గాయత్రి రోడ్డు ప్రాజెక్టుల వ్యాపారం డీలిస్టింగ్..!
ప్రత్యేక కంపెనీగా విడగొట్టే యోచన
* రోడ్డు ప్రాజెక్టు కంపెనీ విలువ రూ. 7,500 కోట్లుగా అంచనా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గాయత్రి ప్రాజెక్ట్స్ కంపెనీ బీవోటీ రోడ్డు అసెట్ ప్రాజెక్టులను విక్రయించాలని నిర్ణయించింది. ఇందుకోసం గాయత్రి ప్రాజెక్ట్స్ నుంచి రోడ్డు అసెట్ వ్యాపారాన్ని ప్రత్యేకంగా విడదీసి, దీన్ని స్టాక్ ఎక్స్ఛేంజీల నుంచి డీ-లిస్ట్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. స్టాక్ మార్కెట్లో నమోదై ఉంటే ఈ ప్రాజెక్టులను విక్రయించడం కష్టంగా ఉన్నందున, ఈ రోడ్డు అసెట్ ప్రాజెక్టుల వ్యాపారాన్ని స్టాక్ మార్కెట్ నుంచి విడదీసి విక్రయించే ఆలోచనలో ఉంది. కార్పొరేట్ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా రోడ్ అసెట్ వ్యాపారాన్ని ప్రత్యేక కంపెనీగా విడదీసే ఆలోచనలో ఉన్నట్లు గాయత్రి ప్రాజెక్ట్స్ సోమవారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియచేసింది.
ప్రస్తుతం గాయత్రి ప్రాజెక్టు చేతిలో మొత్తం ఎనిమిది రోడ్ అసెట్ ప్రాజెక్టులు ఉండగా, అందులో ఒకటి నిర్మాణంలో ఉంది. ఈ ఎనిమిది ప్రాజెక్టుల (నాలుగు యాన్యుటీ, మూడు టోల్ ప్రాజెక్టులు) విలువ రూ. 7,500 కోట్లుగా ఉంటుందని కంపెనీ ప్రాథమికంగా అంచనా వేసింది. ఈ ఎనిమిది ప్రాజెక్టులకు సుమారు రూ. 4,500 కోట్ల రుణ భారం ఉంది. పేరెంట్ కంపెనీ నుంచి ఎటువంటి ఆర్థిక సహకారం లేకుండానే ఇవి పనిచేస్తున్నా... వీటిని విక్రయించడం ద్వారా రుణ భారం వదలించుకోవాలని కంపెనీ ఆలోచనగా ఉంది.
ఇందులో భాగంగా ఇప్పటికే ఎన్‌సీసీ భాగస్వామ్యంతో చేపట్టిన వెస్ట్రన్ యూపీ టోల్‌వే లిమిటెడ్‌ను విక్రయం దాదాపు పూర్తయింది. రూ. 750 కోట్లతో పూర్తి చేసిన ఈ ప్రాజెక్టు విక్రయానికి సంబంధించి త్వరలో అధికారికంగా ప్రకటన వెలువడనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ప్రాజెక్టు విక్రయం ద్వారా గాయత్రీ ప్రాజెక్ట్స్‌కు రూ. 90 కోట్ల రుణ భారం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. కంపెనీ పునర్ వ్యవస్థీకరణ గురించి త్వరలోనే బోర్డ్ ఆఫ్ డెరైక్టర్లతో సమావేశమై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
గాయత్రి ప్రాజెక్ట్స్ షేరు ధర సోమవారం ఒక శాతం నష్టపోయి
రూ. 730 వద్ద ముగిసింది.