లోభిత్వం కూడా చేయకూడదు. చాన్నాళ్ల క్రితం ఒక ఊళ్లో బాగా సంపన్నురాలైన బామ్మ ఉండేది. సంపన్నురాలైనా కూడా వాళ్లింట్లో కరివేపాకు రెబ్బ కావాలన్నా పది పైసలు ఇస్తే గానీ ఇచ్చేది కాదు. అలాంటి ఇంట్లో ఒకసారి భారీ స్థాయిలో పెళ్లి జరిగింది. లక్షలు ఖర్చు పెట్టారు. పెళ్లిరోజున ఊరందరికీ  ఒక్కరోజు విందు భోజనాలూ పెట్టారు. కానీ, ఆ మర్నాడు ఊరిజనం మళ్లీ యథాప్రకారం పది పైసలు కడితే గానీ కరివేపాకు రెబ్బ చేతికి రాలేదు. తద్వారా సందర్భానికి తగినట్లుగా ఖర్చు చేయడం, మిగతా సమయాల్లో స్ట్రిక్టుగా నియమాన్ని పాటించడం నేర్పిందా బామ్మగారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement