ఫ్లిప్‌కార్ట్‌కు ‘బిలియన్’ హిట్స్..
బెంగళూరు: ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ బిలియన్ డే’ పేరుతో సోమవారం ఇచ్చిన భారీ డిస్కౌంట్ ఆఫర్లకు అనూహ్య స్పందన లభించింది. 24 గంటల్లో తాము 10 కోట్ల డాలర్ల(సుమారు రూ.615 కోట్లు) స్థూల అమ్మకాలను లక్ష్యంగా పెట్టుకోగా.. ఆఫర్ మొదలైన(సోమవారం ఉదయం 8 గంటలకు) 10 గంటల్లోనే దీన్ని సాధించగలిగామని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ వినియోగదార్లు భారీగా పోటెత్తడంతో సోమవారం బిలియన్(100 కోట్లు) వెబ్‌సైట్ హిట్స్‌ను కూడా నమోదుచేశామని వెల్లడించింది.
కాగా, వెబ్ ట్రాఫిక్ ఊహించనంతగా రావడంతో ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్ క్రాష్ అయింది. కొంతసేపు సైట్ స్తంభించడంతో యూజర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆఫర్ పేరు చెబుతూ.. డిస్కౌంట్ ముందు ధరలకే విక్రయిస్తోందన్న విమర్శలు కూడా సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. అయితే, ఒకేసారి లక్షల సంఖ్యలో యూజర్లు వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయడంతో సాంకేతిక సమస్యలు వచ్చాయని.. తమ సిబ్బంది దీన్ని సరిచేసినట్లు కంపెనీ వివరణ ఇచ్చింది.
అక్టోబర్ 6(6-10) రోజు.. బెంగళూరులో ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకులు 2007లో ఫ్లిప్‌కార్ట్‌ను ప్రారంభించిన ఫ్లాట్ నంబర్ కూడా 610 ఒకటే కావడంతో ఈ ‘బిగ్ బిలియన్ డే’ పేరుతో అసాధారణ డిస్కౌంట్లను కంపెనీ ఆఫర్ చేసింది. ‘ఇది మాకు మరపురాని రోజు.. దేశంలోనే అతిపెద్ద ఆన్‌లైన్ అమ్మకంగా ఇది నిలిచింది. కస్టమర్లు ఉదయం 8 నుంచే కొనుగోళ్లకు సిద్ధమయ్యారు. అనూహ్యమైన స్పందన లభించింది’ అని ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకులు సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ-కామర్స్ కంపెనీలను నియంత్రించాలి
న్యూఢిల్లీ: ఆన్‌లైన్ విక్రయ(ఈ-కామర్స్) కంపెనీల భారీ డిస్కౌంట్ల కారణంగా సాంప్రదాయ వ్యాపారులు(ఆఫ్‌లైన్ మార్కెట్) తీవ్రంగా దెబ్బతింటున్నారని అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య(సీఏఐటీ) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ-కామర్స్ సంస్థల నియం త్రణ, పర్యవేక్షణకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు సీఏఐటీ నేషనల్ జనరల్ సెక్రటరీ ప్రవీణ్ ఖండేల్వాల్ ఒక లేఖను రాశారు. దేశంలో ఈ-కామర్స్ పరిశ్రమకు నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.