జీడీపీ వృద్ధి జోరు.. | Forget China? India reports higher GDP | Sakshi
Sakshi News home page

జీడీపీ వృద్ధి జోరు..

Published Tue, Feb 9 2016 12:32 AM | Last Updated on Tue, Oct 9 2018 4:06 PM

జీడీపీ వృద్ధి జోరు.. - Sakshi

జీడీపీ వృద్ధి జోరు..

అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో వృద్ధి రేటు 7.3శాతం
తయారీ రంగం ఊతం   క్యూ1, క్యూ2 గణంకాలూ పైపైకి..

దీనితో 2015-16లో 7.6 శాతం రేటు ఖాయమన్న అంచనాలు

 న్యూఢిల్లీ: భారత స్థూల దేశీయోత్పత్తి  (జీడీపీ) వృద్ధి అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో అంచనాలను మించింది. 7.3 శాతంగా ఈ రేటు నమోదయ్యింది. ఇంతక్రితం రెండు త్రైమాసికాల గణాంకాలను కూడా ఎగువముఖంగా సవరిస్తూ... కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్‌ఓ) తాజా లెక్కలను సోమవారం విడుదల చేసింది. దీని ప్రకారం ఏప్రిల్-జూన్ త్రైమాసికం వృద్ధిరేటు 7 శాతం నుంచి భారీగా 7.6 శాతానికి సవరించారు. తరువాతి త్రైమాసికం (జూలై-సెప్టెంబర్) వృద్ధి రేటు గణాంకాలను కూడా 7.4  శాతం నుంచి 7.7 శాతానికి పెంచారు.

పరిశ్రమల మాట ఇదీ..
సంస్కరణలు మున్ముందూ కొనసాగుతాయన్న విశ్వాసాన్ని ఫిక్కీ సెక్రటరీ జనరల్ ఏ దిదార్ సింగ్ వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 29 బడ్జెట్ ఆర్థిక రంగానికి మరింత ఊపునిస్తుందన్నది తమ అభిప్రాయమని తెలిపారు. కాగా ఆర్థిక వ్యవస్థ పురోగతికి ప్రభుత్వం సానుకూల విధాన చర్యలను వచ్చే బడ్జెట్‌లో తీసుకోవాలని అసోచామ్ పేర్కొంది. ముఖ్యంగా వ్యవసాయం, మౌలిక, స్టీల్, బ్యాంకింగ్, ఆర్థిక రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఇండస్ట్రీ బాడీ కోరింది.

 వివిధ దేశాలను చూస్తే...
2015లో చైనా 6.9 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. రష్యాలో అసలు వృద్ధిలేకపోగా 3.7 శాతం క్షీణత నమోదయ్యింది. బ్రెజిల్ కూడా ఇదే ధోరణిలో 3.7 శాతం క్షీణ వృద్ధిని నమోదుచేసుకుంది. తాజా పరిణామాల నేపథ్యంలో ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ కొనసాగుతోంది.

 ముఖ్యాంశాలు చూస్తే...
వార్షికంగా చూస్తే... త్రైమాసికంలో మొత్తం వృద్ధి రేటు 6.6 శాతం నుంచి 7.3 శాతానికి ఎగిసింది.
తయారీ: ఈ రంగంలో వృద్ధి  రేటు భారీగా 1.7 శాతం నుంచి భారీగా 12.6 శాతానికి ఎగసింది.
ట్రేడ్, హోటల్స్, రవాణా,  కమ్యూనికేషన్లు, బ్రాడ్‌కాస్టింగ్: వృద్ధి రేటు 6.2 శాతం నుంచి 10.1 శాతానికి ఎగిసింది.
వ్యవసాయం: 2014-15 మూడవ త్రైమాసికంలో ఈ రంగంలో అసలు వృద్ధి లేకపోగా 2.4 శాతం క్షీణత నమోదయ్యింది. అయితే ఈ క్షీణత ప్రస్తుతం 1 శాతానికి తగ్గింది.
మైనింగ్ అండ్ క్వారీయింగ్: ఈ రంగంలో వృద్ధి రేటు 9.1 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గింది.
విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర వినియోగ సేవలు: వృద్ధి రేటు 8.8 శాతం నుంచి 6 శాతానికి దిగింది.
నిర్మాణం: ఈ రంగంలో వృద్ధి రేటు 4.9% నుంచి 4%కి చేరింది.
ఫైనాన్స్, రియల్టీ, ప్రొఫెషనల్ సేవలు: వృద్ధి రేటు 12.1 శాతం నుంచి 9.9 శాతానికి తగ్గింది.
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రక్షణ, ఇతర సేవలు: వృద్ధి రేటు 25.3 శాతం నుంచి భారీగా 7.5 శాతానికి పడింది.

 పెట్టుబడుల సంగతికి వస్తే...
పెట్టుబడులకు సంకేతంగా ఉంటున్న స్థూల స్థిర మూలధన కల్పన (జీఎఫ్‌సీఎఫ్) వార్షికంగా (ప్రస్తుత ధరల వద్ద) రూ.38.44 లక్షల కోట్ల నుంచి రూ.39.82 లక్షల కోట్లకు పెరుగుతుందని తాజా అంచనాలు పేర్కొన్నాయి.

 2015-16పై అంచనాలు ఇలా...
తాజా లెక్కలతో మొత్తం ఆర్థిక సంవత్సరం (2015-16) అంచనాలు సైతం 7.6 శాతానికి పెరిగాయి. ఇదే జరిగితే 2010-11 తరువాత (అప్పట్లో 8.9 శాతం) ఇప్పటి వరకూ ఈ స్థాయి వృద్ధి నమోదుకావడం ఇదే తొలిసారి అవుతుంది. 2014-15లో జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతంగా నమోదయ్యింది. అయితే ఈ వృద్ధి రేటు 2015-16లో 7.3 శాతంగా ఉంటుం దని ఇప్పటివరకూ అంచనావేస్తూ వచ్చారు. తాజా గణాంకాలతో ఈ అంచనాలు పెరిగే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు 7.6 శాతంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (సీఎస్‌ఓ) అంచనా వేసింది.  తయారీ భారీ వృద్ధి, వ్యవసాయ రంగం మెరుగుపడే అవకాశాలు తమ అంచనాకు కారణమని సీఎస్‌ఓ పేర్కొంది.

  మొత్తం జీడీపీలో దాదాపు 15 శాతం వాటా కలిగిన తయారీ రంగం 2014-15లో 5.5 శాతం వృద్ధిని నమోదుచేసుకుంటే... 2015-16లో ఈ వృద్ధి రేటు 9.5 శాతంగా ఉంటుందని సీఎస్‌ఓ అంచనా. ఇక కొంచెం అటుఇటుగా అంతే వెయిటేజ్ ఉన్న వ్యవసాయ రంగం వృద్ధి రేటు కూడా 0.2% నుంచి 1.1 శాతానికి పెరుగుతుందని అధికార వర్గాల అంచనాలు. ఆర్థిక మంత్రిత్వశాఖ మధ్యంతర ఆర్థిక విశ్లేషణలో 2015-16లో జీడీపీ వృద్ధి అంచనా 7 నుంచి 7.5 శాతం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.4 శాతం.  ఐఎంఎఫ్ అంచనా 7.3%గా ఉంటే... ఏడీబీ అంచనా 7.4%గా ఉంది. మూడీ ఇన్వెస్టర్ సర్వీస్ అంచనా 7%. తాజా గణాంకాలను చూస్తే... గణాంకాలు అందరి అంచనాలను మించే పరిస్థితి కనిపిస్తోంది.

 సానుకూల ఫలితం: శక్తికాంత దాస్
తాజా జీడీపీ వృద్ధిరేటు గణాంకాలు తగిన సానుకూల దిశలో ఉన్నట్లు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ప్రభుత్వం గడచిన 18 నెలల నుంచీ చేపడుతున్న విధాన, సంస్కరణాత్మక చర్యలు సత్ఫలితాలను ఇవ్వడం ప్రారంభించినట్లు తాజా గణాంకాలు తెలియజేస్తున్నాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

నెలవారీ తలసరి ఆదాయం రూ. 6,453
2011-12 ధరల వద్ద వాస్తవిక రీతిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తలసరి ఆదాయం రూ.77,431గా నమోదవుతుందని (నెలకు రూ.6,453) సీఎస్‌ఓ అంచనా. 2014-15లో ఈ విలువ రూ.72,889గా ఉంది. అంటే ఈ తలసరి ఆదాయంలో వృద్ధి రేటు 5.8 శాతం నుంచి 6.2 శాతానికి పెరుగుతుందని సీఎస్‌ఓ అంచనా వేస్తోంది.

 జీడీపీ వృద్ధి తీరు ఇదీ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement