హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో రుణ దాతలు బాధ్యతగా వ్యవహరించాలని లేకపోతే రుణ పరిశ్రమ ప్రతికూలంగా మారుతుందని ఫైనాన్షియల్ ప్లానింగ్ స్టాండర్డ్స్ బోర్డ్ ఇండియా (ఎఫ్‌పీఎస్‌బీ) వైస్ చైర్మన్ అండ్ సీఈఓ రంజిత్ మధోల్కర్ చెప్పారు.
బాధ్యత, పారదర్శకత అనేది కేవలం చిన్న రుణదాతలకే కాదు, కార్పొరేట్, వ్యక్తిగత రుణదాతలు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, లిస్టెడ్ కంపెనీలు అందరికీ వర్తిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. అప్పుడే స్కామ్‌లు, ఎన్‌పీఏలు తగ్గుముఖం పడతాయని అభిప్రాయపడ్డారు. దేశంలో తొలిసారిగా రుణదాతల బాధ్యతలపై ఎఫ్‌పీఎస్‌బీ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లక్నో కలసి ‘నావిగేటర్; దేశంలో బాధ్యతాయుతమైన రుణదాత’ అనే అంశంపై పరిశోధన నిర్వహించింది.
‘‘ఈ పరిశోధనలో 80–85 శాతం మార్కెట్ వాటా ఉన్న సుమారు 15–16 ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలు భాగస్వాములయ్యాయి. వీటిల్లో బజాజ్ ఫిన్‌సర్వ్, యాక్సిస్, స్టాండర్డ్ చార్టెర్డ్, టాటా క్యాపిటల్, హెచ్‌డీబీఎఫ్‌ఎస్, హోమ్ క్రెడిట్ వంటివి కొన్ని. రుణ దరఖాస్తు విధానం, రుణ దాత సమాచారం, రుసుములు, సేవలు, ఆర్థిక సమూహం వంటి ఐదు ప్రామాణికాల ఆధారంగా ఈ సర్వే చేశాం’’ అని ఆయన వివరించారు.
రూ.15 వేల లోపు రుణాలపై ఫోకస్..
‘‘దేశంలో రుణ పరిశ్రమ శరవేగంగా వృద్ధి చెందుతోంది. బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలు వినియోగదారుల కోసం సులభమైన ఫైనాన్షియల్ ఆప్షన్లను అందించాల్సిన అవసరముంది. నావిగేటర్ నివేదిక పరిశ్రమకు, సంస్థాగత ఇన్వెస్టర్లకు బాధ్యతాయుతమైన రుణ ప్రమాణాలను, పరిమితులను, స్వయం నియంత్రణ వంటివి ఏర్పాటు చేసింది.
బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలు రూ.15 వేలు లోపుండే చిన్న, వ్యక్తిగత రుణాలపై దృష్టి సారించాలి’’ అని మధోల్కర్ సూచించారు. రుణ గ్రహీతలకు అందులోనూ తొలిసారి రుణం తీసుకుంటున్న వారికి బాధ్యతాయుతమైన రుణ విధానాలను పరిచయం చేయాల్సిన అవసరముందన్నారు. అందుబాటు, పారదర్శకత, షరతుల వంటివి రుణగ్రహీతలకు రుణాలను తిరిగి చెల్లించటానికి సహాయపడతాయన్నారు.
ఏడాదిలో రుణ గ్రహీతల నివేదిక..
‘‘ఓ ప్రైవేట్ అకడమిక్ ఏజెన్సీతో కలసి రుణ గ్రహీత బాధ్యత అంశాలపైన కూడా పరిశోధన చేస్తున్నాం. ఇందులో రుణ గ్రహీతల కోరికలు, అభిప్రాయాలు, అనుభవాలు, బాధ్యతలు ఇతరత్రా అంశాలుంటాయి. ఇది పూర్తి కావడానికి 8–9 నెలల సమయం పడుతుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం చివరికల్లా పూర్తి నివేదిక ప్రతులను అందిస్తాం’’ అని రంజిత్ వివరించారు. 50కి పైగా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలు, ఎన్‌బీఎఫ్‌సీలు, సెక్యూరిటీస్, అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీల సమూహమే ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ స్టాండర్డ్స్ బోర్డ్ ఇండియా (ఎఫ్‌పీఎస్‌బీ).
Comments
Please login to add a commentAdd a comment