అత్యంత శక్తివంత మహిళా వాణిజ్యవేత్త అరుంధతీ భట్టాచార్య
టాప్-10లో అపోలో ఎండీ ప్రీతా రెడ్డి
న్యూఢిల్లీ: భారత్‌లో అత్యంత శక్తివంతమైన మహిళా వాణిజ్యవేత్తగా ఎస్‌బీఐ చైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్యను ఫోర్బ్స్ మేగజీన్ ఎంపిక చేసింది. టాప్-50లో తొలిసారిగా అడుగు పెట్టిన ఆమె ఏకంగా అగ్రస్థానాన్ని చేజిక్కించుకోవడం విశేషం. కాగా, రెండో స్థానంలో ఐసీఐసీఐ చీఫ్ చందా కొచర్, మూడో ర్యాంకులో యాక్సిస్ బ్యాంక్ చీఫ్ శిఖా శర్మలు చోటు దక్కించుకున్నారు. ఈసారి కొత్తగా 8 మంది ఈ జాబితాలోకి వచ్చారు. ఇందులో హెచ్‌పీసీఎల్ సీఎండీ నిషి వాసుదేవ(4వ ర్యాంకు) ఒకరు.
కాగా, మిగతా టాప్-10 మహిళా వాణిజ్యవేత్తల్లో ఏజడ్‌బీ పార్ట్‌నర్స్ సహ వ్యవస్థాపకులు సియా మోడీ(5వ స్థానం), టఫే సీఈఓ మల్లికా శ్రీనివాసన్(6), క్యాప్ జెమిని ఇండియా సీఈఓ అరుణ జయంతి(7), అపోలో హాస్పిటల్స్ ఎండీ ప్రీతా రెడ్డి(8), బయోకాన్ సీఎండీ కిరణ్ మజుందార్ షా(9), హెచ్‌టీ మీడియా చైర్‌పర్సన్ శోభనా భర్తియా ఉన్నారు. మొండిబకాయిలపై అలుపెరుగని పోరు.. ఆమెను నంబర్ వన్ స్థానంలో నిలబెట్టిందని ఫోర్బ్స్ తెలిపింది. ఎస్‌బీఐ చీఫ్‌గా ఆమె బాధ్యతలు చేపట్టిననాటినుంచి మొండిబకాయిల తగ్గింపు, వ్యయాల్లో కోత, బ్యాంకుకు తగిన నిధుల సమీకరణ వంటి అంశాలను విజయవంతంగా కొనసాగిస్తున్నారని వెల్లడించింది.