
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక నేరాలు పెరుగుతున్న క్రమంలో నల్లధనంపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్రం సన్నద్ధమైంది. ప్రమాణాలు పాటించని సంస్థల నిగ్గుతేల్చనుంది. మనీల్యాండరింగ్ నియంత్రణ చట్ట ప్రమాణాలకు అనుగుణంగా లేని 9491 బ్యాంకేతర ఆర్థిక సంస్థలను (ఎన్‌బీఎఫ్‌సీ) గుర్తించింది. వీటిని హై రిస్క్ ఆర్థిక సంస్థలుగా ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుబంధంగా పనిచేసే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్‌ఐయూ) ప్రకటించింది. ఈ సంస్థల జాబితాను ఎఫ్‌ఐయూ ప్రచురించింది.
మనీల్యాండరింగ్ నియంత్రణ చట్టం ప్రకారం సహకార బ్యాంకులు సహా ఎన్‌బీఎఫ్‌సీలు తమ ఆర్థిక కార్యకలాపాలు,లావాదేవీల వివరాలను ఎఫ్‌ఐయూకు సమర్పించాల్సి ఉంటుంది. ఈ డేటాను పరిశీలించిన ఎఫ్‌ఐయూ ఆయా ఎన్‌బీఎఫ్‌సీలు, సంస్థలు నిబంధనలకు అనుగుణంగా లేవని ఎఫ్‌ఐయూ గుర్తించింది. ముఖ్యంగా రూ 10 లక్షలకు పైబడిన నగదు లావాదేవీలను పర్యవేక్షించి, అనుమానిత లావాదేవీలను విశ్లేషించి నివేదికలు రూపొందించాల్సిన ప్రిన్సిపల్ అధికారిని ఈ సంస్థలు నియమించలేదని ఎఫ్‌ఐయూ గుర్తించింది. నోట్ల రద్దు అనంతరం ఈ సంస్ధల కార్యకలాపాలపై ఎఫ్‌ఐయూ నిఘా పెట్టింది. ఈ సంస్థలతో లావాదేవీలకు దూరంగా ఉండాలని ప్రజలను అప్రమత్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment