ఫైనాన్షియల్ బేసిక్స్..
స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా?
స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు కొన్ని అంశాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి. అవేంటో ఒకసారి చూద్దాం..
వృద్ధి రేటు: స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ముందుగా కంపెనీ గురించి తెలుసుకోవాలి. దాని వ్యాపారం ఎలా ఉందో గమనించాలి. అంటే కంపెనీ మంచి పనితీరు కనబరుస్తోందా? లేదా? వృద్ధి రేటు ఏ స్థాయిలో నమోదవుతోంది.. వంటివి చూడాలి. కంపెనీ భవిష్యత్ ప్రణాళికలు, విస్తరణ తదితర అంశాలను కూడా చూడాలి.
లాభదాయకత: కంపెనీ ట్రాక్ రికార్డు బాగుండాలి. దాని ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్లు చదవాలి. అది స్థిరమైన వృద్ధిని నమోదుచేస్తూ ఉండాలి. అలాగే దాని మార్జిన్లు కూడా బాగుండాలి. డివిడెండ్లపై ప్రత్యేకంగా కన్నేయాలి. షేర్ ధర క్రమంగా పెరుగుతూ వచ్చి ఉండాలి. ఇలా ఉన్న కంపెనీ షేర్లపై ఇన్వెస్ట్ చేయవచ్చు.
బ్యాలెన్స్ షీట్: కంపెనీ బ్యాలెన్స్ షీట్ బాగుండాలి. దాని కార్యకలాపాలు ఏ విధంగా జరుగుతున్నాయో చూడాలి. అంటే ఆ కంపెనీ రుణాలతో నడుస్తోందా? లేదా సరిపడినంత క్యాష్ ఫ్లో ఉందా? అనే అంశాలను గమనించాలి. కంపెనీ నిర్వహణ వ్యయం స్థిరంగా ఉందో.. పెరుగుతోందో చూడాలి. అమ్మకాలు పెరగకుండా.. వ్యయాలు మాత్రం పెరుగుతూ ఉంటే అప్రమత్తంగా ఉండాలి.
మేనేజ్‌మెంట్: కంపెనీ మేనేజ్‌మెంట్ గురించి ప్రత్యేకం గా మాట్లాడుకోవాలి. కంపెనీ చైర్మన్, డైరెక్టర్ల వివరాలు, వారి విద్యార్హతలు, ఇదివరకు పనితీరు, వేతనాలు వంటి పలు విషయాలను సవివరంగా తెలుసుకోవాలి. కంపెనీ మేనేజ్‌మెంట్ సుదీర్ఘకాలం నుంచి స్థిరంగా ఉందా? లేక దానిలో పలుమార్లు మార్పులు చోటుచేసుకుంటున్నాయా? అనే అంశాలపై కన్నేయాలి.
రిస్క్‌లు: కంపెనీ పనితీరును, భవిష్యత్ వృద్ధిని ప్రభావితం చేసే అంశాలు ఏమైనా ఉన్నాయేమో ముందే ఊహించాలి. కంపెనీ వార్షిక నివేదిక, మేనేజ్‌మెంట్ నిర్ణయాలు వంటి వాటి ఆధారంగా ప్రమాదాలను ముందే పసిగట్టొచ్చు. కంపెనీ ఏ రంగంలో ఉందో చూడాలి. ఆ రంగం భవిష్యత్ అంచనాలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకోవాలి. ఇలా అన్ని అంశాలను బేరీజు వేసుకున్న తర్వాతే నచ్చిన, అనువైన స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి.