ఓఎన్‌జీసీ, ఆర్‌ఐఎల్ వివాదంలో ఆర్బిట్రేటర్ నియామకం
న్యూఢిల్లీ: గ్యాస్ వెలికితీతపై ఓఎన్‌జీసీ–రిలయన్స్ ఇండస్ట్రీస్ మధ్య నెలకొన్న వివాద పరిష్కార ఆర్బిట్రేషన్‌కు సంబంధించి ప్రభుత్వం తమ తరఫు ఆర్బిట్రేటర్‌గా మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జీఎస్ సింఘ్వీ పేరును ప్రతిపాదించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్), దాని భాగస్వామ్య సంస్థలు బీపీ, నికో రిసోర్సెస్ ఇప్పటికే తమ తరఫు ఆర్బిట్రేటర్‌గా బ్రిటన్ హైకోర్టు జడ్జి బెర్నార్డ్ ఎడర్ పేరు ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.
త్రిసభ్య ప్యానెల్‌లో సభ్యులైన ఈ ఇద్దరు ఇక.. ప్రిసైడింగ్ జడ్జి ఎంపికపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కేజీ–డీ6 బ్లాక్ ఆపరేటర్ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్.. పొరుగునే ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్‌జీసీ క్షేత్రం నుంచి ఏడేళ్లుగా దాదాపు 338.332 మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ల గ్యాస్ (ఎంబీటీయూ) వెలికితీసిందంటూ నవంబర్ 3న చమురు శాఖ ఆర్‌ఐఎల్‌కు నోటీసులు ఇచ్చింది. ఈ గ్యాస్‌కు సంబంధించి మొత్తం 1.55 బిలియన్ డాలర్లు కట్టాలంటూ ఆదేశించింది.
వాస్తవానికి ఆర్‌ఐఎల్‌పై ఓఎన్‌జీసీ స్వయంగా దావా వేసినప్పటికీ .. సహజ వనరులపై యాజమాన్య హక్కులు ప్రభుత్వానికే ఉంటాయి గనుక పరిహారం కేంద్రానికే చెందాలంటూ మాజీ జస్టిస్ ఏపీ షా కమిటీ సూచించింది. ఈ నేపథ్యంలోనే చమురు శాఖ ఆర్‌ఐఎల్‌కు నోటీసులిచ్చింది.