
ఎం అండ్ ఎం, ఫోర్డ్ జట్టు
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీలు మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం), ఫోర్డ్ మోటార్ మళ్లీ తాజాగా చేతులు కలిపాయి. ప్రొడక్టు డెవలప్‌మెంట్, ఎలక్ట్రిక్ వెహికల్స్, దేశవిదేశాల్లో డిస్ట్రిబ్యూషన్ వంటి పలు అంశాలకు సంబంధించి ఇరు సంస్థలు వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఫోర్డ్ మోటార్, ఎం అండ్ ఎం కంపెనీలు తాజా ఎంవోయూలో భాగంగా మొబిలిటీ ప్రోగ్రామ్స్, కన్సెప్ట్ వెహికల్ ప్రాజెక్ట్స్, ఎలక్ట్రిఫికేషన్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ వంటి అంశాల్లో పరస్పర సహకారం అందించుకోనున్నాయి. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం మూడేళ్లపాటు కొనసాగుతుందని ఇరు కంపెనీలు తెలిపాయి.
‘ఇదివరకు ఫోర్డ్ మోటార్‌తో కుదుర్చుకున్న భాగస్వామ్యం పునాదులపైనే తాజా ఒప్పందం కుదిరింది. దీని వల్ల ఇరు కంపెనీలకు ప్రయోజనం ఉంటుంది’ అని మహీంద్రా అండ్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకా తెలిపారు. ‘భారత్ తమకు ప్రధాన మార్కెట్. వినియోగదారులకు ఉత్తమమైన వాహనాలను, సర్వీసులను అందించేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుంది’ అని ఫోర్డ్ ఎగ్జిక్యూటివ్ వైస్–ప్రెసిడెంట్ జిమ్ ఫార్లీ తెలిపారు. 1990లలో ఇరు సంస్థలు సమాన వాటాలతో మహీంద్రా ఫోర్డ్ ఇండియా అనే జాయింట్ వెంచర్‌ను నెలకొల్పాయి. ఆతర్వాత మహీంద్రా దాని నుంచి బయటకు వచ్చేసింది.