ఫ్లిప్‌కార్ట్‌లోకి 1.4 బిలియన్‌ డాలర్లు | Flipkart raises USD 1.4 billion funding, acquires eBay India | Sakshi
Sakshi News home page

ఫ్లిప్‌కార్ట్‌లోకి 1.4 బిలియన్‌ డాలర్లు

Published Tue, Apr 11 2017 12:49 AM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM

ఫ్లిప్‌కార్ట్‌లోకి 1.4 బిలియన్‌ డాలర్లు - Sakshi

ఫ్లిప్‌కార్ట్‌లోకి 1.4 బిలియన్‌ డాలర్లు

టెన్సెంట్‌ హోల్డింగ్స్, మైక్రోసాఫ్ట్, ఈబే నుంచి పెట్టుబడులు
వ్యాల్యుయేషన్‌ మాత్రం 11.6 బిలియన్‌ డాలర్లే
2015 నాటి 15 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే ఇది తక్కువే
తన భారత కార్యకలాపాల్ని ఫ్లిప్‌కార్ట్‌లో విలీనం చేయనున్న ఈబే
తాజా పెట్టుబడుల్లో ఈబే చేస్తున్నవి 500 మిలియన్‌ డాలర్లు
ప్రతిగా ఫ్లిప్‌కార్ట్‌లో ఈబేకు కొంత వాటా; ఎంతన్నది గోప్యం!!
ఇది భారత కంపెనీలపై నమ్మకానికి నిదర్శనం: బన్సల్స్‌


న్యూఢిల్లీ: దేశీ ఈ–కామర్స్‌ రంగంలో అత్యంత భారీ డీల్‌కు తెరతీస్తూ ఫ్లిప్‌కార్ట్‌ తాజాగా మరో 1.4 బిలియన్‌ డాలర్ల నిధులు (సుమారు రూ. 9,300 కోట్లు) సమీకరించింది. 2007లో ఫ్లిప్‌కార్ట్‌ ఏర్పాటు చేశాక... గడిచిన పదేళ్లలో ఈ సంస్థలోకి ఇంత భారీ ఎత్తున నిధులు రావటం ఇదే ప్రథమం. ఈ నిధుల్ని టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ కార్పొరేషన్, చైనా ఇన్వెస్ట్‌మెంట్‌ దిగ్గజం టెన్సెంట్‌ హోల్డింగ్స్‌తో పాటు... అంతర్జాతీయ అగ్రశ్రేణి ఈ–కామర్స్‌ సంస్థ ‘ఈబే’ కలసి సమకూరుస్తున్నాయి. ఈబే తన భారత కార్యకలాపాలను ఫ్లిప్‌కార్ట్‌లో విలీనం చేయటంతో పాటు... తాజా నిధుల సమీకరణలో భాగంగా తాను 500 మిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌చేస్తోంది. ఈ నిధులకు, తన కార్యకలాపాల్ని విలీనం చేసినందుకు ప్రతిగా ఫ్లిప్‌కార్ట్‌లో కొంత వాటా తీసుకుంటోంది. అయితే ఆ వాటా ఎంతన్నది వెల్లడి కాలేదు.

తాజా నిధుల సమీకరణ ప్రకారం ఫ్లిప్‌కార్ట్‌ విలువను 11.6 బిలియన్‌ డాలర్లుగా లెక్కించారు. 2015 నాటి కంపెనీ వ్యాల్యుయేషన్‌ 15 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే ఇది తక్కువే. కాకపోతే ఇటీవల ఫ్లిప్‌కార్ట్‌లో ఇన్వెస్ట్‌ చేసిన పలు సంస్థలు తమ పెట్టుబడుల్ని రైటాఫ్‌ చేశాయి. అంటే ఫ్లిప్‌కార్ట్‌తో ఇక లాభం లేదని నిర్ణయించేసుకున్నాయి. అలాంటి సమయంలో తాజాగా ఫ్లిప్‌కార్ట్‌కు ఈ స్థాయి విలువ లెక్కించి ఏకంగా 1.4 బిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేయటమంటే మామూలు విషయం కాదు. 2008 నుంచి నిధుల సేకరణ మొదలుపెట్టిన ఫ్లిప్‌కార్ట్‌... తాజా డీల్‌తో కలిసి ఇప్పటిదాకా అంతర్జాతీయ ఇన్వెస్టర్ల నుంచి 3 బిలియన్‌ డాలర్ల నిధులు సేకరించింది. దేశీయంగా సవాలు విసురుతున్న అమెరికన్‌ ఈ– కామర్స్‌ దిగ్గజం ‘అమెజాన్‌’ను దీటుగా ఎదుర్కొనేందుకు ఫ్లిప్‌కార్ట్‌కు తాజా పెట్టుబడులు తోడ్పడతాయన్నది నిపుణుల విశ్లేషణ.

మరో పోటీ సంస్థ స్నాప్‌డీల్‌ను కొనుగోలు చేసేందుకు ఫ్లిప్‌కార్ట్‌ ఇప్పటికే చర్చలు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో తాజా నిధులు దానికి ఉపకరిస్తాయని భావిస్తున్నారు. ‘ఇది ఫ్లిప్‌కార్ట్‌కు, భారత్‌కు సంబంధించి చెప్పుకోతగిన కీలకమైన డీల్‌. సాంప్రదాయ మార్కెట్లను కుదిపేయగలిగేటటువంటి వినూత్న ఆవిష్కరణలు, టెక్నాలజీ పరిజ్ఞానం, ఆలోచనా విధానం, సమర్ధత, సత్తా మనకి ఉన్నాయని చాటిచెప్పేందుకు నిదర్శనం‘ అని ఫ్లిప్‌కార్ట్‌ వ్యవస్థాపకులు సచిన్‌ బన్సల్, బిన్నీ బన్సల్‌ పేర్కొన్నారు.

స్నాప్‌డీల్‌ కూడా సొంతమైతే..
సాఫ్ట్‌బ్యాంక్‌కు వాటాలున్న స్నాప్‌డీల్‌ను కొనుగోలు చేసే దిశగా ఫ్లిప్‌కార్ట్‌ చర్చలు జరుపుతోందన్న సంగతి తెలిసిందే. ఈ డీల్‌ సాకారమైతే దేశీ ఈ–కామర్స్‌  రంగంలో ఇదో భారీ ఒప్పందమవుతుంది. భారత ఈ–కామర్స్‌ రంగం ప్రస్తుతం ప్రాథమిక స్థాయిలోనే ఉన్నప్పటికీ.. కన్సాలిడేషన్‌ ధోరణుల సంకేతాలు కనిపిస్తున్నాయని గార్ట్‌నర్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ శాండీ షెన్‌ తెలిపారు. ఈ తరహా వ్యాపారంలో సంస్థ పరిమాణం కీలకమని పేర్కొన్నారు.

 ఇది గుర్తించే ఫ్లిప్‌కార్ట్‌ ఇకపైనా కార్యకలాపాలను మరింతగా విస్తరించే దిశగా.. కంపెనీల కొనుగోళ్లు చేపట్టే అవకాశం ఉందన్నారు. ఫ్లిప్‌కార్ట్‌ నిలకడగా మనుగడ సాగించగలిగే వ్యాపార విధాన వ్యూహాలను నిర్ధిష్ట గడువులోగా రూపొందించుకోవాల్సి ఉంటుందని, కంపెనీ తదుపరి ఎదుర్కొనబోయే పెద్ద సవాలు ఇదేనని షెన్‌ వివరించారు. ‘అదనంగా పెట్టుబడులు, ఇన్వెస్టర్ల అనుభవం తోడైతే ఇటు టెక్నాలజీ పరంగా అటు కార్యకలాపాల కోణంలోనూ ఫ్లిప్‌కార్ట్‌ మార్కెట్‌ దిగ్గజంగా ఎదగగలిగే అవకాశం ఉంది‘ అని ఆయన అభిప్రాయపడ్డారు.

పదేళ్ల ప్రయాణంలో ఎన్నో కొనుగోళ్లు...
అమెజాన్‌ మాజీ ఉద్యోగులు.. సచిన్‌ బన్సల్, బిన్నీ బన్సల్‌ కలసి 2007లో ఫ్లిప్‌కార్ట్‌ను ప్రారంభించారు. ఇందులో అమెరికన్‌ హెడ్జ్‌ ఫండ్‌ టైగర్‌ గ్లోబల్‌ అత్యధికంగా ఇన్వెస్ట్‌ చేసింది. యాక్సెల్‌ పార్ట్‌నర్స్, డీఎస్‌టీ గ్లోబల్, బైలీ గిఫోర్డ్‌ తదితర ఇన్వెస్టర్లు కూడా ఉన్నారు. ఫ్లిప్‌కార్ట్‌కు దాదాపు పది కోట్ల మంది పైగా కస్టమర్లు ఉన్నారు. ఇదివరకే ఈ సంస్థ ఫ్యాషన్‌ రిటైలింగ్‌ సంస్థలు మింత్రా, జబాంగ్‌ను... పేమెంట్స్‌ యాప్‌ ‘ఫోన్‌పే’ను కొనుగోలు చేసింది. లాజిస్టిక్స్‌ సంస్థ ఈకార్ట్‌ కూడా ఫ్లిప్‌కార్ట్‌లో భాగమే. ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్‌ తదితర ఇంటర్నెట్‌ కామర్స్‌ కంపెనీలు లాజిస్టిక్స్‌ మౌలిక సదుపాయాలు, మార్కెటింగ్‌పై కోట్లు కుమ్మరిస్తున్నా మిగతా ఇంటర్నెట్‌ కంపెనీల్లా భారీ నష్టాలనే నమోదు చేస్తున్నాయి.

 పైపెచ్చు పుష్కలంగా నిధుల దన్ను ఉన్న అమెజాన్‌ వంటి విదేశీ సంస్థలతో ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్‌ వంటి దేశీ ఈకామర్స్‌ సంస్థలకు రాబోయే రోజుల్లో మరింత గట్టి పోటీ ఎదురుకానుంది. మరోవైపు, ఇన్వెస్టర్లు లాభాలపై మరింత దృష్టితో వ్యయాలను గణనీయంగా క్రమబద్ధీకరించుకుంటూ వస్తుండటంతో దేశీ ఇంటర్నెట్‌ కంపెనీలు నిధులు సమీకరించుకోవడం కష్టతరంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఇంత భారీగా నిధులు దక్కించుకోవడం .. పోటీని ఎదుర్కొనడంలో ఫ్లిప్‌కార్ట్‌కి కాస్త తోడ్పాటునివ్వగలదని అంచనా. అత్యధికంగా ఇన్వెస్ట్‌ చేసిన ..టైగర్‌ గ్లోబల్‌ ఇటీవలే ఫ్లిప్‌కార్ట్‌ సీఈవోగా కల్యాణ్‌ కృష్ణమూర్తిని నియమించింది. ఇప్పటిదాకా కంపెనీ వ్యవస్థాపకులిద్దరిలో ఒకరు ఆ బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చారు.  తక్కువ వ్యాల్యుయేషన్‌పై నిధులు వచ్చినప్పటికీ.. కల్యాణ్‌ కృష్ణమూర్తి సారథ్యంలో కంపెనీ మెరుగ్గా రాణించవచ్చన్న ఆశాభావానికి ఇది సూచనగా భావించవచ్చని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి.  

ఈబే కార్యకలాపాలు విలీనం...
ప్రతిపాదిత డీల్‌ ప్రకారం ఈబే 500 మిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేయటమే కాక తన భారత కార్యకలాపాలను విలీనం చేస్తుంది. అయితే ఫ్లిప్‌కార్ట్‌ నిర్వహణలో‘ఈబే.ఇన్‌’ కార్యకలాపాలు అదే పేరుతో స్వతంత్రంగా కొనసాగుతాయి. ‘సీమాంతర వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు, ఈబే అంతర్జాతీయ ఉత్పత్తులను మరింత మంది భారతీయ వినియోగదారులకు చేరువ చేసేందుకు కలసి పనిచేయాలని ఫ్లిప్‌కార్ట్‌తో ప్రత్యేక ఒప్పం దం కుదుర్చుకున్నాం‘ అని ఈబే ఒక ప్రకటనలో పేర్కొంది. మరో ఇన్వెస్టరైన చైనా సంస్థ టెన్సెంట్‌కి.. ప్రస్తుతం వుయ్‌చాట్‌ అనే సోషల్‌ మెసేజింగ్‌ యాప్‌ ఉంది. ప్రాక్టో, ఐబిబో వంటి వివిధ భారతీయ ఆన్‌లైన్‌ కంపెనీలతో పాటు చైనాలోని పలు భారీ సంస్థల్లో టెన్సెంట్‌ ఇన్వెస్ట్‌ చేసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement