భారత్‌లో దండిగా రాబడులు.. | Finance Minister Jaitley calls to foreign investors | Sakshi
Sakshi News home page

భారత్‌లో దండిగా రాబడులు..

Published Mon, Sep 21 2015 3:29 AM | Last Updated on Tue, Oct 2 2018 4:19 PM

భారత్‌లో దండిగా రాబడులు.. - Sakshi

భారత్‌లో దండిగా రాబడులు..

ఇన్‌ఫ్రాలో భారీ పెట్టుబడులు పెట్టండి...
- విదేశీ ఇన్వెస్టర్లకు ఆర్థిక మంత్రి జైట్లీ పిలుపు
- వ్యాపారాలకు అనువైన పరిస్థితులు కల్పిస్తున్నామని వెల్లడి

హాంకాంగ్:
ప్రపంచంలోని చాలా దేశాలతో పోలిస్తే భారత్‌లో పెట్టుబడులపై భారీగా లాభాలను అందుకోవచ్చని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. ప్రధానంగా మౌలిక సదుపాయాలు ఇతరత్రా రంగాల్లో పెట్టుబడులకు అపారమైన అవకాశాలున్నాయని విదేశీ ఇన్వెస్టర్లకు ఆయన పిలుపునిచ్చారు. ‘దేశంలో వ్యాపారాలకు మరింత అనువైన వాతావరణాన్ని కల్పించడంపై మా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ముఖ్యంగా తయారీ రంగంలోని భారీ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి వీలుగా మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి పథకాలకు రూపకల్పన చేశాం. ఇక్కడ పెట్టుబడులు పెడితే దండిగా రాబడులు లభిస్తాయి’ అని జైట్లీ చెప్పారు.

హాంకాంగ్ పర్యటనలో భాగంగా ఆదివారం ఇక్కడ ఇన్వెస్టర్లు, వ్యాపార దిగ్గజాలనుద్దేశించి ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ఇన్‌ఫ్రా రంగానికి పెద్దమొత్తంలో పెట్టుబడులు అవసరమవుతాయని.. విదేశీ పెట్టుబడులతో అదనపు నిధులకు మార్గం సుగమం అవుతుందన్నారు. ‘రైల్వేలు, హైవేలు, విద్యుత్ రంగాల్లో బడా ప్రాజెక్టులు సాకారం కావడం అనేది నిధుల లభ్యతపైనే ఆధారపడి ఉంటుంది. భారత్‌లో విధానపరమైన, అనుమతులకు సంబంధించి ఇబ్బందులున్నాయని ఇన్వెస్టర్లు గతంలో భావించేవారు. అందుకే వ్యాపారాలకు అత్యంత సరళమైన పరిస్థితులను కల్పించాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్నాం’ అని జైట్లీ వివరించారు.
 
బ్యాంకుల బలోపేతమే లక్ష్యం...
కొన్ని రాష్ట్రాల్లో కరెంట్ చార్జీలను తగినంతంగా విధించకపోవడంవల్లే విద్యుత్ పంపిణీ కంపెనీ(డిస్కమ్)లు నష్టాల్లో కూరుకుపోతున్నాయని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ఇలాంటి తీవ్ర సమస్యల్లో ఉన్న డిస్కమ్‌లకు నిధుల కోసం ప్రభుత్వ రంగ(పీఎస్‌యూ) బ్యాంకులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అడిగే పరిస్థితి లేదన్నారు. ‘పీఎస్‌యూ బ్యాంకులను మరింతగా బలోపేతం చేయడానికి మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. భారీ మొండిబకాయిల సమస్యను ఎదుర్కొంటున్న కొన్ని బలహీన బ్యాంకులను పటిష్టమైన బ్యాంకుల్లో విలీనం చేయాల్సి రావచ్చు’ అని జైట్లీ వ్యాఖ్యానించారు. ప్రైవేటు రంగ కంపెనీల బ్యాలెన్స్‌షీట్లపై ప్రతికూల ప్రభావానికి.. కొన్ని ప్రాజెక్టులు నిలిచిపోవడం కూడా ప్రధాన కారణం. ప్రతిపాదిత జాతీయ పెట్టుబడి, మౌలికసదుపాయాల నిధితో పెట్టుబడులను భారీగా ఆకర్షించేందుకు వీలుంటుందని చెప్పారు.

తద్వారా ఇబ్బందుల్లో ఉన్న ప్రైవేటు కంపెనీలకు కూడా చేయూత లభిస్తుందన్నారు. రైల్వేలు సంబంధిత రంగానికి చెందిన ప్రాజెక్టులపై అంతర్జాతీయ ఇన్వెస్టర్లు చాలా ఆసక్తిగా ఉన్నారని జైట్లీ చెప్పారు. హైవేల రంగంలో నిలిచిపోయిన అనేక ప్రాజెక్టులను తమ సర్కారు మళ్లీ పట్టాలెక్కించిందన్నారు. ఈ రంగంలో పెన్షన్ ఫండ్‌లు కీలక పాత్రపోషించేందుకు ఆస్కారం ఉందని చెప్పారు. 100 స్మార్ట్‌సిటీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. దీనివల్ల దేశంలో పట్టణీకరణ(అర్బనైజేషన్)కు ఊతం లభిస్తుందని ఆర్థిక మంత్రి వివరించారు.
 
వడ్డీరేట్లు దిగిరావాల్సిందే...
ఆర్థిక వ్యవస్థ వృద్ధికి చేయూతనివ్వాలంటే వడ్డీరేట్లను కచ్చితంగా తగ్గించాల్సిన అవసరం ఉందని జైట్లీ పేర్కొన్నారు. ‘వృద్ధి రేటుకు ఊతమివ్వడంలో పరపతి విధానం చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఇంటాబయటా జరుగుతున్న పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఆర్‌బీఐ రానున్న సమీక్ష(ఈ నెల 29న)లో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని భావిస్తున్నా. అయితే, పాలసీ రేట్ల విషయంలో ఆర్‌బీఐదే తుది నిర్ణయాధికారం’ అని ఆర్థిక మంత్రి చెప్పారు. వచ్చే సమీక్షలో ఆర్‌బీఐ వడ్డీరేట్లను తగ్గిస్తుందా అన్న ప్రశ్నకు ఆయన ఈ విధంగా బదులిచ్చారు. అధిక వడ్డీరేట్ల కారణంగా తీవ్ర సమస్యల్లో కూరుకుపోయిన రంగాలు చాలానే ఉన్నాయి. ఉదాహరణకు రియల్ ఎస్టేట్‌నే తీసుకుందాం. భారత్ జీడీపీ వృద్ధికి ఊతమివ్వడంలో ఇది చాలా కీలకమైనది అయితే, వడ్డీరేట్ల భారంతో తీవ్ర ప్రతికూలతలను ఎదుర్కొంటోంది. రానున్న ఏడాది కాలంలో రేట్లు దిగొస్తే ఈ రంగానికి మళ్లీ జోష్ లభిస్తుంది’ అని జైట్లీ వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement