పది గంటల్లో రూ. 600 కోట్ల అమ్మకాలు!
బిగ్ బిలియన్ డే.. ఈ మాట సోమవారం నాడు లక్షలాది మంది ఫ్లిప్కార్ట్ యూజర్లను ఎంతగానో ఊరించింది. 40 అంగుళాల ప్లాస్మా టీవీ 20వేల రూపాయలకే అంటే అవసరం ఉన్నవాళ్లు, లేనివాళ్లు కూడా పోటీలు పడి మరీ కొన్నారు. ఇలా మొత్తం అందరి కొనుగోళ్లు కలిపి కేవలం పది గంటల్లో జరిగిన మొత్తం అమ్మకాలు.. అక్షరాలా 600 కోట్ల రూపాయలు! అయితే, ఈ అమ్మకం సమయంలో సవాలక్ష సమస్యలు తలెత్తాయంటూ చాలామంది యూజర్లు సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోశారు. ఉదయం 8 గంటల నుంచే కస్టమర్లు కొనుగోళ్లు మొదలుపెట్టారని, నాణ్యమైన ఉత్పత్తులు తక్కువ ధరలకు రావడంతో రోజంతా అమ్మకాలు విపరీతంగా సాగాయని, భారతీయ ఈ-కామర్స్ చరిత్రలోనే ఇదో రికార్డని ఫ్లిప్ కార్ట్ సహ వ్యవస్థాపకులు సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్ ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు.
అయితే, లావాదేవీలు పూర్తి చేయడంలో కొన్ని సమస్యలు తలెత్తిన మాట కూడా వాస్తవమేనని వారు ఆ ప్రకటనలో అంగీకరించారు. వచ్చిన ఎర్రర్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ వాటిని సరిచేయడానికి తమ టెక్నాలజీ బృందం నిరంతరం శ్రమించిందని చెప్పారు. కేవలం ఒక్క సోమవారం రోజునే వంద కోట్ల హిట్లు తమ సైట్కు వచ్చాయన్నారు. పది గంటల అమ్మకాల్లో సుమారు రూ. 615 కోట్ల లావాదేవీలు జరిగాయన్నారు.
ఇక ఫ్లిప్కార్ట్కు ప్రత్యర్థి అయిన స్నాప్డీల్ కూడా దివాలీ బంపర్ సేల్ అంటూ సోమవారం నడిపించింది. తాము నిమిషానికి కోటి రూపాయల చొప్పున అమ్మినట్లు ఆ సైట్ ప్రతినిధులు తెలిపారు. అది సుమారుగా ఫ్లిప్కార్ట్ అమ్మకాలకు సమానం అవుతుంది.