మైక్రోసాఫ్ట్ నుంచి ఆఫీస్ 2016
న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తాజాగా ఆఫీస్ 365 సాఫ్ట్‌వేర్ ప్యాకేజికి లేటెస్ట్ వెర్షన్ ఆఫీస్ 2016ని ప్రవేశపెట్టింది. వ్యాపార సంస్థలకు ఇది స్టాండర్డ్, ప్రొఫెషనల్ ప్లస్ ఫార్మాట్లలో లభిస్తుంది. ధర రూ. 24,844-రూ. 33,911గా ఉంటుందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. మధ్య స్థాయి ప్యాకేజీ విద్యార్థుల కోసం పర్‌పెచ్యువల్ ప్యాకేజీ ధర రూ. 5,999, బిజినెస్ ఎడిషన్ రేటు రూ. 18,499గా ఉంటుందని పేర్కొంది. ఆఫీస్ 365ని ఇప్పటికే ఉపయోగిస్తున్న యూజర్లకు కొత్త ఆఫీస్ 2016 యాప్స్‌ను ఉచితంగా అందిస్తున్నామని మైక్రోసాఫ్ట్ ఆఫీస్ డివిజన్ (ఇండియా) డెరైక్టర్ అలోక్ లాల్ తెలిపారు. 1 టెరా బైట్ వన్ డ్రైవ్ క్లౌడ్ స్టోరేజితో ఆఫీస్ 2016 లభిస్తుందని వివరించారు. విరివిగా వినియోగంలో ఉన్న వర్డ్, పవర్‌పాయింట్, ఎక్సెల్, అవుట్‌లుక్, యాక్సెస్ వంటి ప్రోగ్రామ్‌లు ఆఫీస్ 2016 యాప్స్‌లో ఉంటాయి. క్లౌడ్ ఆధారిత ఆఫీస్ 365 సబ్‌స్క్రిప్షన్ ఫీజు వార్షికంగా రూ. 3,299 (ఒక్క యూజరు) నుంచి రూ. 33,911 (ప్రొఫెషనల్ ప్లస్) దాకా ఉంటుంది.