న్యూఢిల్లీ: పెరుగుతున్న ముడిచమురు ధరలతో ఒకపక్క ప్రజల జేబుకు చిల్లు పడుతుంటే.. మరోపక్క ప్రభుత్వం కూడా దిక్కుతోచని పరిస్థితులను ఎదుర్కొంటోంది. ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించుకోకుండా, పెట్రోలు, డీజిల్‌పై గనుక ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తే.. ద్రవ్యలోటు మరింత పెరిగిపోయే ప్రమాదం ఉందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ హెచ్చరించింది.
పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరల కారణంగా, కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి కొంత ఊరట కల్పించాలంటూ అన్నివైపుల నుంచీ ఒత్తిడి పెరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా, పెట్రోలు, డీజిల్‌పై ప్రతి రూపాయి సుంకం తగ్గింపుతో ఖజానాకు దాదాపు రూ.13,000 కోట్ల మేర ఆదాయ నష్టం వాటిల్లుతుందని అంచనా. ‘బీఏఏ’ రేటింగ్ ఉన్న ఇతర దేశాలతో పోలిస్తే... ఆర్థిక క్రమశిక్షణ విషయంలో భారత్ చాలా వెనుకబడిందని మూడీస్ పేర్కొంది.
వ్యయాలను తగ్గించుకుంటేనే...
‘ఒకవేళ పెట్రో ఉత్పత్తులపై సుంకం తగ్గించాలని ప్రభుత్వం భావిస్తే... దానికి అనుగుణంగా వ్యయాలను కూడా కట్టడి చేయాల్సి ఉంటుంది. లేదంటే ద్రవ్యలోటు మరింత పెరిగిపోయే ప్రమాదం ఉంది’ అని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ వైస్ ప్రెసిడెంట్(సావరీన్ రిస్క్ గ్రూప్) విలియమ్ ఫోస్టర్ వ్యాఖ్యానించారు. దాదాపు పదమూడేళ్ల తర్వాత మళ్లీ భారత్ సావరీన్ రేటింగ్‌ను మూడీస్ గతేడాది పెంచిన(బీఏఏ2, స్థిర అవుట్‌లుక్) సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment