సరుకులమ్ముతాం.. సరుకులూ!
పుస్తకాలతో మొదలుపెట్టి.. ఇప్పటికే మొబైల్ ఫోన్ల వరకు అన్ని రకాల వస్తువులను ఆన్లైన్లో అమ్ముతున్న ఈ-బిజినెస్ సైట్ ఫ్లిప్కార్ట్ సరికొత్త వ్యాపారంలోకి దిగుతోంది. ఈ ఏడాది రెండో అర్ధభాగం నుంచి నిత్యావసర సరుకులను కూడా ఆన్లైన్లో అమ్మేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే బిగ్ బాస్కెట్, జాప్ నౌ లాంటి కొన్ని సైట్లు ఇలాంటి సేవలను అందిస్తున్నాయి. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ప్రవేశంతో వీటికి గట్టిపోటీ ఎదురవడం ఖాయమనే అంటున్నారు. తమ సంస్థకు ఇప్పటికే సాంకేతిక పరిజ్ఞానం, గోడౌన్లు, బ్రాండు అన్నీ ఉన్నాయని.. ఇప్పుడు ఈ వ్యాపారంలో అడుగుపెట్టేందుకు ఎలాంటి అడ్డంకులు లేవని సంస్థ ప్రతినిధి ఒకరు అన్నారు.
మరోవైపు అమెజాన్ పోర్టల్ ఇప్పటికే కొన్ని రకాల ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలు, డ్రింకులను ఇప్పటికే గత సంవత్సరం అక్టోబర్ నెలనుంచి సైట్లో అమ్మకానికి పెట్టింది. స్నాప్డీల్ కూడా ఈ రంగంలో ఉంది. వాళ్లు గోద్రెజ్ నేచర్స్ బాస్కెట్తో ఒప్పందానికి వచ్చారు. ఆర్డర్ చేసిన మర్నాడు వినియోగదారుడి ఇంటికి సరుకులు వచ్చేస్తాయి. త్వరలోనే ఆన్లైన్ మార్కెట్లో నిత్యావసర సరుకుల మార్కెట్ చాలా భారీగా పెరుగుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.