వృద్ధికి ‘తయారీ’ జోష్..
జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 7.4 శాతం జీడీపీ వృద్ధి రేటు
ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న దేశం హోదాలో భారత్
తయారీ రంగం వృద్ధి రేటు 9.3 శాతం మైనింగ్, సేవా రంగాలూ ఊతం
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతున్నట్లు సోమవారం వెల్లడైన తాజా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలు వెల్లడించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (2015-16, జూలై-సెప్టెంబర్) భారత్ 7.4 శాతం ఆర్థికాభివృద్ధిని నమోదుచేసుకుంది. తయారీ, మైనింగ్, సేవా రంగాల చక్కని పనితీరు... మొత్తం ఫలితం పటిష్టతకు కారణమైంది.
జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 7 శాతం. కాగా గడచిన కొన్ని నెలల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో (బ్యాంకులు తాము ఆర్‌బీఐ నుంచి తీసుకునే స్వల్పకాలిక రుణాలపై చెల్లించే వడ్డీ రేటు) రేటు కోత కూడా తాజా ఫలితానికి కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. డిసెంబర్ 1వ తేదీన ఆర్‌బీఐ ఐదవ ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్ష నేపథ్యంలో తాజా గణాంకాలు వెలువడ్డాయి. కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్‌ఓ) తాజాగా విడుదల చేసిన గణాంకాలకు సంబంధించి ముఖ్యాంశాలు..
2014-15 క్యూ 2తో పోల్చితే ప్రస్తుత రేటు తక్కువే. గత సంవత్సరం ఇదే కాలంలో వృద్ధి రేటు 8.4 శాతంగా నమోదయ్యింది.
కాగా ఈ ఏడాది ఇదే కాలంలో చైనా వృద్ధి రేటు 6.9 శాతం. దీనితో ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ కొనసాగుతున్నట్లయ్యింది. ఇదే కాలంలో వర్థమాన దేశాల్లో కీలకమైన రష్యాలో అసలు వృద్ధి లేకపోగా -4.1 క్షీణత నమోదయ్యింది. బ్రెజిల్ సైతం -4.2 శాతం క్షీణతలో ఉంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో వృద్ధి రేటు 7.2 శాతంగా ఉంటే... గత ఏడాది ఇదే కాలంలో ఈ వృద్ధిరేటు 7.5 శాతం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 8.1 శాతం నుంచి 8.5 శాతం వరకూ వృద్ధి నమోదవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తున్నప్పటికీ, ఇప్పటికి గడిచిన రెండు త్రైమాసికాల్లో ఈ రేటు లక్ష్యానికి భారీ దూరంలో ఉన్న సంగతి గమనార్హం.
తాజా గణాంకాల ప్రకారం 7 శాతానికి పైగా వృద్ధిని నమోదుచేసుకున్న రంగాల్లో తయారీ, వాణిజ్యం, హోటల్స్, ట్రాన్స్‌పోర్ట్, కమ్యూనికేషన్ ఉన్నాయి. బ్రాడ్‌కాస్టింగ్, ఫైనాన్స్, బీమా, రియల్టీ, వృత్తిపరమైన సేవా రంగాలూ 7 శాతం పైగా వృద్ధిని సాధించాయి.
తయారీ రంగం సెప్టెంబర్ క్వార్టర్‌లో భారీగా 9.3 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. గత ఏడాది ఇదే కాలంలో ఈ రంగం వృద్ధి రేటు 7.9 శాతమే.
మైనింగ్, క్వారీయింగ్ రంగాల వృద్ధి రేటు 1.4 శాతం నుంచి 3.2 శాతానికి ఎగసింది.
ట్రేడ్, హోటల్, ట్రాన్స్‌పోర్ట్, కమ్యూనికేషన్లతో సహా మొత్తం సేవా రంగాల వృద్ధి రేటు 8.9 శాతం నుంచి 10.6 శాతానికి ఎగసింది.
కాగా ఫైనాన్షియల్, రియల్టీ, ప్రొఫెషనల్ సర్వీసుల్లో వృద్ధి మాత్రం 13.5 శాతం నుంచి 9.7 శాతానికి తగ్గింది.
విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా ఇతర యుటిలిటీ సేవల్లో వృద్ధి రేటు కూడా 8.7 శాతం నుంచి 6.7 శాతానికి తగ్గింది.
వ్యవసాయం, అనుసంధాన రంగాల్లో వృద్ధి రేటు స్వల్పంగా 2.1 శాతం నుంచి 2.2 శాతానికి పెరిగింది.
నిర్మాణ రంగంలో వృద్ధిరేటు 8.7 శాతం నుంచి 2.6 శాతానికి పడింది.
2011-12 స్ధిర ధరల ప్రకారం... జీడీపీ విలువ రెండవ త్రైమాసికంలో రూ.27.57 లక్షల కోట్లుగా నమైదైంది. గత ఏడాది ఇదే కాలంలో ఈ విలువ 25.66 లక్షల కోట్లు. అంటే జీడీపీ వృద్ధి రేటు 7.4 శాతమన్నమాట.
మరింత మెరుగవుతుంది..
గత ఆర్థిక సంవత్సరం సాధించిన 7.3% వృద్ధిరేటుకన్నా... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మంచి వృద్ధి నమోదవుతుంది. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నా... తయారీ రంగం మంచి ఫలితాన్ని ఇవ్వడం గమనార్హం. మొత్తంగా ఈ గణాంకాలు సంతృప్తిని ఇస్తున్నాయి. మున్ముందు మరింత వృద్ధి ఖాయం.
- అరుణ్ జైట్లీ, ఆర్థిక మంత్రి
సానుకూల ధోరణి...
దేశ ఆర్థిక రంగానికి సంబంధించి సానుకూల ధోరణి పటిష్టతకు తాజా గణాంకాలు దోహదపడుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి 7.5%గా నమోదవుతుందన్నది అభిప్రాయం. ఆర్థిక వ్యవస్థ ఊపందుకున్నదని సంకేతాలు అందుతున్నాయి. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం వృద్ధికి మరింత ఊపునిస్తుంది.
- శక్తికాంత దాస్, ఆర్థిక శాఖ కార్యదర్శి
వేగవంతమైన రికవరీ...
ఆర్థిక వ్యవస్థలో రికవరీ వేగవంతమైందనడానికి తాజా గణాంకాలు నిదర్శనం. ఈ తరహా ధోరణి మేము ఊహించిందే. అయితే నిర్మాణ రంగంలో వృద్ధి రేటు భారీగా పడిపోవడం ఆందోళనకరం. తయారీ, రియల్టీ, మౌలిక రంగాల్లో నిలిచిపోయిన ప్రాజెక్టుల పునరుద్ధరణపై తక్షణం విధానపరమైన దృష్టి పెట్టాలి.
- చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డెరైక్టర్ జనరల్