
లోటు పాట్లు
భారత్ కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) మళ్లీ ఆందోళనకరంగా ఎగబాకింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (2013-14, ఏప్రిల్-జూన్) స్థూల దేశీయోత్పత్తిలో(జీడీపీలో) 4.9 శాతంగా నమోదయ్యింది
ముంబై: భారత్ కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) మళ్లీ ఆందోళనకరంగా ఎగబాకింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (2013-14, ఏప్రిల్-జూన్) స్థూల దేశీయోత్పత్తిలో(జీడీపీలో) 4.9 శాతంగా నమోదయ్యింది. విలువ రూపంలో ఇది 21.8 బిలియన్ డాలర్లు. చమురు, బంగారం దిగుమతుల్లో భారీగా పెరగడమే దీనికి ప్రధాన కారణం. మూలధన పెట్టుబడులు మినహా దేశంలోకి వచ్చీ-పోయే విదేశీ మారకద్రవ్య విలువ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని క్యాడ్‌గా పేర్కొంటారు. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో క్యాడ్ 4.4 శాతం (16.9 బిలియన్ డాలర్లు). 2013 జనవరి-మార్చి క్వార్టర్‌లో 3.6 శాతం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సోమవారం ఈ గణాంకాలను విడుదల చేసింది.
భవిష్యత్తులో తగ్గుతుంది..!
బంగారం దిగుమతులు పెరగడం, ఈ ప్రభావం తీవ్ర వాణిజ్యలోటుకు దారితీయడం, దీనికితోడు నెట్ ఇన్‌విజిబుల్స్ (ఆదాయం, సేవల నుంచి వచ్చే ఆదాయం) మందగమనం క్యాడ్ ఏప్రిల్-జూన్ క్వార్టర్‌లో పెరగడానికి కారణమని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే మొదటి క్వార్టర్‌లో క్యాడ్ పరిస్థితి తీవ్రంగా ఉన్నా-రెండవ క్వార్టర్ నుంచి పరిస్థితి కాస్త మెరుగుపడే అవకాశం ఉందని పారిశ్రామిక వర్గాలు, కొందరు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బంగారం దిగుమతులకు సంబంధించి వివిధ నియంత్రణలు అమల్లో ఉండడం దీనికి కారణమని ప్రభుత్వం వర్గాలు సైతం అంచనా వేస్తున్నాయి. ఆర్థిక సంవత్సరం మొత్తంమీద 3.6 శాతం మించకూడదని (70 బిలియన్ డాలర్లు) ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గడచిన ఆర్థిక సంవత్సరం జీడీపీలో క్యాడ్ 4.8 శాతం నమోదుకాగా విలువ రూపంలో ఇది 88.2 బిలియన్ డాలర్లుగా ఉంది. 2011-12లో జీడీపీలో శాతం 4.8 శాతంకాగా, విలువ రూపంలో 87.8 బిలియన్ డాలర్లు. గత ఏడాది అక్టోబర్-డిసెంబర్ మధ్య క్యాడ్ 6.5 శాతానికి ఎగసి ఆందోళన సృష్టించిన సంగతి తెలిసిందే. క్యాడ్ ఒత్తిడి ప్రధాన కారణంగా ఆగస్టు 28న దేశీయ కరెన్సీ విలువ డాలర్ మారకంలో 68.86 కనిష్ట స్థాయిలను చూసింది.
ద్రవ్యలోటు తీవ్రం...
కాగా ఏప్రిల్-ఆగస్టు మధ్య ద్రవ్యలోటు (ప్రభుత్వానికి వచ్చే ఆదాయం-చేసే వ్యయం మధ్య ఉన్న వ్యత్యాసం) తీవ్రంగా ఉంది. ఆర్థిక సంవత్సరం ఈ మొదటి ఐదు నెలల కాలంలోనే మొత్తం బడ్జెట్ అంచనాల్లో ద్రవ్యలోటు మొత్తం 74.6 శాతాన్ని చేరింది. విలువ రూపంలో ఈ మొత్తం రూ.4.04 లక్షల కోట్లని తాజా డేటా పేర్కొంది. ఇక్కడ మరో అంశం ఏమిటంటే- తాజా ద్రవ్యలోటు అంచనాలకు ఆహార, చమురు సబ్సిడీలను పరిగణనలోకి తీసుకోలేదు. ఇవి కూడా లెక్కిస్తే, ఈ పరిమాణం మరింత పెరిగే అవకాశం ఉంది. ఐదు నెలల కాలంలో పన్ను రాబడులు 1.8 లక్షల కోట్లుకాగా, వ్యయం రూ.6.62 లక్షల కోట్లు. 2011-12లో ద్రవ్యలోటు 5.8%. 2012-13లో ఇది 4.9 శాతానికి తగ్గింది. 2013-14లో 4.8 శాతానికి కట్టడి చేయాలన్నది లక్ష్యం.