అప్పుల బాధతో అమ్మేస్తున్న దేశీయ కంపెనీలు | The focus of foreign companies on gmr company | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో అమ్మేస్తున్న దేశీయ కంపెనీలు

Published Thu, Jun 5 2014 1:25 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

అప్పుల బాధతో అమ్మేస్తున్న దేశీయ కంపెనీలు - Sakshi

అప్పుల బాధతో అమ్మేస్తున్న దేశీయ కంపెనీలు

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ విద్యుత్ ప్రాజెక్టులు ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని విదేశీ కంపెనీలు చక్కగా వినియోగించుకుంటున్నాయి. ఐదేళ్ల  క్రితం భారీ అంచనాలతో ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేసి చేపట్టిన విద్యుత్ ప్రాజెక్టులు వివిధ కారణాలతో మధ్యలో ఆగిపోవడంతో దేశీయ కంపెనీలకు గుదిబండగా తయారయ్యాయి. తగినంత ఇంధన సరఫరా లేకపోవడం, పర్యావరణ అనుమతులు వంటి అనేక కారణాలతో పలు ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోయాయి. కొన్ని పూర్తయినా ఇంధన సరఫరా లేక పనిచేయడం లేదు. దీంతో అటు ఆదాయం లేక ఇటు చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక ఇన్‌ఫ్రా కంపెనీలు విద్యుత్ ప్రాజెక్టుల నుంచి వైదొలగడానికి ఎదురు చూస్తున్నాయి.

ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంటూ ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్టులను విదేశీ సంస్థలు కొనుగోలు చేస్తున్నాయి. గత ఆరు నెలల్లోనే విదేశీ కంపెనీలు 5,391 మెగా వాట్ల విద్యుత్ సామర్థ్యాన్ని కైవసం చేసుకున్నాయి. ఇందుకోసం అవి వ్యయం చేసింది కేవలం రూ.13,000 కోట్లు మాత్రమే. ఇందులో రాష్ట్రానికి చెందిన విద్యుత్ ప్రాజెక్టులే అధికంగా ఉండటం విశేషం. ముఖ్యంగా నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో వున్న గాయత్రీ ప్రాజెక్ట్స్, నాగార్జునా కన్‌స్ట్రక్షన్స్, మీనాక్షి ఇన్‌ఫ్రా కంపెనీలకు చెందిన ప్రాజెక్టుల్లో మెజార్టీ వాటాలను విదేశీ కంపెనీలు చేజిక్కించుకున్నాయి.

 అదే బాటలో జీఎంఆర్..
 తాజాగా జీఎంఆర్ గ్రూపు మహారాష్ట్ర వరోరాలో నిర్మిస్తున్న 600 మెగావాట్ల జీఎంఆర్ ఎమ్కో ఎనర్జీలో 30 నుంచి 40 శాతం వాటాను విక్రయించే యోచనలో ఉన్నట్లు మార్కెట్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. రూ.3,948 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో 40 శాతం వాటాను రూ.1,500 కోట్లకు పైనే విక్రయించాలని చూస్తోంది. ఫ్రాన్స్‌కి చెందిన జీడీఎఫ్ సూజ్ ఈ వాటాను కొనడానికి ఉత్సాహం చూపిస్తున్నట్లు తెలుస్తోంది. కాని ఈ వార్తలపై మాట్లాడటానికి కంపెనీ ప్రతినిధులు సిద్ధంగా లేరు. ఊహాగానాలపై తాము స్పందించలేమని పేర్కొన్నారు.

 ఆందోళనకర పరిణామమే...
 ఎంతో కీలకమైన విద్యుత్ ప్రాజెక్టులు ఇలా విదేశీ కంపెనీల చేతిలోకి వెళ్తుండటంపై ఆర్థిక వేత్తలు, కంపెనీ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తప్పనిపరిస్థితుల్లో తాము విద్యుత్ ప్రాజెక్టును విదేశీ కంపెనీకి విక్రయించాల్సి వచ్చిందని, కాని ఇదే పరిస్థితి కొనసాగితే మరో ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల్లోకి దేశీయ పరిశ్రమ వెళుతుందేమోనన్న భయాన్ని ఒక ఇన్‌ఫ్రా కంపెనీ ప్రతినిధి వ్యక్తం చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కేవలం విద్యుత్ ప్రాజెక్టులనే కాకుండా వాటికి సరఫరా చేసే బొగ్గు, గ్యాస్ ఇంధన సరఫరా ఒప్పందాలను కూడా అవి దొడ్డిదారిన చేజిక్కించుకుంటున్నాయని, ఇందుకోసం ప్రాజెక్టు మొదలు పెట్టిన ప్రారంభ కంపెనీలకు మైనార్టీ వాటాలను ఉంచుతున్నాయన్నారు.

జీడీఎఫ్ సూజ్‌కి మన దేశ విద్యుత్ ఉత్పత్తిలో (2.12 లక్షల మెగావాట్లు) సగానికిపైగా అంటే 1,16,00 మెగావాట్ల సామర్థ్యం ప్రపంచవ్యాప్తంగా ఉందని, ఇలాంటి కంపెనీల చేతిలోకి మన విద్యుత్ రంగం వెళితే ఇవి మన ప్రభుత్వాల మాట వినే అవకాశం ఉండదని మరో కంపెనీ ప్రతినిధి వ్యాఖ్యానించారు. విదేశీ కంపెనీల చేతిలోకి విద్యుత్ వ్యవస్థ వెళితే అవన్నీ ఒక జట్టుగా ఏర్పడి విద్యుత్ టారిఫ్‌లను పెంచే ప్రమాదం ఉందని ఆర్థికరంగ నిపుణులు డి.పాపారావు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది రానున్న కాలంలో ఎదురయ్యే ప్రమాదాలకు సంకేతమని విద్యుత్ రంగ నిపుణులు కే.రఘు వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement