100 మందిలో ఆమె స్థానం 30
ముంబై: ఎస్బీఐ తొలి మహిళా అధినేత అరుంధతీ భట్టాచార్య మరో ఆరడుగులు ముందుకు వేశారు. అవును.. ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన మహిళల ర్యాంకింగ్లో ఆమె మరో ఆరు ర్యాంకులు పైకి ఎగబాకి 30వ స్థానాన్ని కొట్టేశారు. బుధవారం వెల్లడించిన తాజా ఫోర్బ్స్ 'మోస్ట్ పవర్ ఫుల్ విమెన్ లిస్ట్' లో ఆమె ఈ ఘనతను సాధించారు. గత సంవత్సరం ఈమె 36వ స్థానంలో ఉన్నారు.
కోలకత్తాకు చెందిన 59 ఏళ్ల అరుంధతీ భట్టాచార్య స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్ పర్సన్ బాధ్యతలు చేపట్టినప్పటినుంచి సంస్థను అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించారు. లాభాల బాట పట్టించారు. వివిధ సంస్కరణలతో ఉద్యోగుల అభిమానాన్ని చూరగొన్నారు. ముఖ్యంగా ప్రసూతి సెలవును రెండు సంవత్సరాలకు పెంచి పలువురి ప్రశంసలందుకున్నారు.
కాగా ఐసిఐసీ ఛైర్ పర్సన్ చందా కొచ్చర్, బయోకాన్ ఎండీ, కిరణ్ మజుందార్ షా, హెచ్టీ మీడియా అధినేత శోభనా భార్టియా తదితరులు ఈ జాబితాలో చోటు సంపాదించారు.
12వ వార్షిక అత్యంత శక్తిమంతమైన వందమంది మహిళల జాబితాను ఫోర్బ్స్ సంస్థ బుధవారం విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయవేత్తలు, పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీలు, భూరిదాతల్లో ఎంపిక చేసిన 100 మంది మహిళల జాబితాను ప్రతీ సంవత్సరం విడుదల చేయడం ఆనవాయితీ.