
న్యూఢిల్లీ: విద్యుత్ వాహనాల తయారీ, వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఫేమ్–2 పథకం అమలును పర్యవేక్షించడం కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా అంతర్–మంత్రిత్వ శాఖల కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి భారీ పరిశ్రమల శాఖ కార్యదర్శి చైర్మన్‌గా ఉంటారు. నీతి ఆయోగ్ సీఈవో, పారిశ్రామిక ప్రోత్సాహం.. అంతర్గత వాణిజ్య వ్యవహారాల విభాగం కార్యదర్శి, ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శితో పాటు విద్యుత్.. పునరుత్పాదక ఇంధనాల శాఖ కార్యదర్శి తదితరులు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఏ వాహనానికి గరిష్టంగా ఎంత మేర ప్రోత్సాహకం ఇవ్వాలి, వివిధ విభాగాలకు నిధుల కేటాయింపులు ఎలా ఉండాలి తదితర అంశాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. సుమారు రూ. 10,000 కోట్లతో ప్రకటించిన ఫేమ్ ఇండియా రెండో విడత కార్యక్రమం ఏప్రిల్ 1 నుంచి మూడేళ్ల పాటు అమలవుతుంది. ఈ స్కీము కింద 2019–20లో రూ. 1,500 కోట్లు, 2020–21లో రూ. 5,000 కోట్లు, 2021–22లో 3,500 కోట్లు వ్యయం చేయనున్నారు. విద్యుత్ బస్సులు, ఎలక్ట్రిక్, హైబ్రీడ్ కార్లు, ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాలు, విద్యుత్ ద్విచక్ర వాహనాల కొనుగోలుదారులకు దీనికింద ప్రోత్సాహకం లభిస్తుంది.
ఈ స్కీము ప్రకారం 10 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు దాదాపు రూ. 20,000 దాకా సబ్సిడీ లభిస్తుంది. అలాగే రూ. 5 లక్షల దాకా ధర ఉండే (ఎక్స్–ఫ్యాక్టరీ రేటు) 5 లక్షల ఎలక్ట్రిక్ రిక్షాలకు దాదాపు రూ. 50,000 దాకా ప్రోత్సాహకం ఉంటుంది. రూ. 15 లక్షల దాకా ఖరీదు చేసే 35,000 పైచిలుకు విద్యుత్ కార్లకు రూ. 1.5 లక్షల దాకా ప్రోత్సాహకం ఉంటుంది. రూ. 2 కోట్ల దాకా ఖరీదు చేసే 7,090 ఎలక్ట్రిక్ బస్సులకు రూ. 50 లక్షల దాకా ప్రోత్సాహకం లభిస్తుంది. మరోవైపు దేశవ్యాప్తంగా 2,700 చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కూడా ఈ పథకం కింద తోడ్పాటు లభించనుంది.
Comments
Please login to add a commentAdd a comment