ఫోర్డ్ నుంచి కొత్త ఎండీవర్
♦ రక్షణ కోసం ఏడు ఎయిర్‌బ్యాగ్స్
♦ ధర రూ.24.1-28.69 లక్షలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ ఫోర్డ్ ఇండియా ప్రీమియం ఎస్‌యూవీ విభాగంలో సరికొత్త ఎండీవర్‌ను భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. పటిష్టమైన ఉక్కుతో వాహ నాన్ని తయారు చేశారు. ప్రీమియం ఎస్‌యూవీలో తొలిసారిగా ఈ కారులో ఏడు ఎయిర్‌బ్యాగ్స్‌ను వాడారు. ఇందులో ఒకటి డ్రైవర్ సీటు ముందు మోకాలి రక్షణకోసం ఏర్పాటు చేశారు. మౌఖిక ఆదేశాల ఆధారంగా పనిచేసేలా సింక్-2 అనే వ్యవస్థ ఉంది. 10,000లకుపైగా విభిన్న ఆదేశాలను ఇది సులభంగా గుర్తిస్తుంది.
ఏడుగురు కూర్చోవచ్చు. ఫోర్ వీల్ డ్రైవ్, కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, సెమి-ఆటో ప్యారలల్ పార్క్ అసిస్ట్, ఎలక్ట్రిక్ పనోరమిక్ సన్‌రూఫ్‌తోపాటు ప్రయాణానికి ఇబ్బందిగా ఉన్న రోడ్లలో డ్రైవర్‌ను హెచ్చరించే అడ్వాన్స్‌డ్ టెరైన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ప్రీమియం ఎస్‌యూవీల హవా..: భారత్‌లో ప్రీమియం ఎస్‌యూవీల మార్కెట్ ప్రస్తుతం 18,000 యూనిట్లుంది. 2024 నాటికి ఇది ఒక లక్ష యూని ట్లకు ఎగుస్తుందని ఫోర్డ్ ఇండియా డీలర్ డెవలప్‌మెంట్ జీఎం ఎస్.లక్ష్మీరామ్ కుమార్ తెలిపారు. హైదరాబాద్ మార్కెట్లో కొత్త ఎండీవర్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. 2020 నాటికి భారత్ నుంచి 50 దేశాలకు వాహనాలను ఎగుమతి చేయాలన్నది కంపెనీ లక్ష్యమని చెప్పారు. 2016 ఫోర్డ్‌కు ఆశాజనకంగా ఉంటుందన్నారు. కాగా, హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో సరికొత్త ఎండీవర్ ధర వేరియంట్‌నుబట్టి రూ.24.1-28.69 లక్షలు ఉంది. 2.2, 3.2 లీటర్ ఇంజిన్ వేరియంట్లలో 6 స్పీడ్ ఆటోమేటిక్, మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో ఇది లభిస్తుంది.