
న్యూఢిల్లీ: రిస్కులు, రిజర్వుల పేరిట గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో తన వద్ద అట్టే పెట్టుకున్న రూ. 27,380 కోట్ల నిధులను ప్రభుత్వ ఖజానాకు బదలాయించాలని రిజర్వ్ బ్యాంక్‌ను(ఆర్‌బీఐ) కేంద్ర ఆర్థిక శాఖ కోరినట్లు తెలుస్తోంది. 2016–17లో ఆర్‌బీఐ రూ. 13,190 కోట్లు, 2017–18లో రూ. 14,190 కోట్లు రిస్కులు, రిజర్వుల కింద ఆర్‌బీఐ పక్కన పెట్టినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తాజాగా ఈ నిధులను ప్రభుత్వానికి బదలాయించాలని కేంద్రం కోరినట్లు వివరించాయి. ఆర్‌బీఐ చట్టం ప్రకారం మొండిబాకీలు, అసెట్స్ తరుగుదల మొదలైన వాటన్నింటికి కేటాయింపులు పోగా మిగిలే లాభాలను కేంద్రానికి చెల్లించాల్సి ఉంటుంది.
జూలై–జూన్ ఆర్థిక సంవత్సర విధానాన్ని పాటించే ఆర్‌బీఐ ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా కేంద్రానికి రూ. 40,000 కోట్లు బదలాయించింది. ఈసారి ఆర్‌బీఐ నుంచి రూ. 28,000 కోట్ల మేర మధ్యంతర డివిడెండ్ కూడా రాగలదని అంచనా వేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గర్గ్ ఇటీవలే పేర్కొన్నారు. దీనికి ఆర్‌బీఐ బోర్డు ఆమోదముద్ర వేస్తే.. 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ. 68,000 కోట్ల మేర మిగులు నిధులను కేంద్రానికి బదలాయించినట్లవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment