పాన్, అడ్రస్ ప్రూఫ్ దుర్వినియోగం కాకుండా చూసుకోండి..
ప్రస్తుతం ప్రతిదానికి ఆధార్ తప్పనిసరి అవుతోంది. ఇక ఆర్థిక లావాదేవీలకు వచ్చేసరికి ఆధార్ సహా పాన్, బ్యాంక్ అకౌంట్ వంటి పలు వివరాలు అవసరమౌతున్నాయి. ఈ విధంగా మనం మన విలువైన వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకుంటున్నాం. ఇది తప్పనిసరి. ఇలా చేయడం వల్ల కొన్ని సందర్భాల్లో డేటా తస్కరణ జరిగే ప్రమాదమూ ఉంది. మన అకౌంట్ ద్వారా మనకు తెలియకుండానే ఏదో ఒక ఆర్థిక లావాదేవీ జరిగితే తప్ప మనకు మన వివరాలను ఎవరో దొంగలించారని తెలియదు. ఇలాంటి సంఘటనలు ఈ మధ్య కాలంలో చాలానే జరుగుతున్నాయి. అకౌంట్ నుంచి పెద్ద మొత్తంలోనే డబ్బులు మాయమౌతున్నాయి.
వ్యక్తిగత వివరాలను, విలువైన సమాచారాన్ని సాధ్యమైనంత వరకు పబ్లిక్‌గా ఎవరితోనూ పంచుకోకూడదు. మరీముఖ్యంగా ఫేస్‌బుక్, ట్వీటర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లోనూ, ఆన్‌లైన్‌లోనూ వ్యక్తిగత వివరాలను ఉంచడం కానీ, షేర్ చేయడం కానీ చేయకూడదు. తెలియని నెంబర్ నుంచి వచ్చే కాల్స్‌కి, వివరాలు తెలుసుకునేందుకు చేసే కాల్స్‌కు సమాధానమివ్వకూడదు. మీ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నామని కొందరు ఫోన్ చేస్తుంటారు. వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇతర దేశాల్లోని స్నేహితుల నుంచి డబ్బులు పంపమని వచ్చిన ఈ–మెయిల్స్‌కు రిప్లయ్ ఇవ్వకండి. ఎవ్వరికైనా పాన్, బ్యాంక్ అకౌంట్, ఆధార్ డాక్యుమెంట్లను ఇచ్చేటప్పుడు, ఏ పనికోసమైతే వాటిని ఇస్తున్నారో ఆ వివరాలను పత్రాలపై రాయండి. దీని ద్వారా డాక్యుమెంట్లు మిస్‌యూజ్ కాకుండా చూసుకోవచ్చు.