ఫోర్బ్స్ జాబితాలో అరుంధతీ భట్టాచార్య
ముంబై: దేశీ దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య తాజాగా ఫోర్బ్స్ రూపొం దించిన ‘ఆర్థిక వ్యవహారాల్లో అత్యంత శక్తివంతమైన మహిళల’ జాబితాలో 5వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆమె ర్యాంక్ 5 స్థానాలు మెరుగుపడటం విశేషం. అలాగే భట్టాచార్య.. ఫోర్బ్స్ ‘ప్రపంచంలోని వంద మంది అత్యంత శక్తివంతమైన మహిళల’ జాబితాలో 25వ స్థానాన్ని పొందారు. ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న ఎస్‌బీఐ బ్యాంకును డిజిటల్ మయం చేయడంలో ఆమె పాత్ర అనిర్వచనీయమని ఫోర్బ్స్ కితాబునిచ్చింది. అరుంధతీ భట్టాచార్య.. మొబైల్ వాలెట్ ‘ఎస్‌బీఐ బడ్డీ’, రిటైల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ‘స్టేట్ బ్యాంక్ ఎనీవేర్’, కస్టమర్లను చైతన్యవంతుల్ని చేయడం కోసం ‘ఎస్‌బీఐ టెక్ లెర్నింగ్ సెంటర్స్, డిజిటల్ బ్యాంకింగ్ ఔట్‌లెట్ ‘ఎస్‌బీఐ ఇన్‌టచ్’, పేమెంట్ అగ్రిగేటర్ సర్వీస్ ‘ఎస్‌బీఐ ఈ-పే’ వంటి తదితర సేవలను ఆవిష్కరించారు.