రుణమాఫీతో ఆర్థిక క్రమశిక్షణపై ప్రభావం
ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ ముంద్రా
ముంబై: వ్యవసాయ రుణమాఫీలు ఆర్థిక క్రమశిక్షణపై ప్రభావం చూపుతాయని రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ ఎస్.ఎస్.ముంద్రా ఆందోళన వ్యక్తం చేశారు. ముంబైలో గురువారం జరిగిన బంధన్ బ్యాంకు నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు. రుణమాఫీ వల్ల ఆర్థిక క్రమశిక్షణ కుంటుపడుతుందన్న ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య వ్యాఖ్యల్ని ఆయన పునరుద్ఘాటించారు. రుణమాఫీ విషయంలో ఆర్‌బీఐ నిర్ణయం ఏంటని విలేకరులు అడిగిన ప్రశ్నకు..
ఈ విషయమై ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సూచనలు అందలేదని ఆయన స్పష్టం చేశారు. రుణమాఫీ వల్ల ఆర్థిక క్రమశిక్షణ దెబ్బతింటుందన్నదే ఆర్‌బీఐ అభిప్రాయమన్నారు. ఇటీవల బీజేపీ గెలిచిన ఉత్తరప్రదేశ్‌తో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్ వంటి పలు రాష్ట్రాల్లో వ్యవసాయ రుణమాఫీ చేయాలన్న డిమాండ్‌ల నేపథ్యంలో ముంద్రా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గతంలో కూడా అరుంధతితో పాటు, ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘు రాం రాజన్ సైతం రుణమాఫీని వ్యతిరేకించారు.