భారీగా తగ్గిన పసిడి దిగుమతులు
ఏప్రిల్–నవంబర్ మధ్య 30 శాతం పైగా డౌన్
న్యూఢిల్లీ: పసిడి దిగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య భారీగా 30.5 శాతం పడిపోయాయి. గత ఏడాది ఇదే కాలంలో దిగుమతులు విలువ 22.64 బిలియన్ డాలర్లు కాగా తాజా సమీక్షాకాలంలో ఈ పరి మాణం 15.74 బిలియన్ డాలర్లకు పడిపోయింది. భారత్ ఆర్థిక వ్యవస్థ కోణంలో కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్– ఎఫ్‌ఐఐ, ఎఫ్‌డీఐ, ఈసీబీలు మినహా దేశంలోకి వచ్చీ–వెళ్లే విదేశీ మారకద్రవ్యం మధ్య నికరవ్యత్యాసం)కు ఇది లాభించే అంశమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం క్యాడ్‌ను చూస్తే, ఈ పరిమాణం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 1.1 శాతం (22.1 బిలియన్ డాలర్లు)గా ఉంది. వాణిజ్య మంత్రిత్వశాఖ ఈ గణాంకాలను విడుదల చేసింది.
అక్టోబర్–నవంబర్‌లలో రయ్: ఏప్రిల్ నుంచీ చూస్తే దిగుమతులు తగ్గినా... వరుసగా అక్టోబర్, నవంబర్‌లలో మాత్రం దిగుమతులు పెరిగినట్లు గణాంకాలు తెలిపారు. నవంబర్‌లో పసిడి దిగుమతులు ఒక్కసారిగా భారీగా23 శాతం పెరగడానికి (4.36 బిలియన్ డాలర్లు) పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నల్లకుబేరుల నుంచి పసిడి డిమాండ్ భారీగా ఉండడమేనన్న విశ్లేషణలూ ఉన్నాయి.