ఎఫ్‌ఐఐలకు బూస్ట్..!
అబర్డీన్‌కు మ్యాట్ నోటీసులపై బాంబే హైకోర్టు స్టే
ముంబై: మ్యాట్‌పై ఎఫ్‌ఐఐలకు బాంబే హైకోర్టు ఊరటనిచ్చింది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చే విధంగా స్కాట్లాండ్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ అబర్డీన్‌కు ఆదాయ పన్ను శాఖ జారీ చేసిన కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్) నోటీసులపై బాంబే హైకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణను జూన్ 22కి వాయిదా వేసింది. ఇలాంటి నోటీసులపై మరో అయిదు ఎఫ్‌పీఐలు దాఖలు చేసిన రిట్ పిటీషన్‌లపై బుధవారం విచారణ జరపనున్న నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.
2008 నుంచి స్టాక్స్, బాండ్లలో ట్రేడింగ్ ద్వారా ఆర్జించిన లాభాలపై రూ. 603 కోట్ల మేర మ్యాట్ కట్టాలంటూ 68 ఎఫ్‌పీఐలకు ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. వీటిపైనే అబర్డీన్ గ్లోబల్ ఎమర్జింగ్ మార్కెట్స్‌తో పాటు ఫస్ట్ ఏషియా పసిఫిక్ సస్టెయినబిలిటీ ఫండ్ మొదలైనవి కోర్టును ఆశ్రయించాయి. మరోవైపు, హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులను అధ్యయనం చేయాల్సి ఉందని, ఆ తర్వాతే స్పందించగలమని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్‌పర్సన్ అనితా కపూర్ తెలిపారు.