ఇన్ఫీ మూర్తివి తప్పుడు ఆరోపణలు
కంపెనీ మాజీ చైర్మన్ శేషసాయి
న్యూఢిల్లీ: ఇన్ఫీ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఆరోపణలపై మాజీ చైర్మన్ ఆర్ శేషసాయి ఎదురుదాడికి దిగారు. మూర్తి తనపై ‘వ్యక్తిగత దాడులకు’ దిగుతున్నారని, ‘తప్పుడు ఆరోపణలు చేస్తూ.. అభాండాలు వేస్తున్నారని‘ వ్యాఖ్యానించారు. అదే పనిగా కక్ష సాధింపు చర్యలను కొనసాగించడం వెనుక కారణాలేమిటో తనకు అర్థం కావడం లేదంటూ పేర్కొన్నారు. ‘నేను ఇన్ఫీ బోర్డు నుంచి వైదొలిగిన రోజు నుంచీ అనేక కవ్వింపు చర్యలు ఉంటున్నప్పటికీ.. బహిరంగంగా ఎలాంటి ప్రతికూల ప్రకటనలూ చేయలేదు. గత వివాదాలతో సతమతం కాకుండా కంపెనీ ముందుకెళ్లాలని నిజాయితీగా నేను ఆకాంక్షిస్తుండటమే ఇందుకు కారణం’ అని శేషసాయి చెప్పారు.
ఇటీవలి ఇన్వెస్టర్ల సమావేశంలో మూర్తి తనపై వ్యక్తిగతంగా తప్పుడు అభియోగాలు మోపడం వల్లే తాను తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ప్రకటన చేయాల్సి వచ్చిందని ఆయన వివరణ ఇచ్చారు. తాను మూర్తి ఆహ్వానం మేరకే ఇన్ఫీలో చేరానని, నైతికతకు నిలువెత్తు నిదర్శనం అంటూ కొద్ది నెలల క్రితమే కితాబిచ్చిన నారాయణ మూర్తి.. అంతలోనే తనపై కక్ష సాధింపు చర్యలకు దిగడం వెనుక కారణాలేంటో అర్థం కావడం లేదన్నారు.
గవర్నెన్స్‌పై వాటాదారులతో చర్చలు: ఇన్ఫీ
వ్యవస్థాపకులు, బోర్డు సభ్యుల మధ్య విభేదాలతో వివాదాల్లో చిక్కుకున్న ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్.. మళ్లీ కార్యకలాపాలను గాడిన పెట్టడంపై దృష్టి సారిస్తోంది. సంస్థలో పాలనాపరమైన ప్రమాణాలు అత్యుత్తమ స్థాయిలో పాటించే దిశగా తీసుకోతగిన చర్యలపై షేర్‌హోల్డర్లతో సంప్రతింపులు జరుపుతున్నట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు ఇన్ఫోసిస్ తెలిపింది.