రైల్వే, తయారీలో అపార అవకాశాలు
పెట్టుబడులు పెట్టాలంటూ...
ఆస్ట్రేలియా ఇన్వెస్టర్లకు ఆర్థిక మంత్రి జైట్లీ పిలుపు
సిడ్ని: భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని, భారత వృద్ధిలో భాగం కావాలని ఆస్ట్రేలియా వ్యాపార వేత్తలను భారత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కోరారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) నిబంధనలను సరళీకరించడంతో ఇప్పుడు రైల్వేలు, రక్షణ, తయారీ రంగాల్లో అపార అవకాశాలున్నాయని పేర్కొన్నారు. చౌక ధరల్లో సేవలందించ గలిగే దేశంగా నిలిచిన భారత్, చౌక ధరల్లో వస్తువుల తయారీ దేశంగా నిలవడంతో విఫలమైందని వివరించారు. ఇక్కడ మేక్ ఇన్ ఇండియా సదస్సును ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి జూలీ బిషప్‌తో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలోనూ ఆయన పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మందగమనం ఉన్నప్పటికీ, అత్యంత వేగంగా వృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా రెండేళ్లు నిలిచామని తెలిపారు.
కాగా భారత్‌కు అందించే నవకల్పన, పరిశోధన అభివృద్ధి, వృత్తిగత శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, తదితర సేవల్లో కీలకపాత్ర పోషిస్తామని బిషప్ పేర్కొన్నారు. జైట్లీతో ఈ ద్వైపాక్షిక సమావేశం సంతృప్తికరంగా సాగిందని వివరించారు. ఆస్ట్రేలియా సావరిన్ వెల్త్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్‌ను భారత్‌లో ఇన్వెస్ట్ చేయాల్సిందిగా అరుణ్ జైట్లీ ఆహ్వానించారు. ఆస్ట్రేలియా ఆర్థిక మంత్రి స్కాట్ మోరిసన్‌తో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ఫ్యూచర్ ఫండ్, సూపర్ ఫండ్‌లను భారత్‌లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆయన కోరారు. మంచి రాబడులు వస్తాయని పేర్కొన్నారు.