కార్యాలయాల కోసం ఫేస్‌బుక్ సరికొత్త ఫీచర్
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ కొత్త ఆవిష్కరణతో భారత కంపెనీలను ఆకట్టుకుంటోంది. 'ఫేస్ బుక్ ఎట్ వర్క్' అనే సర్వీసును కొన్ని నెలల్లో భారత్‌లో ఆవిష్కరించనుంది. ఇప్పటికే ఈ సర్వీసు చాలా ప్రాముఖ్యం పొందింది. భారత్ ఈ సర్వీసును ఆవిష్కరించడం ఓ మైలురాయి లాంటిదని ఫేస్ బుక్ ఎగ్జిక్యూటివ్‌లు అభివర్ణించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ యాప్ కు వచ్చిన ఆదరణతో భారత్ లో కూడా అన్ని వ్యాపారాల్లో దీన్ని టెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యామని ఫేస్ బుక్ ఎట్ వర్క్ డైరెక్టర్ జూలియన్ కోడోర్ నియో తెలిపారు. విశ్వవ్యాప్తంగా ఈ యాప్ విజయవంతం కావడం తమకు ఆనందదాయకంగా ఉందని, భారత్ లోని అన్ని వ్యాపారాలతో కలిసి పనిచేసేందుకు ప్రస్తుతం దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు. తోటి ఉద్యోగులతో కలిసి సమర్థవంతంగా పనిచేసుకోవడానికి, పరస్పరం సహకరించుకోవడానికి ఫేస్ బుక్ ఎట్ వర్క్ కొత్త ప్లాట్ ఫాం అని, పనిస్థలాల్లో ఉత్పాదకతను ఇది పెంచుతుందని చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్యాంకింగ్, టెలికమ్యూనికేషన్, ట్రావెల్, రిటైల్, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఈ యాప్ విజయవంతమైంది. భారత కంపెనీలు ఎల్ అండ్ టీ, ఇన్ఫోటెక్, గోద్రెజ్, ఎస్ బ్యాంకు, యూఎస్టీ గ్లోబల్, పేటైమ్, జుమోటో, బుక్ మై షో, ఆస్క్ మీ, అర్బన్ లాడర్, టెలినార్, విజన్ ఇండియా ఫౌండేషన్, ల్యాండ్ మార్క్ గ్రూప్ వంటి కంపెనీలు ఇప్పటికే ఫేస్ బుక్ ఎట్ వర్క్ ను వాడుతున్నాయని జూలియన్ తెలిపారు. మొబైల్ ఫోన్ వినియోగదారులకు ఈ యాప్ ఎంతో సహకరిస్తుందని చెప్పారు. ఈ సోషల్ మీడియా దిగ్గజం ద్వారా న్యూస్ ఫీడ్ ను, గ్రూప్స్ ను, మెసేజ్ లను, ఈవెంట్లను, సెర్చ్ వంటి ఎన్నో ఫీచర్లను ఫేస్ బుక్ ఎట్ వర్క్ షేర్ చేస్తుంది.