
నెక్స్ట్ డిజిటల్ నుంచి 500 చానళ్లు
- డిసెంబర్‌కల్లా 25 హెచ్‌డీ చానళ్లు కూడా
- ప్రాజెక్టుకు రూ.630 కోట్ల పెట్టుబడి
- గ్రాంట్ ఇన్వెస్ట్రేడ్ ఎండీ టోనీ డిసిల్వా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హిందూజా గ్రూప్‌నకు చెందిన గ్రాంట్ ఇన్వెస్ట్రేడ్ రెండు మూడు వారాల్లో నెక్స్ట్ డిజిటల్ సేవలను ప్రారంభించనుంది. భారత్‌లో తొలిసారిగా ఖమ్మంలో నెక్స్ట్ డిజిటల్ ప్రసారాలు మొదలవుతాయని సమాచారం. ముందుగా 300 చానళ్లతో సర్వీసులు ఆరంభం కానున్నాయి. డిసెంబర్‌కల్లా వీటి సంఖ్యను 500లకు చేర్చనుంది.
వీటిలో 25 హెచ్‌డీ చానళ్లు కూడా ఉంటాయని గ్రాంట్ ఇన్వెస్ట్రేడ్ ఎండీ టోనీ డిసిల్వా మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. ఎస్‌డీ సెట్‌టాప్ బాక్స్ ధర రూ.1,400, హెచ్‌డీ అయితే రూ. 1,800లకే ఆఫర్ చేస్తున్నట్టు చెప్పారు. ‘ఇప్పటికే మల్టీ సిస్టమ్ ఆపరేటర్లతో (ఎంఎస్‌వో) చేతులు క లిపాం. వీరి చేతుల్లో 10 లక్షలకుపైగా కస్టమర్లు ఉన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 30 లక్షల మంది కస్టమర్లను చేరుకోవాలని లక్ష్యంగా చేసుకున్నాం’ అని తెలిపారు. గ్రాంట్ ఇన్వెస్ట్రేడ్ గతేడాది హెడెండ్ ఇన్ ద స్కై (హిట్స్) లెసైన్స్‌ను పొందింది. కేబుల్ ఆపరేటర్‌కు శాటిలైట్ ద్వారా నేరుగా ప్రసారాలు అందడమే హిట్స్ ప్రత్యేకత.
భారీ పెట్టుబడితో..
హిట్స్ ప్రాజెక్టుకు సంస్థ ఇప్పటికే రూ.500 కోట్లు ఖర్చు చేసింది. ఈ ఏడాది మరో రూ.130 కోట్లు వ్యయం చేస్తామని టోనీ డిసిల్వా వెల్లడించారు. ‘డిజిటల్ అడ్రసబుల్ సిస్టమ్స్(డీఏఎస్) అమలులో భాగ ంగా మూడో దశలో 5 కోట్ల కేబుల్, శాటిలైట్ టీవీ గృహాలు, నాల్గవ దశలో 5 కోట్ల గృహాలు డిజిటల్ ప్రసారాలు అందుకోవాల్సిందే. కేబుల్ హెడెండ్‌కు రూ.1 కోటిపైగా వ్యయం అవుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న 6,000 మంది ఎంఎస్‌వోల్లో 10 శాతం మందికి మాత్రమే డీఏఎస్ లెసైన్సు ఉంది. లెసైన్సు లేనివారు తక్కువ ఖర్చుతో డిజిటల్ ప్రసారాలు అందించేందుకు హిట్స్ తోడ్పడుతుంది’ అని చెప్పారు. 500 చానెళ్ల వ్యవస్థకు ఎంఎస్‌వోకు సుమారు రూ.14 లక్షల వ్యయం అవుతుంది. డీఏఎస్, ఎస్‌ఎంఎస్, కాల్ సెంటర్ సర్వీసు ఇచ్చినందుకుగాను కంపెనీకి ఒక్కో కస్టమర్‌కుగాను ఎంఎస్‌వో నెలకు రూ.20 చెల్లించాలి.