gayatri projects
-
బాహుబలులన్నీ సిద్ధం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులోని గాయత్రి (ప్యాకేజీ–8) పంప్‌హౌస్‌లోని బాహుబలి మోటార్ల న్నింటికీ పరీక్షలు పూర్తయ్యాయి. నిర్ణీత రెండు టీఎంసీల మేర గోదావరి నీటిని ఎత్తిపోసేందుకు వీలుగా గాయత్రి పంపింగ్ కేంద్రం సిద్ధమైంది. అతితక్కువ సమయం లో పంపింగ్ కేంద్రాన్ని నిర్మించ డంతో మేఘా ఇంజనీరింగ్ సంస్థ కొత్త రికార్డు సృష్టించింది. ఎల్లంపల్లి దిగువన ఉన్న నందిమేడారం పంప్‌హౌస్ పరిధిలో 124.5 మెగావాట్ల విద్యుత్‌తో నడిచే మోటార్లను ఏర్పాటు చేస్తుండగా, దాని దిగువన గాయత్రి పంప్‌హౌస్‌లో మోటార్ల సామర్థ్యం మరో 15 మెగావాట్ల మేర ఎక్కువగా అంటే 139 మెగావాట్ల సామర్థ్యం ఉండే పంపులను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ మొత్తంగా 7 మోటార్లను ఏర్పాటు చేసి రోజుకు 2 టీఎంసీల నీటిని తరలించాల్సి ఉంది. ఒక్కో మోటారు 15 మీటర్ల ఎత్తు అంటే 4 అంతస్తులు ఉంటుంది. వ్యాసం 22 మీటర్లు, బరువు 650 టన్నులుగా ఉంది. ఈ మోటార్లు 115 మీటర్ల లోతు నుంచి 3,200 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో నీటిని ఎత్తిపోస్తుంది. ఈ పంప్‌హౌస్‌లో మొదటి పంప్‌హౌస్‌కు ఈ ఏడాది ఆగస్టు 11న మొదటి మోటార్‌ను ప్రారంభిం చగా, అదేనెల 14న రెండు, 20న మూడు, 31న నాలుగు, సెప్టెంబర్ 18న ఐదు, అక్టోబర్ 19న ఆరు మోటార్లను ప్రారంభించారు. శనివారం మిగిలిన ఏడో మోటార్‌ను ఈఎన్ సీ నల్లా వెంకటేశ్వర్లు, ఎత్తిపోతల పథ కాల సలహాదారు పెంటారెడ్డి, ఎస్ఈ సుధాకర్‌రెడ్డి, ఈఈ నూనె శ్రీధర్ల ఆధ్వర్యంలో ప్రారంభించారు. మోటార్ దిగ్విజయంగా నడవడంతో ఇక్కడ నూటికి నూరు శాతం మోటార్లన్నీ సిద్ధమైనట్లయింది. నెలాఖరుకు పూర్తి స్థాయిలో.. ఇక ఇప్పటికే లక్ష్మి (మేడిగడ్డ), సరస్వతి(అన్నారం)లలో మోటార్లు వెట్రన్లు పూర్తి చేసుకుని రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు సిద్ధంగా ఉన్నాయి. వీటన్నింటినీ మేఘా ఇంజనీరింగ్ సంస్థే పూర్తి చేసింది. ఇక సుందిళ్ల (పార్వతి)లో తొమ్మిది మోటార్లలో ఎనిమిది మాత్రమే సిద్ధమయ్యాయి. దీన్ని ఈ నెలాఖరుకు పూర్తి చేయనున్నారు. ఇక ప్యాకేజీ–6లో మరో మోటార్‌కు వెట్‌రన్ నిర్వహించాల్సి ఉండగా, దానికి నెలాఖరున పూర్తి చేయనున్నారు. ఇవన్నీ పూర్తయితే తొలిదశలో కాళేశ్వరం ఎత్తిపోతలు పూర్తిస్థాయిలో సిద్ధమైనట్లే. -
ఐవీఆర్‌సీఎల్‌కు పెరిగిన నష్టాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జూన్ త్రైమాసికం స్టాండలోన్ ఫలితాల్లో ఐవీఆర్సీఎల్ నష్టాలు క్రితంతో పోలిస్తే రూ.153 కోట్ల నుంచి రూ.245 కోట్లకు చేరాయి. టర్నోవరు రూ.452 కోట్ల నుంచి రూ.522 కోట్లకు పెరిగింది. మూడు రెట్లు పెరిగిన గాయత్రి లాభం.. గాయత్రి ప్రాజెక్ట్స్ స్టాండలోన్ ఫలితాల్లో నికరలాభం క్రితంతో పోలిస్తే సుమారు మూడు రెట్లు అధికమై రూ.45 కోట్లు నమోదు చేసింది. టర్నోవరు రూ.440 కోట్ల నుంచి రూ.660 కోట్లకు చేరింది. గాయత్రి షుగర్స్‌కు నష్టం.. జూన్ క్వార్టరులో గాయత్రి షుగర్స్‌కు రూ.9 కోట్ల నష్టం వాటిల్లింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.15 కోట్ల నికరలాభం ఆర్జించింది. టర్నోవరు రూ.132 కోట్ల నుంచి రూ.15 కోట్లకు పడింది. ఎన్సీఎల్ లాభం రూ.16 కోట్లు.. జూన్ క్వార్టరు స్టాండలోన్ ఫలితాల్లో ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ నికరలాభం రూ.9 కోట్ల నుంచి రూ.16 కోట్లకు ఎగిసింది. టర్నోవరు రూ.192 కోట్ల నుంచి రూ.227 కోట్లకు చేరింది. సువెన్‌లైఫ్ లాభం రూ.29 కోట్లు.. త్రైమాసికం స్టాండలోన్ ఫలితాల్లో సువెన్‌లైఫ్ నికరలాభం క్రితంతో పోలిస్తే సుమారు 9% తగ్గి రూ.29 కోట్లు నమోదు చేసింది. టర్నోవరు రూ.137 కోట్ల నుంచి రూ.146 కోట్లకు చేరింది. స్వల్పంగా తగ్గిన గ్రాన్యూల్స్ లాభం.. గ్రాన్యూల్స్ ఇండియా జూన్ క్వార్టరు కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికరలాభం క్రితంతో పోలిస్తే రూ.40 కోట్ల నుంచి రూ.37 కోట్లకు చేరింది. టర్నోవరు రూ.353 కోట్ల నుంచి రూ.386 కోట్లకు ఎగిసింది. రూ.1 విలువ కలిగిన ఒక్కో షేరుపై 25 పైసల తొలి మధ్యంతర డివిడెండు చెల్లించాలని నిర్ణయించింది. 30 శాతం పెరిగిన పెన్నార్ లాభం.. జూన్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో పెన్నార్ ఇండస్ట్రీస్ నికరలాభం క్రితంతో పోలిస్తే 30 శాతం పెరిగి రూ.13 కోట్లు నమోదు చేసింది. టర్నోవరు రూ.338 కోట్ల నుంచి రూ.460 కోట్లకు చేరింది. -
రూ.926 కోట్ల కాంట్రాక్టు 'గాయత్రీ' సొంతం
న్యూఢిల్లీః లీడింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సంస్థ గాయత్రీ ప్రాజెక్ట్స్ బీహార్ కు చెందిన ఓ భారీ కాంట్రాక్టును సొంతం చేసుకుంది. బీహార్ లోని ఎన్ హెచ్82 రహదారి విస్తరణ పనులకు సంబంధించిన మొత్తం 926 కోట్ల రూపాయలు విలువచేసే కాంట్రాక్టును తమ సంస్థ చేజిక్కించుకున్నట్లు కంపెనీ బీఎస్ ఈ రెగ్యులేటరీ ఫైలింగ్ లో పేర్కొంది. హైదరాబాద్ కు చెందిన గాయత్రీ ప్రాజెక్ట్స్ కు బీహార్ రాష్ట్రం నుంచి 926 కోట్ల రూపాయల వ్యయం చేసే పనులకు సంబంధించిన ఆర్డర్ లభించింది. బీహార్ లోని గయ, హిస్వా, రాజ్‌ఘర్, నలంద, బిహార్షరీఫ్ సెక్షన్లకు చెందిన ఎన్ హెచ్ 82 కు సంబంధించిన నాలుగు లేన్ల రోడ్డు విస్తరణ కాంట్రాక్టును బీహార్ స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీఎస్టీడీసీ), మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్స్ అండ్ హైవేస్ ద్వారా పొందినట్లు సంస్థ ప్రకటించింది. ప్రముఖ జపనీస్ సహకార ఏజెన్సీ (జైకా) సహాయ నిధులతో ప్రాజెక్టును చేపట్టనున్నట్లు గ్రాయత్రీ తెలిపింది. -
గాయత్రి ప్రాజెక్ట్స్‌కు రూ. 306 కోట్ల కాంట్రాక్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ సంస్థ గాయత్రి ప్రాజెక్ట్స్ రూ. 306 కోట్ల విలువ చేసే ప్రాజెక్టును దక్కించుకుంది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దుల్లోని నాలగంపల్లి గ్రామం ప్రాంతంలో జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా వేయాల్సి ఉంటుందని సంస్థ తెలిపింది. ఈపీసీ (ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్) ప్రాతిపదికన ఈ ప్రాజెక్టును దక్కించుకున్నట్లు తెలియజేసింది. -
గాయత్రి ప్రాజెక్ట్స్ లాభం రూ. 28 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో గాయత్రి ప్రాజెక్ట్స్ నికర లాభం దాదాపు 75 శాతం వృద్ధితో సుమారు రూ. 16 కోట్ల నుంచి రూ. 28 కోట్లకు (స్టాండెలోన్) పెరిగింది. ఆదాయం రూ. 560 కోట్ల నుంచి రూ. 668 కోట్లకు చేరింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ. 1,601 కోట్ల నుంచి రూ. 1,812 కోట్లకు, లాభం రూ. 22 కోట్ల నుంచి రూ. 59 కోట్లకు పెరిగింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను షేరు ఒక్కింటిపై రూ. 2 (20శాతం) డివిడెండును కంపెనీ ప్రకటించింది. -
గాయత్రి ప్రాజెక్ట్స్ కు రైల్వే కాంట్రాక్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారీ అవకాశాలున్న రైల్వే లైన్ల నిర్మాణ రంగంపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు గాయత్రి ప్రాజెక్ట్స్ ప్రకటించింది. ఇందులో భాగంగా ఎల్అండ్టీ, సోజిజ్ కార్పొరేషన్ భాగస్వామ్యంతో కలిసి రూ. 4,744 కోట్ల భారీ రైల్వే ఈపీసీ కాంట్రాక్టును దక్కించుకున్నట్లు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియ చేసింది. ఇక్బాల్‌ఘర్- వడోదర మధ్య నిర్మిస్తున్న వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (డీఎఫ్సీసీ) ప్రాజెక్టుకు సంబంధించి డిజైనింగ్, సివిల్ బిల్డింగ్స్, వంతెనలు, రైల్వే ట్రాక్ నిర్మాంచాల్సి ఉంది. కేవలం సరుకు రవాణా కోసం ముంబై - ఢిల్లీ మధ్య 1,483 కి.మీ మధ్య ప్రత్యేక రైల్వే లైన్ నిర్మిస్తుండగా, అందులో 304 కి.మీ కాంట్రాక్టును గాయత్రి కన్సార్షియం దక్కించుకుంది. -
వెస్ట్రన్ యూపీ ప్రాజెక్ట్ విక్రయించిన గాయత్రి ప్రాజెక్ట్స్
ప్రాజెక్టు విలువ 575 కోట్లుగా అంచనా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్సై యూపీ టోల్‌వే లిమిటెడ్ (డబ్ల్యూయూపీటీఎల్)లో 100 శాతం వాటాను క్యూబ్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పీటీఈకి విక్రయించినట్లు గాయత్రి ప్రాజెక్ట్స్ ప్రకటించింది. డబ్ల్యూయూపీటీఎల్లో గాయత్రి ప్రాజెక్ట్స్‌కు 49 శాతం వాటా ఉండగా, ఎన్సీసీ 51 శాతం వాటాను కలిగి ఉంది. లావాదేవీలు పూర్తవడానికి రెండు నెలలు పడుతుందని అంచనా. రుణ భారం తగ్గించుకునే పనిలో భాగంగా డబ్ల్యూయూపీటీఎల్ను విక్రయించింది. రూ. 756 కోట్ల వ్యయంతో ఎన్‌హెచ్ 58లో నిర్మించిన 78 కి.మీ ఈ రోడ్ ప్రాజెక్ట్ 2011 నుంచి అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు విలువను రూ. 575 కోట్లుగా అంచనా. గతేడేది ఈ ప్రాజెక్టు వార్షిక ఆదాయం రూ. 108 కోట్లుగా నమోదయ్యింది. -
గాయత్రి రోడ్డు ప్రాజెక్టుల వ్యాపారం డీలిస్టింగ్..!
ప్రత్యేక కంపెనీగా విడగొట్టే యోచన * రోడ్డు ప్రాజెక్టు కంపెనీ విలువ రూ. 7,500 కోట్లుగా అంచనా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గాయత్రి ప్రాజెక్ట్స్ కంపెనీ బీవోటీ రోడ్డు అసెట్ ప్రాజెక్టులను విక్రయించాలని నిర్ణయించింది. ఇందుకోసం గాయత్రి ప్రాజెక్ట్స్ నుంచి రోడ్డు అసెట్ వ్యాపారాన్ని ప్రత్యేకంగా విడదీసి, దీన్ని స్టాక్ ఎక్స్ఛేంజీల నుంచి డీ-లిస్ట్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. స్టాక్ మార్కెట్లో నమోదై ఉంటే ఈ ప్రాజెక్టులను విక్రయించడం కష్టంగా ఉన్నందున, ఈ రోడ్డు అసెట్ ప్రాజెక్టుల వ్యాపారాన్ని స్టాక్ మార్కెట్ నుంచి విడదీసి విక్రయించే ఆలోచనలో ఉంది. కార్పొరేట్ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా రోడ్ అసెట్ వ్యాపారాన్ని ప్రత్యేక కంపెనీగా విడదీసే ఆలోచనలో ఉన్నట్లు గాయత్రి ప్రాజెక్ట్స్ సోమవారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియచేసింది. ప్రస్తుతం గాయత్రి ప్రాజెక్టు చేతిలో మొత్తం ఎనిమిది రోడ్ అసెట్ ప్రాజెక్టులు ఉండగా, అందులో ఒకటి నిర్మాణంలో ఉంది. ఈ ఎనిమిది ప్రాజెక్టుల (నాలుగు యాన్యుటీ, మూడు టోల్ ప్రాజెక్టులు) విలువ రూ. 7,500 కోట్లుగా ఉంటుందని కంపెనీ ప్రాథమికంగా అంచనా వేసింది. ఈ ఎనిమిది ప్రాజెక్టులకు సుమారు రూ. 4,500 కోట్ల రుణ భారం ఉంది. పేరెంట్ కంపెనీ నుంచి ఎటువంటి ఆర్థిక సహకారం లేకుండానే ఇవి పనిచేస్తున్నా... వీటిని విక్రయించడం ద్వారా రుణ భారం వదలించుకోవాలని కంపెనీ ఆలోచనగా ఉంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఎన్సీసీ భాగస్వామ్యంతో చేపట్టిన వెస్ట్రన్ యూపీ టోల్‌వే లిమిటెడ్‌ను విక్రయం దాదాపు పూర్తయింది. రూ. 750 కోట్లతో పూర్తి చేసిన ఈ ప్రాజెక్టు విక్రయానికి సంబంధించి త్వరలో అధికారికంగా ప్రకటన వెలువడనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ప్రాజెక్టు విక్రయం ద్వారా గాయత్రీ ప్రాజెక్ట్స్‌కు రూ. 90 కోట్ల రుణ భారం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. కంపెనీ పునర్ వ్యవస్థీకరణ గురించి త్వరలోనే బోర్డ్ ఆఫ్ డెరైక్టర్లతో సమావేశమై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు కంపెనీ ప్రకటించింది. గాయత్రి ప్రాజెక్ట్స్ షేరు ధర సోమవారం ఒక శాతం నష్టపోయి రూ. 730 వద్ద ముగిసింది. -
గాయత్రి ప్రాజె క్ట్స్‌కు భారీ ఆర్డరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గాయత్రి ప్రాజెక్ట్స్ రూ. 3,318 కోట్ల విలువైన కాంట్రాక్టును జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) నుంచి దక్కించుకుంది. జాతీయ రహదారులు 233, 56లకు సంబంధించి మొత్తం 4 కాంట్రాక్టులను పొందినట్లు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియచేసింది. ఈ వార్తల నేపథ్యంలో గాయత్రీ ప్రాజెక్ట్స్ షేరు సుమారు నాలుగు శాతం పెరిగి రూ. 428 వద్ద ముగిసింది. -
గాయత్రీకి రూ. 175 కోట్ల ఆర్డరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గాయత్రీ ప్రాజెక్ట్స్ రూ. 175 కోట్ల విలువైన ఆర్డరును దక్కించుకుంది. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ కార్పొరేషన్ నుంచి రింగ్‌రోడ్డు నిర్మాణ కాంట్రాక్టును పొందింది. ఇందులో భాగంగా షామీర్పేట్ నుంచి కీసర వరకు 10.3 కి.మీల ఎనిమిది లైన్ల రహదారిని నిర్మించాలి. -
అప్పుల బాధతో అమ్మేస్తున్న దేశీయ కంపెనీలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ విద్యుత్ ప్రాజెక్టులు ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని విదేశీ కంపెనీలు చక్కగా వినియోగించుకుంటున్నాయి. ఐదేళ్ల క్రితం భారీ అంచనాలతో ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేసి చేపట్టిన విద్యుత్ ప్రాజెక్టులు వివిధ కారణాలతో మధ్యలో ఆగిపోవడంతో దేశీయ కంపెనీలకు గుదిబండగా తయారయ్యాయి. తగినంత ఇంధన సరఫరా లేకపోవడం, పర్యావరణ అనుమతులు వంటి అనేక కారణాలతో పలు ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోయాయి. కొన్ని పూర్తయినా ఇంధన సరఫరా లేక పనిచేయడం లేదు. దీంతో అటు ఆదాయం లేక ఇటు చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక ఇన్ఫ్రా కంపెనీలు విద్యుత్ ప్రాజెక్టుల నుంచి వైదొలగడానికి ఎదురు చూస్తున్నాయి. ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంటూ ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్టులను విదేశీ సంస్థలు కొనుగోలు చేస్తున్నాయి. గత ఆరు నెలల్లోనే విదేశీ కంపెనీలు 5,391 మెగా వాట్ల విద్యుత్ సామర్థ్యాన్ని కైవసం చేసుకున్నాయి. ఇందుకోసం అవి వ్యయం చేసింది కేవలం రూ.13,000 కోట్లు మాత్రమే. ఇందులో రాష్ట్రానికి చెందిన విద్యుత్ ప్రాజెక్టులే అధికంగా ఉండటం విశేషం. ముఖ్యంగా నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో వున్న గాయత్రీ ప్రాజెక్ట్స్, నాగార్జునా కన్స్ట్రక్షన్స్, మీనాక్షి ఇన్ఫ్రా కంపెనీలకు చెందిన ప్రాజెక్టుల్లో మెజార్టీ వాటాలను విదేశీ కంపెనీలు చేజిక్కించుకున్నాయి. అదే బాటలో జీఎంఆర్.. తాజాగా జీఎంఆర్ గ్రూపు మహారాష్ట్ర వరోరాలో నిర్మిస్తున్న 600 మెగావాట్ల జీఎంఆర్ ఎమ్కో ఎనర్జీలో 30 నుంచి 40 శాతం వాటాను విక్రయించే యోచనలో ఉన్నట్లు మార్కెట్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. రూ.3,948 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో 40 శాతం వాటాను రూ.1,500 కోట్లకు పైనే విక్రయించాలని చూస్తోంది. ఫ్రాన్స్‌కి చెందిన జీడీఎఫ్ సూజ్ ఈ వాటాను కొనడానికి ఉత్సాహం చూపిస్తున్నట్లు తెలుస్తోంది. కాని ఈ వార్తలపై మాట్లాడటానికి కంపెనీ ప్రతినిధులు సిద్ధంగా లేరు. ఊహాగానాలపై తాము స్పందించలేమని పేర్కొన్నారు. ఆందోళనకర పరిణామమే... ఎంతో కీలకమైన విద్యుత్ ప్రాజెక్టులు ఇలా విదేశీ కంపెనీల చేతిలోకి వెళ్తుండటంపై ఆర్థిక వేత్తలు, కంపెనీ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తప్పనిపరిస్థితుల్లో తాము విద్యుత్ ప్రాజెక్టును విదేశీ కంపెనీకి విక్రయించాల్సి వచ్చిందని, కాని ఇదే పరిస్థితి కొనసాగితే మరో ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల్లోకి దేశీయ పరిశ్రమ వెళుతుందేమోనన్న భయాన్ని ఒక ఇన్ఫ్రా కంపెనీ ప్రతినిధి వ్యక్తం చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కేవలం విద్యుత్ ప్రాజెక్టులనే కాకుండా వాటికి సరఫరా చేసే బొగ్గు, గ్యాస్ ఇంధన సరఫరా ఒప్పందాలను కూడా అవి దొడ్డిదారిన చేజిక్కించుకుంటున్నాయని, ఇందుకోసం ప్రాజెక్టు మొదలు పెట్టిన ప్రారంభ కంపెనీలకు మైనార్టీ వాటాలను ఉంచుతున్నాయన్నారు. జీడీఎఫ్ సూజ్కి మన దేశ విద్యుత్ ఉత్పత్తిలో (2.12 లక్షల మెగావాట్లు) సగానికిపైగా అంటే 1,16,00 మెగావాట్ల సామర్థ్యం ప్రపంచవ్యాప్తంగా ఉందని, ఇలాంటి కంపెనీల చేతిలోకి మన విద్యుత్ రంగం వెళితే ఇవి మన ప్రభుత్వాల మాట వినే అవకాశం ఉండదని మరో కంపెనీ ప్రతినిధి వ్యాఖ్యానించారు. విదేశీ కంపెనీల చేతిలోకి విద్యుత్ వ్యవస్థ వెళితే అవన్నీ ఒక జట్టుగా ఏర్పడి విద్యుత్ టారిఫ్‌లను పెంచే ప్రమాదం ఉందని ఆర్థికరంగ నిపుణులు డి.పాపారావు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది రానున్న కాలంలో ఎదురయ్యే ప్రమాదాలకు సంకేతమని విద్యుత్ రంగ నిపుణులు కే.రఘు వ్యాఖ్యానించారు. -
సెంబ్‌కార్ప్‌కు ఎన్సీసీ పవర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలోని ఎన్సీసీ పవర్ ప్రాజెక్టులో మెజారిటీ వాటాను సింగపూర్‌కు చెందిన సెంబ్‌కార్ప్ దక్కించుకుంటోంది. దీన్లో ఎన్సీసీకి చెందిన 55% వాటాను రూ.460 కోట్లకు సెంబ్‌కార్ప్ ఇండస్ట్రీస్ కొనుగోలు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. 1,320 మెగావాట్ల ఈ విద్యుత్ ప్రాజెక్టులో 55% వాటా నాగార్జున కన్స్ట్రక్షన్స్కు చెందిన ఎన్సీసీ చేతిలో ఉండగా... మిగిలిన 45% ఎంపీ టి.సుబ్బరామిరెడ్డికి చెందిన గాయత్రి ప్రాజెక్ట్స్ చేతిలో ఉంది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలోని ముత్తుకూరు వద్ద నిర్మిస్తున్న ఈ విద్యుత్తు ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటిదాకా 35% పనులు పూర్తయ్యాయని, ప్రాజెక్టుకు మొత్తం రూ.1,800 కోట్ల రుణభారం ఉందని ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్న కంపెనీ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధికి చెప్పారు. ఈ డీల్‌కు సంబంధించిన ప్రాథమిక అవగాహనపై ఇరు సంస్థలూ బుధవారం సంతకాలు చేశాయని, మిగతా వ్యవహారాలన్నీ అనుకున్నట్లు పూర్తయితే డిసెంబర్ నెలాఖరులోగా అధికారిక ప్రకటన వెలువడుతుందని ఆయన చెప్పారు. ఒకవైపు వ్యయం పెరిగిపోవటం, రూపాయి క్షీణించటం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఎన్సీసీ ఇన్వెస్ట్ చేసిన రూ.460 కోట్లను తిరిగి చెల్లించటం ద్వారా దాని వాటాను సొంతం చేసుకోవటానికి సెంబ్‌కార్ప్ ముందుకొచ్చిందని, ముఖ్యంగా రుణభారం తగ్గుతుంది కనుక వాటా విక్రయానికి ఎన్సీసీ మొగ్గు చూపిందని తెలియవచ్చింది. ఈ ఒప్పందానికి అమర్‌చంద్ అండ్ మంగళదాస్ న్యాయ సేవలు అందిస్తుండగా, కేపీఎంజీ ఫైనాన్షియల్ అడ్వైజరీ సేవలను అందిస్తోంది. రూ.7,047 కోట్ల పెట్టుబడి అంచనాతో మొదలు పెట్టిన ఈ ప్రాజెక్టులో ఎన్సీసీ తన వాటా కింద రూ.960 కోట్లు సమకూర్చాల్సి ఉండగా ఇంతవరకు రూ.460 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. ప్రాజెక్టుకు రూ.1,800 కోట్ల రుణభారం ఉంది. ఎన్సీసీ తన వాటాను విక్రయించటంతో రూ.990 కోట్ల మేర రుణం కూడా సెంబ్‌కార్ప్‌కు బదిలీ అవుతుంది. ప్రాజెక్టులో యాజమాన్య హక్కు కోల్పోయినప్పటికీ దీనికి సంబంధించిన ఈపీసీ కాంట్రాక్టులను ఎన్‌సీసీనే నిర్వహిస్తుంది. ఇది 2015 నాటికి అందుబాటులోకి వస్తుందని అంచనా. ప్రాజెక్టుకు సంబంధించి ఇంతవరకూ బొగ్గు సరఫరా, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు జరగలేదు. దీని పక్కనే గాయత్రితో కలిసి సెంబ్‌కార్ప్ మరో విద్యుత్ ప్రాజెక్టును కలిగి ఉండటంతో ఈ ఒప్పందం సెంబ్‌కార్ప్‌కు లాభం చేకూరుస్తుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.