రూ.926 కోట్ల కాంట్రాక్టు 'గాయత్రీ' సొంతం
న్యూఢిల్లీః లీడింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సంస్థ గాయత్రీ ప్రాజెక్ట్స్ బీహార్ కు చెందిన ఓ భారీ కాంట్రాక్టును సొంతం చేసుకుంది. బీహార్ లోని ఎన్ హెచ్82 రహదారి విస్తరణ పనులకు సంబంధించిన మొత్తం 926 కోట్ల రూపాయలు విలువచేసే కాంట్రాక్టును తమ సంస్థ చేజిక్కించుకున్నట్లు కంపెనీ బీఎస్ ఈ రెగ్యులేటరీ ఫైలింగ్ లో పేర్కొంది.
హైదరాబాద్ కు చెందిన గాయత్రీ ప్రాజెక్ట్స్ కు బీహార్ రాష్ట్రం నుంచి 926 కోట్ల రూపాయల వ్యయం చేసే పనులకు సంబంధించిన ఆర్డర్ లభించింది. బీహార్ లోని గయ, హిస్వా, రాజ్ఘర్, నలంద, బిహార్షరీఫ్ సెక్షన్లకు చెందిన ఎన్ హెచ్ 82 కు సంబంధించిన నాలుగు లేన్ల రోడ్డు విస్తరణ కాంట్రాక్టును బీహార్ స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీఎస్టీడీసీ), మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్స్ అండ్ హైవేస్ ద్వారా పొందినట్లు సంస్థ ప్రకటించింది. ప్రముఖ జపనీస్ సహకార ఏజెన్సీ (జైకా) సహాయ నిధులతో ప్రాజెక్టును చేపట్టనున్నట్లు గ్రాయత్రీ తెలిపింది.