నగదు పంపాలంటే.. ఎక్కువ చెల్లించాల్సిందే!
నగదు పంపాలంటే.. ఎక్కువ చెల్లించాల్సిందే!
Published Tue, Apr 18 2017 2:17 PM | Last Updated on Tue, Sep 5 2017 9:05 AM
అబుదాబి : పొట్టకూటి కోసం విదేశాలకు వెళ్లి నాలుగురాళ్లు సంపాదించుకుంటున్న వారికి ఎక్స్చేంజ్ ఏజెన్సీలు షాకిస్తున్నాయి. యూఏఈలో నివసిస్తున్న వారు సంపాదించిన నగదును తమ స్వదేశాలకు పంపుకోవడం తలకుమించిన భారంగా మార్చుతున్నాయి. ఈ వారంలో ఎక్స్చేంజ్ ఏజెన్సీలు రెమిటెన్స్ లపై వసూలు చేసే ఛార్జీలను పెంచినట్టు ప్రకటించాయి. ఏప్రిల్ 15 నుంచి బ్యాంకు ట్రాన్స్ఫర్లకు 2 దిర్హామ్ల (35.12 రూపాయల) వరకు వసూలు చేస్తున్నట్టు పేర్కొన్నాయి. అదేవిధంగా కొన్ని ఎక్స్చేంజ్లపై విధించే కూడా ఫీజులను ఏప్రిల్ మొదటివారం నుంచి పెంచినట్టు తెలిపాయి.
ఒకవేళ బ్యాంకు ట్రాన్స్ఫర్లు 1000 దిర్హామ్లు (సుమారు17,561 రూపాయలు) దాటితే, కస్టమర్లు 22 దిర్హామ్ల (386 రూపాయలను)ను చెల్లించాల్సి ఉంటుందని మేజర్ ఎక్స్చేంజ్ ఏజెన్సీలు ప్రకటించాయి. అంతకముందు ఈ రేటు 20 దిర్హామ్లు (351రూపాయలు)గానే ఉండేది. ఒక్కో లావాదేవీపై వేసే సర్వీసు ఛార్జీల రేట్లను కూడా పెంచినట్టు ఆ ఏజెన్సీలు తెలిపాయి. ఛార్జీలను పెంచిన అతిపెద్ద ఎక్స్చేంజ్ ఏజెన్సీలన్నీ, ఫారిన్ ఎక్స్చేంజ్ అండ్ రెమిటెన్స్ గ్రూప్ (ఎఫ్ఈఆర్జీ) లో సభ్యులు. ఇది యూఏఈలోని మనీ ఎక్స్చేంజ్ ఏజెన్సీలకు అధికారిక ప్లాట్ఫామ్. అయితే ఈ నిర్ణయం తమది కాదని ఎఫ్ఈఆర్జీ చైర్మన్ మహ్మద్ అల్ అన్సారీ చెప్పారు. సల్వంగా ఛార్జీలు పెంచుకోమనే సూచించామని, వాటిపై తుది నిర్ణయం సభ్యులే తీసుకున్నట్టు పేర్కొన్నారు.
Advertisement