జీడీపీ గణాంకాలపై దృష్టి..! | Focus on GDP statistics | Sakshi
Sakshi News home page

జీడీపీ గణాంకాలపై దృష్టి..!

Published Mon, Aug 31 2015 1:32 AM | Last Updated on Fri, Nov 9 2018 5:30 PM

జీడీపీ గణాంకాలపై దృష్టి..! - Sakshi

జీడీపీ గణాంకాలపై దృష్టి..!

- విదేశీ అంశాలు; చమురు, రూపాయి కదలికలు కూడా
- ఈ వారం స్టాక్ మార్కెట్ ట్రెండ్‌పై నిపుణుల విశ్లేషణ
- నేడు విడుదల కానున్న క్యూ1 జీడీపీ గణాంకాలు
ముంబై:
దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి స్థూల గణాంకాలు, విదేశీ నిధుల ప్రవాహం, అంతర్జాతీయ పరిణామాలు ఈ వారం మన స్టాక్ మార్కెట్లకు దిశానిర్ధేశం చేయనున్నాయి. ప్రస్తుతం నెలకొన్న తీవ్ర హెచ్చుతగ్గుల ధోరణి ఇప్పుడప్పుడే తొలగిపోయే అవకాశం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రధానంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2015-16) జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) గణాంకాలు నేడు(సోమవారం) విడుదల కానున్నాయి. దీంతోపాటు రుతుపవనాల పురోగతి, డాలరుతో రూపాయి మారకం విలువ కదలికలు, అంతర్జాతీయంగా ముడిచమురు ధరల్లో హెచ్చుతగ్గులు కూడా దేశీ మార్కెట్లలో ట్రెండ్‌ను నిర్ధేశించడంలో కీలకంగా నిలుస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు.
 
తీవ్ర హెచ్చుతగ్గులు కొనసాగవచ్చు...
సంస్కరణలకు సంబంధించి ప్రభుత్వం తీసుకోబోయే తదుపరి చర్యలు, ఆగస్టునెలకు సంబంధించి వాహన కంపెనీల అమ్మకాల డేటా(1న విడుదల అవుతుంది) కూడా స్వల్పకాలంలో మార్కెట్‌పై ప్రభావం చూపుతుందని క్యాపిటల్ వయా గ్లోబల్ రీసెర్చ్ సీఎంటీ రీసెర్చ్ డెరైక్టర్ వివేక్ గుప్తా పేర్కొన్నారు. ఈ వారం కూడా తీవ్ర హెచ్చుతగ్గులు ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవలి స్టాక్ మార్కెట్ పతనానికి పూర్తిగా విదేశీ అంశాలే కారణమని.. స్థూలంగా చూస్తే మన మార్కెట్ ఇంకా పటిష్టంగానే ఉందని గుప్తా పేర్కొన్నారు.

భారీస్థాయిలో ఒడిదుడుకులు నెలకొన్నప్పుడు మార్కెట్ కుదుటపడేందుకు(బాటమ్ అవుట్)  కొంత కాలం పడుతుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ‘గత వారంలో వెనక్కివెళ్లిన భారీ విదేశీ నిధులు మళ్లీ తక్షణం మార్కెట్లోకి తిరిగివచ్చే అవకాశాల్లేవు. ఇటీవల ఎదుర్కొన్న కుదుపులు కొనసాగవచ్చు. సమీప కాలంలో ఇన్వెస్టర్లు చైనా, అమెరికా(ముఖ్యంగా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపునకు సంబంధించి) నుంచి వచ్చే వార్తలపై నిశితంగా దృష్టిపెట్టాలి. అంతర్జాతీయంగా మార్కెట్లలో నెలకొన్న తాజా పరిణామాల కారణంగా ఫెడ్ వడ్డీరేట్ల పెంపును డిసెంబర్ వరకూ వాయిదా వేయొచ్చన్న వాదనలు జోరుగా వినబడుతుండటమే దీనికి కారణం. ఇక ఇప్పుడున్న ఒడిదుడుకుల సమయంలో సంస్థాగతంగా పటిష్టంగా ఉన్న కంపెనీల షేర్లను కొనుగోలు చేయడమే సరైన వ్యూహం’ అని రిలయన్స్ సెక్యూరిటీస్ రీసెర్చ్  హెడ్ హితేష్ అగర్వాల్ పేర్కొన్నారు.
 
జీడీపీ అంచనాలు...
జూన్ క్వార్టర్(క్యూ1) జీడీపీ వృద్ధి రేటు 7-7.5 శాతం శ్రేణిలో ఉండొచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. గతేడాది చివరి త్రైమాసికం(క్యూ4)లో వృద్ధి రేటు 7.5 శాతంగా నమోదవగా, క్యూ1లో ఇది 6.7 శాతంగా ఉంది. ఈ ఏడాది తొలి క్వార్టర్‌లో వృద్ధి 7.4-7.5 శాతంగా ఉండొచ్చని... ప్రధానంగా వ్యవసాయ రంగం వృద్ధి రేటు దిగజారే అవకాశం ఉందని క్రిసిల్ చీఫ్ ఎకనమిస్ట్ డీకే జోషి పేర్కొన్నారు.
 
గత వారం మార్కెట్...
చైనా మందగమనం, ఆ దేశ కరెన్సీ యువాన్ డీవేల్యూ ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లు గత వారంలో తీవ్ర కుదుపులకు గురైన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో సెన్సెక్స్ గత సోమవారం ఏకంగా 1,700 పాయింట్ల మేర కుప్పకూలింది. అయితే, ఆ తర్వాత భారీగానే కోలుకున్నప్పటికీ... వారం మొత్తంమీద 974 పాయింట్లు(3.55%) నష్టపోయి 26,392 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం గత వారంలో 298 పాయింట్లు(3.59%) క్షీణించి 8,002 వద్ద స్థిరపడింది.
 
రూ.17,555 కోట్లు వెనక్కి తీసుకున్న ఎఫ్‌పీఐలు
న్యూఢి ల్లీ: విదేశీ ఇన్వెస్టర్లు భారత క్యాపిటల్ మార్కెట్ నుంచి రూ.17,555 కోట్లను వెనక్కు తీసుకున్నారు. డిపాజిటరీస్ గణాంకాల ప్రకారం.. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) ఆగస్ట్ 28 వరకు ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ.16,936 కోట్లను వెనక్కు తీసుకున్నారు. అదే సమయంలో మరో రూ.619 కోట్లను రుణ మార్కెట్ల నుంచి విత్‌డ్రా చేసుకున్నారు. దీంతో మొత్తంగా ఎఫ్‌పీఐలు రూ.17,555 కోట్లను భారత స్టాక్ మార్కెట్ నుంచి వెనక్కు తీసుకున్నారు. స్టాక్ మార్కెట్ భారీగా కుప్పకూలిన సోమవారం ఒక్కరోజే ఎఫ్‌పీఐలు నికరంగా రూ.5,173 కోట్ల  షేర్లను విక్రయించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement